ఆ ఒక్కదాని వల్లే బజాజ్ అమ్మకాల్లో దుమ్ములేపింది.. లేకపోతే మొత్తం సీన్ తలకిందులైపోయేది..!
దేశీయ ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో లిమిటెడ్ (Bajaj Auto), మళ్లీ ఒకసారి మార్కెట్‌లో తన సత్తాను చాటింది. తీవ్రమైన పోటీ ఉన్నా, దిగ్గజ కంపెనీల మధ్య నుంచి తనకు ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటూ, బజాజ్ ఆటో జులై 2025లో గణనీయమైన విక్రయాలు నమోదు చేసింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, బజాజ్ ఆటో గత నెలలో మొత్తం 3,66,000 (2 వీలర్+ కమర్షియల్) వాహనాలను విక్రయించింది. ఈ మొత్తంలో టూవీలర్స్‌తో పాటు వాణిజ్య వాహనాల దేశీయంగా అమ్మకాలతో పాటు ఎగుమతులు కూడా ఉన్నాయి. ఈ సేల్స్ ఇదే జూలై 2024తో పోలిస్తే 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే అప్పట్లో అమ్ముడైన వాహనాల సంఖ్య 3,54,169 యూనిట్లు కాగా, ఇప్పుడు అదికాస్తా మరింత పెరిగింది.
మార్కెట్‌లో కాస్త మందగమనం కనిపించినప్పటికీ, బజాజ్ ఈ పెరుగుదల ద్వారా స్థిరమైన పెర్ఫార్మెన్స్‌ను మరోసారి నిరూపించుకుంది. ఈ వృద్ధికి ప్రధాన కారణం ఎగుమతుల్లో మంచి పెరుగుదల కనింపించడం. దేశీయ మార్కెట్లో టూవీలర్, వాణిజ్య వాహనాల అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ, బజాజ్ ఆ లోటును ఒక్క ఎగుమతుల ద్వారా సమర్థవంతంగా భర్తీ చేసింది. లేకపోతే మొత్తం సీన్ తలకిందులైపోయేది. విదేశీ మార్కెట్లలో బజాజ్ మోటార్‌సైకిళ్లు, ఆటోరిక్షాలు విశ్వసనీయతను సాధిస్తున్నాయని స్పష్టంగా చూపిస్తుంది.

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్‌లో జులై 2025లో కొంత వెనకడుగు వేసింది. గడిచిన ఏడాదితో పోలిస్తే, దేశీయ అమ్మకాలు 13 శాతం తగ్గి 2,10,997 యూనిట్ల నుండి 1,83,143 యూనిట్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం, టూవీలర్ వాహన విభాగంలో వచ్చిన తీవ్రమైన అమ్మకాల పతనం కావడం. టూవీలర్ సెగ్మెంట్ దేశీయంగా బలంగా లేకపోవడంతో అది మొత్తం అమ్మకాలపై పడింది.
దేశీయంగా ఒక్క టూవీలర్ సేల్స్ చూసినట్లయితే జులై 2025లో 1,39,279 అమ్ముడుపోయాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో 1,68,847 యూనిట్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన సేల్స్ 18 శాతం తగ్గడం గమనార్హం. ఎగుమతులను చూస్తే ఇదే టూవీలర్ సెగ్మెంట్ జులై 2025లో 1,56,968 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో 1,28,694గా నమోదైంది. ఈ సారి ఎగుమతులు 22 శాతం పెరిగాయి.

వాణిజ్య వాహనాల విషయానికి వస్తే జూలై 2025లో దేశీయ వాణిజ్య వాహన అమ్మకాలు 4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలలో 42,150 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి అది 43,864 యూనిట్లకు పెరిగింది. స్థిరంగా ఎదుగుతున్న ట్రాన్స్‌పోర్ట్ అవసరాలు, శక్తివంతమైన నెట్‌వర్క్, నగరాలు-పల్లెలకి మధ్య సరుకు రవాణా అవసరాల పెరుగుదల ఈ వృద్ధికి బలమైన మద్దతుగా నిలిచాయి.
ఇది మాత్రమే కాదు, బజాజ్ వాణిజ్య వాహనాల ఎగుమతుల పరంగా రికార్డు స్థాయిలో 79 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది జులైలో 14,478 యూనిట్లు మాత్రమే ఎగుమతి కాగా, ఈ ఏడాది అదే నెలలో అది ఏకంగా 25,889 యూనిట్లకు చేరుకుంది. ఇది కంపెనీకి గణనీయమైన ఊపును ఇచ్చే పరిణామం. ఈ బలమైన ఎగుమతి వృద్ధి, బజాజ్ ఆటో బ్రాండ్‌కు విదేశీ మార్కెట్లలో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది.

ముఖ్యంగా దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, బజాజ్ ఆటో తన వాణిజ్య వాహనాలను సరైన రూట్‌లో నడిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా చెప్పాలంటే టూవీలర్ వాహన విభాగం కొంత వెనకబడినా, వాణిజ్య వాహన విభాగం మాత్రం బజాజ్ ఆటోకు నమ్మకంగా నిలబడింది. దేశీయంగా స్థిరమైన వృద్ధి, అంతర్జాతీయంగా భారీ ఎగుమతుల పెరుగుదల.. ఇవి కలిసి కంపెనీ మొత్తం పనితీరును నిలబెట్టాయి.


Click it and Unblock the Notifications








