తక్కువ ధర, ఎక్కువ రేంజ్.. నాన్న,తాతలు నడిపిన బండి.. ఆ పేరు చూసి దాని కోసమే తెగ కొనేస్తున్నారు
బజాజ్ చేతక్ (Bajaj Chetak)... ఈ పేరు వినగానే మన తాతలు, నాన్నలు నడిపిన పాత తరం స్కూటర్ గుర్తుకొస్తుంది. ఒకప్పుడు భారతీయ రోడ్లను ఏలిన ఈ స్కూటర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్ (Electric Avatar)లో మళ్లీ వచ్చింది. ఈ పాత పేరు, కొత్త టెక్నాలజీ కాంబినేషన్ కారణంగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారతీయ కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ నెలలో బజాజ్ చేతక్ అమ్మకాలు భారీగా పెరిగాయి. నెలవారీ సేల్స్ రిపోర్టు ముఖ్యంగా దాని అమ్మకాల వృద్ధి, వేరియంట్లు, ధరల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లో బజాజ్ చేతక్ స్థిరంగా రాణిస్తోంది. దీనికి పాత పేరుతో పాటు, క్వాలిటీ బాడీ కూడా తోడైంది. గాడివాడి నివేదిక ప్రకారం.. బజాజ్ కంపెనీ 2025 సెప్టెంబర్ నెలలో మొత్తం 30,558 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గత సంవత్సరం (2024) సెప్టెంబర్ నెలలో కేవలం 28,517 స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో పోలిస్తే 2025 సెప్టెంబర్‌లో ఏకంగా 2,041 స్కూటర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.

దీని ఫలితంగా బజాజ్ చేతక్ అమ్మకాలు 7.16 శాతం పెరిగాయి. బజాజ్ చేతక్ ఈ అమ్మకాల వృద్ధి కారణంగా 2025 సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్కూటర్ల జాబితాలో స్థానం సంపాదించింది. అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ల జాబితాలో చేతక్ 6వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో మొదటి 5 స్థానాల్లో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సిస్, టీవీఎస్ ఎన్టార్క్, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు ఉన్నాయి.
ప్రస్తుతం బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 4 వేరియంట్లలో లభిస్తోంది. ఒక్కో వేరియంట్‌కు బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధర, రేంజ్ మారుతుంది. చేతక్ 3001 వేరియంట్ ధర రూ. 1,02,400 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇందులో 3.0 kWh బ్యాటరీ ఉంటుంది. రైడింగ్ రేంజ్ 127 కిలో మీటర్లుగా ఉంది.

చేతక్ 3501 వేరియంట్ ధర రూ. 1,34,500 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇందులో 3.5 kWh బ్యాటరీ ఉంటుంది. రైడింగ్ రేంజ్ 153 కిలో మీటర్లుగా ఉంది. చేతక్ 3502 వేరియంట్ ధర రూ. 1,22,499 (ఎక్స్-షోరూమ్). ఇందులో కూడా 3.5 kWh బ్యాటరీ ఉంటుంది. రైడింగ్ రేంజ్ 153 కిలో మీటర్లుగా ఉంది.
చేతక్ 3503 వేరియంట్ ధర రూ. 1,09,500 (ఎక్స్-షోరూమ్). ఇందులో కూడా 3.5 kWh బ్యాటరీ ఉంటుంది. కానీ రైడింగ్ రేంజ్ 151 కిలో మీటర్లుగా ఉంది. ఇవి బజాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించిన ఎక్స్-షోరూమ్ ధరలు. రైడింగ్ రేంజ్‌లు.

టీవీఎస్, ఏథర్, ఓలా వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు బజాజ్ చేతక్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆశించే కస్టమర్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. నాన్న, తాతల నాటి దర్జాను మనం కూడా అనుభవించవచ్చు.


Click it and Unblock the Notifications








