ఈ బైక్ కొనాలంటే ఫోన్‌పేలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాల్సిందే.. వాళ్ల కోసమే స్పెషల్ బైక్ వచ్చేసింది
లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ అయిన డుకాటి ఇండియా యువతతో పాటు అడ్వెంచర్ టూరింగ్ ఇష్టపడే రైడర్లను టార్గెట్ చేసుకుని 2025 మల్టిస్ట్రాడా V2(Multistrada V2) ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌ను గతంలో కంటే మరింత లేటెస్ట్గా లైట్ వెయిట్ ఉండేలా తయారు చేశారు. ట్విన్-సిలిండర్ ఇంజిన్ పవర్ కోరుకునే వారికి, ఈ బైక్ ఎలాంటి రోడ్డు మీద అయినా సులువుగా ఉత్సాహభరితమైన రైడింగ్‌ను అందిస్తుంది.
ముఖ్యంగా పాత మోడల్ కంటే ఏకంగా 18కిలోల బరువు తగ్గించడం ద్వారా ఇంధనం లేకుండా కేవలం 199కిలోల బరువుతో ఈ బైక్ తన సెగ్మెంట్‌లో రికార్డు క్రియేట్ చేసింది. ఈ బైక్‌లో అడ్వాన్సుడ్ టెక్నాలజీ, మెరుగైన డిజైన్‌ను పరిచయం చేశారు. డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ.. పెరుగుతున్న అడ్వెంచర్ టూరింగ్ బైక్‌ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ V2, V2 S మోడల్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు.

ఇటాలియన్ హస్తకళా నైపుణ్యంతో రూపొందించబడిన కొత్త V2 ఇంజిన్‌తో భారతదేశంలో విడుదలైన మొదటి డుకాటి ఇదే. ఇది మెరుగైన పనితీరు, రైడర్ ఎయిడ్స్, సాటిలేని శక్తిని అందిస్తూ, ఈ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కొత్త మల్టిస్ట్రాడా V2 మెయిన్ స్పెషాలిటీ దాని బరువు తగ్గించడం. పాత మోడల్ కంటే ఈ కొత్త V2 18 కిలోల బరువు తక్కువగా ఉంది. దీంతో ఇంధనం లేకుండా దీని బరువు కేవలం 199కిలోలు మాత్రమే. ఇది దాని సెగ్మెంట్‌లో అత్యంత తక్కువ బరువు కలిగిన బైక్‌గా నిలిచింది. ఈ లైట్ వెయిట్, పవర్ఫుల్ ట్విన్ సిలిండర్ V2 ఇంజిన్‌తో కలిసి అద్భుతమైన హాండ్లింగ్, రైడింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది.
ఈ బైక్ స్టైల్‌లో కూడా అనేక మార్పులు చేశారు. ఇది మల్టిస్ట్రాడా ఫ్యామిలీ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ ఉంది. స్పోర్టీ లైన్స్‌తో కూడిన ఫ్రంట్ పార్ట్, లైట్ వెయిట్, చిన్న టెయిల్ దీనికి స్పెషల్ ఎట్రాక్షన్. సరికొత్త పానిగేల్, మల్టిస్ట్రాడా V4 నుంచి ప్రేరణ పొందిన కొత్త హెడ్‌లైట్‌లు, DRL దీని ముందు భాగాన్ని మరింత అట్రాక్టివ్‌గా మారుస్తాయి. కొత్త సైలెన్సర్ మరింత షార్ప్ ఆకారం కలిగి ఉండి, డుకాటి స్పోర్టింగ్ డీఎన్ఏను హైలైట్ చేస్తుంది.

మల్టిస్ట్రాడా V2 S ఏ రోడ్డు మీదైనా సరే, ఎంత చెత్త రోడ్లు అయినా సరే, అదిరిపోయేలా దూసుకుపోతుంది. ఇది ముఖ్యంగా సగం పాడైపోయిన రోడ్ల మీద కూడా తన పర్ఫార్మెన్స్‌ను ఇంకా బాగా చూపించడానికి తయారైంది. ఈ మల్టిస్ట్రాడాలో ఒక సూపర్ స్మార్ట్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. దీన్ని డుకాటి స్కైహుక్ సస్పెన్షన్ (DSS) అంటారు. ఇది ఎలక్ట్రానిక్‌గా కంట్రోల్ అవుతుంది. అంటే, బైక్ తనంతట తానుగా రోడ్డు పరిస్థితిని అర్థం చేసుకుని సస్పెన్షన్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది.
ఎప్పుడైనా మనం బ్రేక్ వేసినప్పుడు బైక్ ముందు భాగం కిందికి దిగిపోవడం, లేదా స్పీడ్ పెంచినప్పుడు బైక్ వెనుక భాగం కిందికి కూర్చున్నట్లు అవ్వడం చూస్తుంటాం కదా? అయితే, ఈ మల్టిస్ట్రాడా V2 Sలో అలాంటిదేమీ ఉండదు. దీనిలో ఉండే కొత్త ఎలక్ట్రానిక్ టెక్నిక్స్ వల్ల, బ్రేక్ వేసినప్పుడు బైక్ ఎక్కువ మునిగిపోకుండా, స్పీడ్ పెంచినప్పుడు వెనుక వైపు ఎక్కువ కూర్చోకుండా కంట్రోల్ చేస్తుంది.
ఈ స్మార్ట్ సస్పెన్షన్ వల్ల, రైడింగ్ చాలా కచ్చితంగా ఉంటుంది. అంటే, బైక్ ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది. రోడ్డు ఎంత అడ్డదిడ్డంగా ఉన్నా సరే, రైడర్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, స్మూత్‌గా సాగుతుంది.
మల్టిస్ట్రాడా V2 Sలో మినిమమ్ ప్రీలోడ్ అనే సూపర్ ఫీచర్ ఉంది. దీనితో ఒక బటన్ నొక్కగానే వెనుక సస్పెన్షన్ కిందికి వస్తుంది. అంటే, బైక్ పైన బాగా లోడ్ ఉన్నా, లేదా వెనుక ప్యాసింజర్ ఉన్నా సరే, మీ కాళ్లు సులభంగా నేలకు తగులుతాయి. బైక్ ఎత్తుగా ఉందని భయపడే వాళ్లకు ఇది నిజంగా పెద్ద రిలీఫ్!
కొత్త మల్టిస్ట్రాడా V2 లో కంప్లీట్ టెక్నాలజీ ప్యాకేజీ ఉంది. హ్యాండిల్‌బార్ కంట్రోల్స్ కొత్తగా డిజైన్ చేశారు. ఇందులో 5 అంగుళాల TFT కలర్ డాష్‌బోర్డ్ ఉంది. బైక్ గురించి కావాల్సిన సమాచారం అంతా ఒకే చోట చూసుకోవచ్చు. స్పోర్ట్, టూరింగ్, అర్బన్, ఎండ్యూరో, వెట్ - ఇలా 5 రకాల రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఏ రోడ్డుకి తగ్గట్టుగా ఆ మోడ్‌ని పెట్టుకుంటే ఇంజిన్ పవర్, రెస్పాన్స్ అద్భుతంగా ఉంటాయి.
కార్నరింగ్ ABS (వంపుల్లో కూడా సేఫ్ బ్రేకింగ్), డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ (DTC - టైర్ పట్టు తప్పకుండా చూస్తుంది), డుకాటి వీలీ కంట్రోల్ (DWC - బైక్ ముందు వీల్ లేవకుండా చూస్తుంది), ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (EBC - ఇంజిన్ బ్రేకింగ్ ని కంట్రోల్ చేస్తుంది) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
క్రూయిజ్ కంట్రోల్ (లాంగ్ రైడ్‌లలో విశ్రాంతి), డుకాటి మల్టీమీడియా సిస్టమ్ (ఫోన్‌ను కనెక్ట్ చేయొచ్చు), టర్న్-బై-టర్న్ నావిగేషన్ (రూట్ చూపించడానికి యాక్సెసరీ ద్వారా). బైక్ ఆఫ్ చేసిన తర్వాత కూడా లైట్లు వెలిగే కమింగ్ హోమ్ ఫంక్షన్ కూడా ఉంది.
సీటు ఎత్తు తగ్గించారు, ఎర్గోనామిక్స్ కూడా మార్చారు. దీని వల్ల రైడర్‌లు తమ కాళ్లను నేలపై సురక్షితంగా ఉంచగలరు. బైక్‌ను ఆపినప్పుడు లేదా తక్కువ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు.
కొత్త మల్టిస్ట్రాడా V2 లో 90° V-ట్విన్, 890 cc, IVT (ఇన్ టేక్ వాల్వ్ టైమింగ్‌ను మార్చుకునే ఫీచర్) ఉన్న కొత్త డుకాటి V2 ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ కేవలం 54.9 కిలోల బరువుతో బైక్ బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేసింది. ఇది 10,750 rpm వద్ద 115 hp పవర్, 8,250 rpm వద్ద 92 Nm టార్క్ ఇస్తుంది. ప్రతి 45,000 కిలోమీటర్లకు ఒకసారి వాల్వ్ క్లియరెన్స్‌ను చెక్ చేస్తారు. అంటే దీని మెయింటెనెన్స్ అంత ఎక్కువ ఉండదు.
బైక్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రేమ్, వెనుక సబ్‌ఫ్రేమ్, స్వింగ్‌ఆర్మ్ ఉన్నాయి. ఇవన్నీ మల్టిస్ట్రాడా V4 బైక్ డిజైన్‌ను పోలి ఉంటాయి. ఫ్రేమ్ అల్యూమినియం మోనోకోక్, వెనుక సబ్‌ఫ్రేమ్ స్టీల్ ట్రెల్లిస్, స్వింగ్‌ఆర్మ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఈ కాంబినేషన్ వల్ల మల్టిస్ట్రాడా చాలా తక్కువ బరువుకు వచ్చింది.. V2 వెర్షన్ ఇంధనం లేకుండా 199 కిలోలు,సెమీ-యాక్టివ్ సస్పెన్షన్‌తో ఉన్న V2 S వెర్షన్ 202 కిలోలు.
డుకాటి మల్టిస్ట్రాడా V2 2025 మోడల్ అక్టోబర్ 27 నుండి భారతదేశంలోని అన్ని డుకాటి డీలర్‌షిప్‌లలో దొరుకుతుంది. మల్టిస్ట్రాడా V2 డుకాటి రెడ్ ధర రూ.18,88,000, మల్టిస్ట్రాడా V2 S డుకాటి రెడ్ ధర రూ.20,99,800, మల్టిస్ట్రాడా V2 S స్టార్మ్ గ్రీన్ ధర రూ. 21,29,700


Click it and Unblock the Notifications








