రోజూ రూ.100 పెట్రోల్ కొట్టిస్తాం అనే వారికి బెస్ట్ బైక్.. ప్రతి ఇంటికి చేరిన మధ్యతరగతి బైక్
హోండా (Honda) కంపెనీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది నాణ్యత, సులభమైన రైడింగ్ అనుభవం. ఆ అంశాలను కలిగి ఉన్న బైక్‌నే హోండా షైన్ (Honda Shine) అని చెప్పాలి. ఇది దేశవ్యాప్తంగా పట్టణాల నుండి గ్రామాల దాకా ప్రతిఒక్కరికీ తెలిసిన, విశ్వసనీయమైన బైక్‌గా నిలిచింది. నగరాల్లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నుంచి గ్రామీణ రైతుల దాకా, అన్ని వర్గాల ప్రజలకీ ఈ బైక్ రోజువారి వాహనంగా మారింది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ బైక్‌కి దేశవ్యాప్తంగా ఎంతటి డిమాండ్ ఉందో మరోసారి నిరూపించాయి. 2025 సెప్టెంబర్ నెలలో హోండా షైన్ మొత్తం 1,85,059 యూనిట్లు విక్రయించబడింది. గత ఏడాది ఇదే నెలలో 1,81,835 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అమ్మకాలు 1.77% మేర పెరిగాయి.
ఇది చిన్న సంఖ్యలా కనిపించినా, పెద్ద మోటార్‌సైకిల్ మార్కెట్‌లో నిరంతర వృద్ధి సాధించడం అంటే వినియోగదారుల నమ్మకం ఎంత బలంగా ఉందో చెప్పకనే చెబుతోంది. హోండా షైన్ అమ్మకాల పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటగా, దీని ఇంజిన్ శక్తివంతమైనదిగా, కానీ మైలేజ్ పరంగా కూడా సమతుల్యంగా ఉంటుంది. అదనంగా, దీని సస్పెన్షన్, సీటింగ్ కంఫర్ట్, తేలికపాటి హ్యాండ్లింగ్ దీనిని నగర ట్రాఫిక్ పరిస్థితుల్లో సులభంగా నడిపేలా చేస్తాయి.

అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోనూ షైన్‌కి విపరీతమైన ఆదరణ ఉంది. బలమైన బాడీ స్ట్రక్చర్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఎక్కువ కాలం రిపేరింగ్ లాంటివి రాకుండా మన్నికగా ఉండటం, ఇవన్నీ కలిపి దీన్ని రైతులకూ, రోజువారి ప్రయాణాలు చేసే వారికి ఒక ప్రాక్టికల్ ఎంపికగా నిలబెట్టాయి. హోండా షైన్‌కి ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఇది అన్ని వయసుల వారికీ సరిపోతుంది. యువత,పెద్దవారు దీని కంఫర్ట్ కోసం ఇష్టపడుతున్నారు.
కొత్త హోండా షైన్ బైక్ ఇప్పుడు వినియోగదారుల అవసరాలను బట్టి పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హోండా షైన్ 100, షైన్ 100 DX, షైన్ 125 అనే మూడు ప్రధాన మోడళ్లుగా ఇది మార్కెట్లో లభిస్తోంది. ప్రతి వేరియంట్ కూడా ప్రత్యేకమైన అంశాలతో, విభిన్న అవసరాలను తీర్చే విధంగా రూపొందించబడింది. ప్రతి మోడల్‌కి ప్రత్యేకమైన ఇంజిన్, ఫీచర్లు, మైలేజ్, ధరతో ఆకట్టుకుంటున్నాయి.

హోండా షైన్ 100 అందుబాటు ధరలో రూ. 63,191 (ఎక్స్-షోరూమ్)కు కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఈ బైక్ 98.98 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, దీని పనితీరును 4-స్పీడ్ గేర్‌బాక్స్ మద్దతు ఇస్తుంది. రోజువారీ ప్రయాణాలకు అనువుగా రూపొందించిన ఈ బైక్ సుమారు 65 కి.మీ/లీటర్ మైలేజ్ అందిస్తుంది, ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం కోరుకునే వారికి అద్భుతమైన ఎంపిక.
హోండా షైన్ 100 DX: ఇది షైన్ 100 అప్‌గ్రేడ్ వెర్షన్. దీని ధర రూ. 69,694(ఎక్స్-షోరూమ్). ఇది కూడా 98.98 సీసీ పెట్రోల్ ఇంజిన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 65 kmpl వరకు మైలేజ్‌ను అందించే ఈ బైక్, ఫ్యూయల్ ఎఫిషియెన్సీతో పాటు స్టైల్ పరంగా మెరుగ్గా ఉంటుంది. ఇందులో LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైలెంట్ ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

హోండా షైన్ 125: ఈ వేరియంట్ షైన్ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైనది. దీని ధర రూ. 82,898(ఎక్స్-షోరూమ్). ఇందులో 123.94 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. దీని మైలేజ్ సుమారు 55 కి.మీ/లీటర్. ఫీచర్ల విషయానికొస్తే, ఇది పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. భద్రత పరంగా డ్రమ్ లేదా డిస్క్ బ్రేక్‌ల ఆప్షన్‌తో రైడర్‌కి కంట్రోల్ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








