కొత్త తరానికి పునాది వేసిన ఏథర్.. తక్కువ సర్వీస్ ఖర్చుతో, యూనిబాడీ డిజైన్‌లో స్కూటర్లు
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో అగ్రగామి స్థానం సంపాదించుకున్న ఏథర్ ఎనర్జీ(Ather Energy), 2025లో జరిగిన మూడవ Ather Community Day సందర్భంగా భవిష్యత్తు వైపు తీసుకెళ్లే పలు సరికొత్త ఆవిష్కరణలను పరిచయం చేసింది. ఈ ఈవెంట్‌లో కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే వాహనాలను రూపొందించడానికి ఒక వేదికను తీసుకొచ్చింది. తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆల్-న్యూ EL ప్లాట్‌ఫారమ్ ఆవిష్కరించింది. ఇది 450 సిరీస్ తర్వాత కంపెనీ రూపొందించిన తొలి వాహన ఆర్కిటెక్చర్. ఈ ప్లాట్‌ఫారమ్‌ను ప్రత్యేకంగా మల్టిపుత్ వినియోగం (Versatility), స్కేలబిలిటీ (Scalability), ఖర్చు ఆప్టిమైజేషన్ (Cost Optimisation) దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ప్రకటించిన టెక్నాలజీలు, వాహన ప్లాట్‌ఫారమ్‌లు కేవలం ఏథర్‌కే కాదు, మొత్తం భారతీయ EV మార్కెట్‌కే ఒక మైలురాయి కానున్నాయి.
ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రాబోయే కాలంలో ఏథర్ వివిధ సెగ్మెంట్‌లలో ప్రవేశ స్థాయి స్కూటర్లు నుండి ప్రీమియం పనితీరు మోడళ్ల వరకు అనేక కొత్త మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. అంటే, ఒకే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా విభిన్న ధరల్లో, విభిన్న ఫీచర్లతో వాహనాలు మార్కెట్లోకి రావడం ఖాయం. ఇది భారతీయ రైడర్లకు ఎంపికల స్వేచ్ఛ, పనితీరులో కొత్త ప్రమాణాలు, వినూత్న డిజైన్‌ను అందించనుంది.

ఏథర్ తన ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్ AtherStack 7.0ని కూడా ఈ వేడుకలో పరిచయం చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ వాయిస్ ఇంటరాక్షన్. అంటే, ఇకపై రైడర్లు తమ స్కూటర్‌తో వాయిస్ కమాండ్‌ల ద్వారా మాట్లాడి కంట్రోల్ చేయగలరు. నావిగేషన్ సెట్టింగ్స్ మార్చడం, కాల్ పిక్ చేయడం, లేదా స్కూటర్ గురించి వివరణాత్మక సమాచారం తెలుసుకోవడం ఇవన్నీ వాయిస్ ద్వారానే చేయగలుగుతారు.
దీనితో పాటు, కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, మరింత సహజమైన టచ్ రిస్పాన్స్, వేగవంతమైన ప్రాసెసింగ్, స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్‌లు చేరాయి. దీనివల్ల టెక్నాలజీ మరింత సులభం, సౌకర్యవంతం, యూజర్ ఫ్రెండ్లీ అవుతుంది. ఈ కమ్యూనిటీ డేలో మరో ముఖ్యమైన అంశం ఏథర్ నెక్స్ట్-జనరేషన్ ఫాస్ట్ చార్జింగ్ సొల్యూషన్. ఇప్పటివరకు ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కంటే మరింత వేగంగా, సమర్థవంతంగా వాహనాలను ఛార్జ్ చేసే టెక్నాలజీని ఏథర్ పరిచయం చేయనుంది.

ఆల్-న్యూ EL ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న Ather రిస్టా, 450 సిరీస్ స్కూటర్ల ప్లాట్‌ఫారమ్‌లకు పూర్తిగా భిన్నమైన డిజైన్. ఈ కొత్త EL ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేకమైన స్టీల్ ఫ్రేమ్‌ను అమర్చారు. దీని ముఖ్యమైన విశేషం ఏమిటంటే, 2kWh నుండి 5kWh వరకు విభిన్న పరిమాణాల్లోని బ్యాటరీలను ఇందులో అమర్చుకోవచ్చు. దీని వలన, ఒకే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎంట్రీ-లెవల్ నుండి ప్రీమియం స్కూటర్ల వరకు సులభంగా తయారు చేయవచ్చు.
ఈ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన స్కూటర్లను యూనిబాడీ ఛాసిస్ డిజైన్‌తో తయారు చేశారు. ఈ డిజైన్ వల్ల విడిభాగాల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. అంటే, వాహనం సర్వీస్ ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయి. వినియోగదారులకు ఇది ప్లస్ పాయింట్. ఏథర్ ఈ EL ప్లాట్‌ఫారమ్‌ను మాడ్యులర్ పద్ధతిలో డిజైన్ చేసింది. దీని వలన ఒకే ఫ్రేమ్ ఆధారంగా మ్యాక్సీ స్కూటర్‌లు, స్పోర్టీ మోడళ్లు, ఎకనామిక్ ఎడిషన్‌లును తక్కువ సమయంలో మార్కెట్లోకి తీసుకురావచ్చు.

ఇప్పటికే ఏథర్, ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారంగా రూపొందిస్తున్న మ్యాక్సీ, స్పోర్టీ స్కూటర్ల టీజర్ ఫోటోలను విడుదల చేసింది. ఇవి సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ కొత్త EL ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించే స్కూటర్ల ధర, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ స్కూటర్లకంటే తక్కువగా ఉంటుందని అంచనా. ఈ వేడుకలో మరో ప్రత్యేక కాన్సెప్ట్ మోడల్ Redux కూడా ఆవిష్కరించింది.


Click it and Unblock the Notifications








