ఇప్పుడే అసలు వార్ మొదలైంది.. అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్.. ధర కూడా మీ రేంజ్‌లోనే!
గత కొంత కాలంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్ గురించి ఆటోమొబైల్ రంగంలో విపరీతమైన చర్చ జరుగుతుంది. దాని పేరే 'గోవాన్ క్లాసిక్ 350(goan classic 350)'. ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వినియోగదారులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. దీని టీజర్‌ను ఇప్పటికే కంపెనీ విడుదల చేయగా, దీని డిజైన్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా అట్రాక్ట్ అయిపోయారు. చూడటానికి చాలా స్టైలీష్‌గా ఉన్నటువంటి ఈ బైకు ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి ఘనంగా విడుదల అయింది. ఇండియాలో ప్రముఖ టూరిస్ట్ ప్రాంతం అయినటువంటి గోవాలో జరిగిన ఈవెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ రైడర్స్ కలల బైకును అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, గోవాన్ క్లాసిక్ 350 ప్రారంభ ధర రూ. 2.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీన్ని క్లాసిక్ 350 మోడల్ ఆధారంగా రూపొందించారు.
ఈ కొత్త బైక్ కస్టమర్లకు పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్, ట్రిప్ టీల్, రేవ్ రెడ్ అనే నాలుగు కలర్స్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇది చూడటానికి బాబర్ మాదిరిగా కనిపిస్తుంది. దీని స్టైలీష్ లుక్‌తో ఇతర 350 సీసీ ఇంజిన్ మోడళ్లకు గోవాన్ గట్టి పోటీ ఇస్తుంది. ఈ మోడల్ క్లాసిక్, బుల్లెట్, హంటర్ తర్వాత J-సిరీస్ ఇంజిన్‌లో ఐదో మోడల్‌గా ఉంది.

ఇది 349cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 20.2 bhp పవర్, 27 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. లాంగ్ డ్రైవ్ చేయడానికి అత్యంత అనువుగా ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే, లీటర్ పెట్రోల్‌కు 36.2 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. గోవాన్ క్లాసిక్ 350 రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ ఆప్షన్‌లో లభిస్తుంది.
రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోయే ఈ బైకులో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈజీగా రైడింగ్ చేయవచ్చు. ఇది ముందు 300 మి.మీ డిస్క్, వెనుకవైపు 270 మి.మీ డిస్క్ బ్రేకులను కలిగి ఉంది. రైడర్లకు అదనపు రక్షణ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను కూడా అందించారు.

ఇది టియర్ డ్రాప్ ఆకారంలో పెట్రోల్ ట్యాంక్, యూ-రకం హ్యాండిల్‌బార్, రౌండ్ LED హెడ్‌లైట్, ట్యూబ్‌లెస్ వైర్-స్పోక్ ట్రిమ్, LED బ్లింకర్‌లు, ట్రిప్పర్ నావిగేషన్ డిస్‌ప్లే ,సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సర్దుబాటు చేయగల లివర్‌లు మొదలగు వాటిని కలిగి ఉంది. ముందు డిస్‌ప్లేలో గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్‌మీటర్, వేగాన్ని తెలియజేయడానికి , స్పీడోమీటర్, వంటివి ఉన్నాయి.
ఈ బైకులో ప్రధానంగా దీని అల్లాయ్ చూపరులను ఆకట్టుకుంటాయి. ముందు టైర్ 19-అంగుళాలు, వెనుక టైర్ 16-అంగుళాలు ఉంటుంది. దీని బాడీ కొలతల పరంగా పొడవు 2,130 మి.మీ, వెడల్పు 825 మి.మీ గా ఉన్నాయి. వీల్‌బేస్ క్లాసిక్ 350తో పోలిస్తే 10mm పొడుగ్గా ఉంది. దీని బరువు 197 కిలోలు. ఇది నగర రోడ్లపై దూకుడుగా ప్రయాణిస్తుంది.

రైడింగ్ సాహసాలను కోరుకునే వారికి ఈ మోడల్ బాగా సెట్ అవుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ సెగ్మెంట్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఇదే విభాగంలో ఇప్పటికే ఉన్న మోడళ్ల అమ్మకాలు భారీగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త మోడల్ కూడా రానున్న రోజుల్లో విక్రయాల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








