ఏకంగా 226కిమీ మైలేజ్.. ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్జీ స్కూటర్ తీసుకొస్తున్న టీవీఎస్.. ధర కూడా చాలా తక్కువ
భారత మార్కెట్లో నమ్మకమైన స్కూటర్‌గా టీవీఎస్ జూపిటర్ పేరుగాంచింది. దీని ఆకట్టుకునే డిజైన్, ఎన్నో ఫీచర్ల వల్ల వినియోగదారులు దీన్ని ఎక్కువగా కొంటున్నారు. దీనికి తగ్గట్టే ఈ జూన్ నెలలో ఏకంగా 1,07,980 యూనిట్లను టీవీఎస్ జూపిటర్ అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి అమ్మకాలు 49.76% పెరిగాయి.
2024లో ఇదే సమయంలో 72,100 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు, టీవీఎస్ సరికొత్త అడుగు వేయబోతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ పవర్‌ట్రైన్‌తో కూడిన జూపిటర్ స్కూటర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరి ఈ స్కూటర్ ఎలా ఉంటుంది, ధర ఎంత, మైలేజ్ ఎంత అనే వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ప్రస్తుతం టీవీఎస్ కంపెనీ, జూపిటర్ స్కూటర్‌ను సీఎన్‌జీ ఆప్షన్‌లో మార్కెట్లోకి తీసుకురావడానికి పూర్తి సన్నాహాలు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ స్కూటర్‌ను ఈ అక్టోబర్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, కంపెనీ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సరికొత్త టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 95,000 ఉండొచ్చని అంచనా. అంతేకాదు, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్ అనే ప్రత్యేక గుర్తింపును పొందనుంది.

కొత్త జూపిటర్ సీఎన్‌జీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చాలావరకు ప్రస్తుతం ఉన్న సాధారణ జూపిటర్ మోడల్‌ను పోలి ఉంటుంది. దీన్ని భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ప్రదర్శించారు. ఇది లూనార్ వైట్ గ్లాస్, మీటియోర్ రెడ్ గ్లాస్, టైటానియం గ్రే మ్యాట్, డాన్ బ్లూ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లాస్ వంటి రంగులలో అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
ఈ స్కూటర్‌లో మరింత పవర్ఫుల్ 124.8-సీసీ సింగిల్-సిలిండర్ పెట్రోల్/సీఎన్‌జీ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.1 బీహెచ్‌పీ పవర్, 9.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా, ఈ స్కూటర్ 226 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని అంచనా.

ఇది 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 1.4 కేజీల సీఎన్‌జీ ఫ్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇండికేటర్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, యూఎస్‌బీ ఛార్జర్ మరియు టీవీఎస్ కనెక్ట్ అప్లికేషన్‌తో సహా ఎన్నో లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉంటాయి.
ప్రస్తుత టీవీఎస్ జూపిటర్ మోడల్స్ విషయానికి వస్తే.. టీవీఎస్ జూపిటర్ 110 ధర రూ. 78,631 నుండి రూ. 91,781 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో 113.3 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 53 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది. ఇందులో డిజిటల్-ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, యూఎస్‌బీ ఛార్జర్. డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.
అలాగే టీవీఎస్ జూపిటర్ 125 ధర రూ. 80,740 నుండి రూ. 92,001 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో 124.8-సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 57కిమీ వరకు మైలేజీని అందిస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్. 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ & 90/90-12 కొలత గల ట్యూబ్‌లెస్ టైర్లు, రైడర్ సేఫ్టీ కోసం ఇందులో డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.
ఇది టైటానియం గ్రే డ్రమ్, ఇండిబ్లూ డ్రమ్, డాన్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. మొత్తం మీద టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ మార్కెట్లోకి వస్తే, ఇది స్కూటర్ ప్రియులకు మరింత మెరుగైన మైలేజ్, తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. ఇది కచ్చితంగా స్కూటర్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








