ఒక్క నెలలో 3.60 లక్షల మంది అభిమానం.. బజాజ్ ఆటోకు కొత్త ధైర్యం ఇచ్చిన గ్లోబల్ విక్రయాలు
దేశీయ దిగ్గజ వాహన తయారీదారు అయినటువంటి బజాజ్ (Bajaj) టూవీలర్స్, వాణిజ్య వాహన విభాగాల్లో నిలకడగా తన స్థానాన్ని నిలుపుకుంటుంది. మార్కెట్లో ఇతర కంపెనీల నుంచి బలమైన పోటీ వస్తున్నప్పటికి వాటిని ఎదుర్కొని బలమైన అమ్మకాలను సాధిస్తుంది. తాజాగా జూన్ నెల ముగిసిన నేపథ్యంలో బజాజ్ ఆటో తన నెలవారీ సేల్స్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, జూన్, 2025లో మొత్తం 3,60,806 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది 2024 జూన్‌లో నమోదైన 3,58,477 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే సుమారుగా 1 శాతం వృద్ధి మాత్రమే. ఇటివలి కాలంలో కంపెనీ కొత్త మోడళ్ల విడుదలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తరువాతి నెలలో ఈ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశంలో మెల్లగా పండుగల సీజన్ మొదలయ్యే సమయం దగ్గరికి వచ్చింది. రానున్న రోజుల్లో అమ్మకాల్లో వృద్ధి కనిపించనుంది. జూన్ నెల అమ్మకాలను చూసినట్లయితే ఈ స్వల్ప పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణం ఎగుమతుల విభాగం నుంచే వచ్చాయి. డేటా ప్రకారం, జూన్ నెలలో విదేశీ మార్కెట్లకు సరఫరా చేసిన వాహనాల సంఖ్య 21 శాతం వృద్ధి సాధించింది. ఇదే సమయంలో స్వదేశీ మార్కెట్‌లో బజాజ్‌కి కొంత తగ్గుదల ఎదురైంది.

దేశీయ అమ్మకాలు ఈ నెలలో 13 శాతం తగ్గాయి. ఎగుమతుల బలంతో ఎదురొస్తున్న సవాళ్లను అధిగమించి, గ్లోబల్ మార్కెట్లలో తన ఉనికిని మరింత విస్తరించేందుకు ఈ కంపెనీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని సేల్స్ స్పష్టంగా సూచిస్తున్నాయి. బజాజ్ ఆటో జూన్ 2025లో టూవీలర్ వాహన విభాగంలో ఆసక్తికరమైన ట్రెండ్‌ను చూపించింది. కొంతమంది వినియోగదారుల కొనుగోలు ఆలోచనలలో మార్పు, బజాజ్ అమ్మకాలపై ప్రభావం చూపాయి.
జూన్ నెలలో బజాజ్ ఆటో మొత్తం 2,98,484 యూనిట్ల టూవీలర్స్‌ను మాత్రమే విక్రయించింది. ఇది 2024 జూన్‌లో నమోదైన 3,03,646 యూనిట్లతో పోలిస్తే సుమారుగా 2 శాతం తగ్గుదల. ఈ మొత్తంలో గత నెలలో దేశీయ టూవీలర్ వాహన అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. జూన్ 2024లో 1,77,207 యూనిట్లు విక్రయించగా, జూన్ 2025లో ఈ సంఖ్య 1,49,317 యూనిట్లకు పరిమితమయ్యింది. ఇది సుమారుగా 16 శాతం తగ్గుదల.

దీనికి ప్రధాన కారణం తగ్గిన వినియోగదారుల డిమాండ్, అలాగే కొంతమంది ఇతర కంపెనీల మోడళ్లకు పెరుగుతున్న ఆకర్షణ కారణమని మార్కెట్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, టూవీలర్ ఎగుమతుల విభాగంలో గత సంవత్సరం జూన్‌లో 1,26,439 యూనిట్లు ఎగుమతి చేసిన బజాజ్, ఈసారి సంఖ్యను 1,49,167 యూనిట్లకు పెంచగలిగింది. ఇది సుమారుగా 18 శాతం వృద్ధి. కంపెనీ గ్లోబల్ మార్కెట్లో బలపడిందనడానికి ఇది మరో నిదర్శనం.
దేశీయ మార్కెట్లలో వాణిజ్య వాహనాల అమ్మకాలు పెద్దగా మార్పులు లేకుండా కొనసాగాయి. జూన్ 2024లో 39,244 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది జూన్‌లో అమ్మకాల సంఖ్య కేవలం కొద్ది తేడాతో 39,143 యూనిట్లకు చేరింది. అంటే మొత్తం 101 యూనిట్ల తేడా మాత్రమే, ఇది స్థిరమైన వినియోగధారుల డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. అయితే, వాణిజ్య వాహనాల ఎగుమతులు ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి.

జూన్ 2024లో 15,587 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేయగా, ఈ సంవత్సరం అదే నెలలో సంఖ్య ఒకేసారి దాదాపు 49 శాతం వృద్ధి సాధించి 23,179 యూనిట్లకు పెరిగింది. ఇది బజాజ్ ఆటో అంతర్జాతీయ మార్కెట్లలో పట్టు మరింత బలపడినట్లుగా స్పష్టంగా చూపుతోంది. మొత్తంగా, వాణిజ్య వాహనాల అమ్మకాలు జూన్ 2024లో 54,831 యూనిట్లుగా ఉండగా, జూన్ 2025లో ఇది 62,322 యూనిట్లకు చేరి 14 శాతం వృద్ధిని నమోదుచేసింది.
బజాజ్ ప్రసిద్ధ మోడళ్లు అయినటువంటి ప్లాటినా, చేతక్‌లతో పాటు కంపెనీ పల్సర్ సిరీస్ దేశంలోని కొనుగోలుదారులను ఆకట్టుకుంటూనే ఉంది. ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో చేతక్ వినియోగదారుల నుంచి మెరుగైన స్పందనను రాబడుతుంది. ఈ నేపథ్యంలో కంపెనీ దానికి కొనసాగింపుగా మరిన్ని మోడళ్లను తీసుకురావాలని చూస్తుంది.


Click it and Unblock the Notifications








