రోజూ రూ.100 పెట్రోల్ కొట్టిస్తా అనే వారికి పర్ఫెక్ట్ బైక్స్.. లక్ష లోపు లభిస్తూ 70 కి.మీ మైలేజ్!
భారతదేశ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వాహనాల విషయంలో వారి జీవనశైలిని ప్రతిబింబించే ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. మెట్రో నగరాల మాదిరిగా స్మూత్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు లేని గ్రామీణ పరిస్థితుల్లో, వాహనం పర్ఫార్మెన్స్, మైలేజ్, బరువును మోయగలిగే సామర్థ్యం అన్నీ చాలా కీలకం. అక్కడి రోడ్ల పరిస్థితులు అనేక సవాళ్లు ఇస్తాయి. ఈ పరిస్థితుల్లో సాధారణ నగర బైక్‌లు పనికిరాకపోవచ్చు. అందుకే గ్రామాల్లో బైక్ ఎంపికలో దృఢత్వం, నమ్మకమైన పనితీరు అందించే వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. తక్కువ ధరలో లభించే, మంచి మైలేజ్ ఇస్తూ, ఏ రహదారినైనా తట్టుకుని ముందుకు సాగే బైక్‌లే గ్రామీణ ప్రజలకు నిజమైన మిత్రులు. అలాంటి బైకుల గురించి ఈ కథనంలో చూద్దాం.
Honda Shine 100: హోండా షైన్ 100 ప్రస్తుతం గ్రామీణ భారతదేశంలో అత్యంత నమ్మకమైన, తక్కువ ఖర్చుతో లభించే కమ్యూటర్ బైక్‌గా పేరు సంపాదించుకుంది. సాధారణ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ఈ మోడల్, ధరలో సరసమైనదిగా ఉండటమే కాదు, మైలేజ్ విషయంలో కూడా ప్రశంసలు అందుకుంటోంది. రూ. 63,191 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉండటం దీని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.

ఇందులో అమర్చిన 98.98 సీసీ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ రోజువారీ ప్రయాణాలకు సరిపోయేలా శక్తిని అందిస్తుంది. సుమారు 7.38 bhp పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేయగల ఈ ఇంజిన్, నగర ప్రయాణాలు కాని, చిన్న పట్టణాల రోడ్లు, గ్రామీణ మార్గాలు కాని.. అన్నింటినీ సులభంగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా సుమారు 65 kmpl వరకు అందించే ఇంధన సామర్థ్యం, ఖర్చు తగ్గించుకోవాలనుకునే రైడర్లకు ఎంతో ప్రయోజనం కలిగిస్తోంది.
Hero HF 100: గ్రామీణ భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న బైక్‌లలో హీరో HF 100కి మంచి డిమాండ్ ఉంది. తక్కువ ధరలో నమ్మకమైన మైలేజ్ ఇవ్వగలిగే ఈ బైక్ రైతులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు.. రోజూ ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ సరైన తోడుగా నిలుస్తుంది. ధర విషయానికి వస్తే, హీరో HF 100 కేవలం రూ. 48,857(ఎక్స్-షోరూమ్) మాత్రమే ఉండడం బడ్జెట్ బైక్ కొనాలనుకునే వారికి ప్రధాన ఆకర్షణ.

97.2 cc ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ 8 bhp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా మైలేజ్ విషయంలో ఈ బైక్ ముందంజలో ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో 70 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫీచర్లను పరిశీలిస్తే, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కిక్ స్టార్టర్, సైడ్ స్టాండ్ అలర్ట్‌తో ఇంజిన్ కట్-ఆఫ్ వంటి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
Hf Deluxe: బైక్ మార్కెట్లో హీరో HF డీలక్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రారంభ వేరియంట్ ధర రూ. 62,462(ఎక్స్-షోరూమ్)గా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 68,485(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. పనితీరు విషయానికి వస్తే, ఇందులో 97.2 cc సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చబడింది. ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 కిలోవాట్ల శక్తిని, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది.

Hero Splendor Plus: హీరో స్ప్లెండర్ ప్లస్ ధర పరంగా చూస్తే, ఇది రూ. 79,476 నుంచి రూ. 83,251 (ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తుంది. ఈ బైక్‌లో అమర్చిన ఇంజిన్ 97.2cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ మోటార్ ఉంది. ఇది 7.91 PS పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, స్ప్లెండర్ ప్లస్ సగటున 73 కిలోమీటర్ల వరకు ఇవ్వగలదు.


Click it and Unblock the Notifications








