ఒక నెల ఈఎంఐ ఎక్స్‌ట్రా పక్కన పెట్టుకోండి.. ఏథర్ ఈవీ ఇక కాస్త కాస్ట్లీ గురూ!
కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జనవరి 1వ తేదీ నుండే ఈ పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు,పెరగనున్న ధరల వివరాల గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగాన్ని ముడిసరుకుల ధరల పెరుగుదల తీవ్రంగా వేధిస్తోంది. ఏథర్ సంస్థ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో వాడే బ్యాటరీ సెల్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ వంటి కీలక భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.

అయితే, అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు పెరగడంతో పాటు, యూఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి (రూ.91.01) పడిపోవడం కంపెనీపై పెను భారాన్ని మోపింది. ఈ అదనపు ఉత్పత్తి వ్యయాన్ని తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ స్పష్టం చేసింది.
ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల శ్రేణిపై రూ. 3,000 వరకు ధరలను పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫ్యామిలీ స్కూటర్ రిజ్తా (Rizta) ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర సుమారు రూ. 1,04,999 ఉండగా, జనవరి నుంచి ఇది దాదాపు రూ. 1,07,999 కి చేరవచ్చు.

ఇక సంస్థ అత్యంత పవర్ఫుల్ మోడల్ 450 అపెక్స్ (450 Apex) ధర ప్రస్తుతం రూ. 1,89,999 ఉండగా, పెంపు తర్వాత ఇది రూ. 1,92,999 దాటే అవకాశం ఉంది. పెరిగే ధరలు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పటికే బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.
ధరల పెంపు వార్త ఇలా ఉంటే, ఏథర్ సంస్థ తన విక్రయాల్లో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. సంస్థ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫ్యామిలీ ఈవీ స్కూటర్ రిజ్తా లాంచ్ అయిన కేవలం 20 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది.

ఇందులో మరో విశేషం ఏమిటంటే.. మొదటి లక్ష యూనిట్ల అమ్మకాలు జరగడానికి దాదాపు 14 నెలలు పట్టగా, చివరి లక్ష యూనిట్లు కేవలం 6 నెలల్లోనే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఏథర్ మొత్తం అమ్మకాల్లో 70 శాతానికి పైగా రిజ్తా మోడలే వాటాను కలిగి ఉందంటే, ఈ స్కూటర్ కు భారతీయ కుటుంబాల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
మీరు పెరిగిన ధరల నుంచి తప్పించుకోవాలనుకుంటే, డిసెంబర్ 31లోపు స్కూటర్ బుక్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ప్రస్తుతం కంపెనీ 'ఎలక్ట్రిక్ డిసెంబర్' (Electric December) పేరుతో అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.
సెలక్ట్ చేసిన నగరాల్లో సుమారు రూ.20,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్లతో పాటు, బ్యాటరీపై 8 ఏళ్ల పొడిగించిన వారంటీ వంటివి ఉన్నాయి. కొత్త ధరలు అమల్లోకి రాకముందే ఈ ఆఫర్లను ఉపయోగించుకుని మీ ఇష్టమైన ఏథర్ స్కూటర్ ను ఇంటికి తీసుకెళ్లండి.


Click it and Unblock the Notifications








