ఇప్పటి వరకు ఊహించని ధరలో 100cc పెట్రోల్ బైక్‌లకు గట్టి పోటీగా వస్తున్న ఒబెన్ టూవీలర్స్
బెంగళూరుకు చెందిన ఓబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) భారతదేశంలోని వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా, ఈ సంస్థ కీలకమైన విభాగంలోకి అడుగుపెట్టి, సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రఖ్యాత పెట్రోల్ బైక్‌లైన హోండా షైన్, హీరో స్ప్లెండర్ లాంటి 100cc విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, ఒబెన్ ఎలక్ట్రిక్ తాజాగా "O100" అనే ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించింది. ఇది లక్ష రూపాయల లోపు ధరలో అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయడానికి రూపొందించబడిన వినూత్న వేదిక. ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడ్డ బైక్‌లు, తక్కువ ఖర్చుతో నడిచే శక్తివంతమైన, నమ్మదగిన మోడళ్లుగా మార్కెట్‌లోకి రానున్నాయి.
ప్రపంచం నెమ్మదిగా ఈవీల వైపు మళ్లుతున్న సమయంలో, ఓబెన్ ఎలక్ట్రిక్ తీసుకుంటున్న ఈ కొత్త దిశా మార్గం వాహన పరిశ్రమలో గణనీయమైన పరిణామంగా చెప్పవచ్చు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, మంచి పనితీరు కలగలిపిన ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలకు అందుబాటులో కొత్త మోడళ్లను అందించనుంది. బెంగళూరులోని ఒబెన్ ఎలక్ట్రిక్ పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ఓ కీలక ప్రాజెక్ట్ శరవేగంగా సాగుతోంది.

ఈ ప్రాజెక్ట్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్నది కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల వేదిక, O100 ప్లాట్‌ఫామ్. దీన్ని సాంకేతిక భాషలో "ప్లాట్‌ఫామ్" అంటారు. అయితే ఇది ఏకంగా ఒక బైక్‌కి పునాది వంటిది. ఇది ఒక బలమైన ఫౌండేషన్. సామాన్యంగా చెప్పాలంటే, ఇది బైక్‌కు బేస్ ఫ్రేమ్‌లా పనిచేసే 'చాసిస్' అని భావించవచ్చు. ఈ వేదిక ఆధారంగా రూపుదిద్దుకోబోయే మోటార్‌సైకిళ్లు రూ. 1 లక్ష లోపు ధరతో ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇది చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత చేరువ చేసే దిశగా ఒక పెద్ద అడుగు అవుతుంది. భవిష్యత్తులో భారతదేశపు సాధారణ వాహన వినియోగదారులకు ఇది ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయంగా మారే అవకాశముంది. వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చగల సామర్థ్యంతో ఈ ప్లాట్‌ఫామ్ ఉంటుంది. మల్టిపుల్ వేరియంట్స్, విభిన్న బ్యాటరీలు వంటి వాటితో కూడిన మోడళ్లను తయారు చేయనున్నారు.

ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత్ అంతటా తన వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించింది. దేశంలోని టైర్1, టైర్ 2, టైర్ 3 నగరాల్లో తన ఉనికిని పటిష్టం చేయాలని సంస్థ సంకల్పించింది. ఈ సంవత్సరాంతం కల్లా 100కి పైగా షోరూమ్‌లను ప్రారంభించాలని ఒబెన్ యోచిస్తోంది, ఇది భారతీయ మార్కెట్‌పై సంస్థ దృష్టిని స్పష్టంగా చూపిస్తుంది. ప్రస్తుతం ARX ప్లాట్‌ఫామ్ ఆధారంగా రెండు ఈవీ మోడళ్లను రోర్, రోర్ EZ విక్రయిస్తోంది.
ఒబెన్ ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి తీసుకువచ్చిన రెండు ప్రధాన మోడళ్లలో "ఒబెన్ రోర్" తన శక్తివంతమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రూ. 1.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉన్న ఈ మోడల్‌కి 4.4 కిలోవాట్ గంటల కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ అందించబడింది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ఈ బైక్ సుమారు 187 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు.

ఒబెన్ రోర్ EZ అనే మోడల్ వినియోగదారుల కోసం మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపికగా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 89,999 నుంచి మొదలై, రూ.1.20 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). దీనిలో 2.6 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్ అమర్చబడింది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఇది 110 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాల కోసం ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








