330 కి.మీ మైలేజ్.. బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైక్ ధర తగ్గింపు.. ఎంతంటే?
బజాజ్ ఆటో (Bajaj Auto) సంస్థ ఇటీవల టూవీలర్ రంగంలో ఓ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్‌గా గుర్తింపు పొందిన బజాజ్ ఫ్రీడమ్ 125 (Bajaj Freedom 125), 2024 జూలై 5న వైభవంగా విడుదలై మంచి చర్చనీయాంశంగా మారింది. ప్రారంభించినప్పటి నుంచి వినియోగదారుల నుంచి ఈ బైక్‌కి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ మోడల్‌కి లభిస్తున్న ఆదరణను బట్టి చూస్తే, మార్చి 2025 వరకు మొత్తం 50,047 యూనిట్ల బజాజ్ ఫ్రీడమ్ CNG బైకులు అమ్ముడైన సంగతి మరింత విశేషం. భారతదేశంలోని మధ్యతరగతి వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు బజాజ్ ఈ బైక్ ధరను మరింత తక్కువకు, అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్‌మీడియా హ్యండిల్‌లో తెలిపారు.
ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన NG04 డ్రమ్ వేరియంట్ ధరను రూ.5,000 మేర తగ్గించి రూ.90,976 నుంచి రూ. 85,976 (ఎక్స్-షోరూమ్ ధర)కి తీసుకువచ్చారు. ఈ తగ్గింపు వల్ల బజాజ్ ఫ్రీడమ్ మరింత మందికి చేరువ అవుతుంది. టూవీలర్స్‌లో తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక మైలేజ్ కోరుకునే వినియోగదారులకు ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. బజాజ్ చేసిన ఈ ధర తగ్గింపు ఎంట్రీ-లెవల్ వేరియంట్‌కి మాత్రమే పరిమితమై ఉంది.

మిగిలిన మిడ్-లెవల్ వేరియంట్ అయిన NG04 డ్రమ్ LED, టాప్-లెవల్ వేరియంట్ అయిన NG04 డిస్క్ LED* ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు. ఈ రెండు వేరియంట్లు ప్రస్తుతం అదే పాత ధరలతో కొనుగోలుదారులకు లభిస్తున్నాయి. అదే, NG04 డ్రమ్ LED మిడ్ వేరియంట్ ధర రూ.95,981, NG04 డిస్క్ LED టాప్ వేరియంట్ ధర రూ.1.11 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
బజాజ్ ఫ్రీడమ్ 125 స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన పనితీరుతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్‌గా అందుబాటులోకి వచ్చిన ఈ బైక్, ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ బైక్‌ను ఒక్కసారి చూస్తేనే ఆకర్షితులయ్యేలా ఉంటుంది. దీని డిజైన్‌కి మెరిసే LED హెడ్‌లైట్ మరింత ప్రత్యేకతను జోడిస్తుంది. బాడీకి చక్కటి షేప్, ఫ్యూచరిస్టిక్ ఫినిష్ కలగలిపి బైక్‌ను స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుంటుంది.

పవర్ ట్రెయిన్ విషయానికి వస్తే, బజాజ్ ఫ్రీడమ్‌లో 125 సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ పెట్రోల్/సీఎన్జీ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 9.4 PS పవర్, 9.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని పనితీరు కేవలం తేలికపాటి డ్రైవింగ్‌కే పరిమితం కాదు, రోజువారి ప్రయాణాలకు సరిపడేలా, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను దీని ఇంజిన్‌క జతచేశారు. ఇది 330 కి.మీ./కిలో మైలేజీ ఇవ్వగల కెపాసిటీ కలిగి ఉంది.
ఫ్యూయల్ ఎఫిషియెన్సీని మరింత మెరుగుపరిచేలా, ఈ బైక్‌కి రెండు ప్రత్యేక ఫ్యూయల్ ట్యాంకులు ఉన్నాయి, ఒక్కోటి 2 లీటర్లు/కిలో సామర్థ్యం కలిగి ఉంటాయి, ఇది డ్రైవింగ్‌కు పెట్రోల్, CNG రెండింటినీ జోడించి మంచి దూరాన్ని అందిస్తుంది. బైక్ బరువు 147.8 కిలోలు కాగా, 825 mm సీటు ఎత్తు, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1340 mm వీల్‌బేస్‌తో ఇది అన్ని రకాల రోడ్లకు అనుకూలంగా ఉంటుంది.

ఈ బైకులో LCD డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి, ఇవి రైడింగ్ అనుభూతిని మరింత స్మార్ట్‌గా మార్చుతాయి. సేఫ్టీ పరంగా కూడా ఫ్రీడమ్ బైక్ ఎలాంటి రాజీపడకుండానే రూపొందించబడింది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, సులభమైన నియంత్రణను అందించే డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్‌లు వంటివి దీనిలో ఉన్నాయి. ధర తగ్గింపు గురించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని షోరూమ్‌లో సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications








