ఇండియాలో ఈ కంపెనీ బైక్ లేని వీధి లేదు.. ఇప్పుడు ఇంటికో బైక్ ఉంటుందేమో.. మరి రేట్లు అంతలా తగ్గాయి భయ్యా
పండుగ సీజన్‌కు ముందు టూ వీలర్లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వాళ్లకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్‌టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను కస్టమర్లకు పూర్తిగా బదిలీ చేస్తూ హీరో మోటోకార్ప్ తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను గణనీయంగా తగ్గించింది. సెప్టెంబర్ 22, 2025 నుండి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఈ తగ్గింపుల వల్ల ఏ బైక్‌పై ఎంత ప్రయోజనం లభిస్తుందో వివరంగా చూద్దాం.
భారతదేశంలో అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. ప్రతేడాది కొన్ని లక్షల్లో బైకులను ఈ కంపెనీ విక్రయిస్తుంది. ఇండియాలో అత్యధికంగా టూ వీలర్లను విక్రయించే కంపెనీల్లో హీరోనే టాప్. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో.. సెప్టెంబర్ 22, 2025 నుంచి హీరో బైక్‌లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలు తగ్గుతాయి. పండుగ సీజన్ ముందు ఈ ధరల తగ్గింపు చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మోడల్‌ను బట్టి ధరల తగ్గింపులో చాలా వ్యత్యాసం ఉంది. హీరో కరిజ్మా 210 మోడల్‌పై గరిష్టంగా రూ.15,743 తగ్గింపు లభిస్తుంది. అదేవిధంగా, బడ్జెట్ కొనుగోలుదారుల కోసం హెచ్‌ఎఫ్ డీలక్స్ వంటి ఎంట్రీ-లెవల్ మోడళ్లపై రూ.5,805 వరకు ప్రయోజనం ఉంటుంది. ఇది రూరల్, సెమీ-అర్బన్ మార్కెట్లలో కొనుగోలుదారులకు చాలా ఊరటనిస్తుంది.
కమ్యూటర్ మోటార్‌సైకిళ్లపై కూడా మంచి తగ్గింపులు ఉన్నాయి. స్ప్లెండర్+ ధర రూ.6,820 తగ్గింది. అలాగే ప్యాషన్+ ధర రూ.6,500 తగ్గింది. ఈ రెండు మోడళ్లు హీరో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా కొనసాగుతున్నాయి. సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ ధర రూ.7,254, కొత్తగా విడుదలైన గ్లామర్ ఎక్స్ 125 ధర రూ.7,813 తగ్గాయి. ఎక్స్‌ట్రీమ్ సిరీస్‌లో కూడా భారీ ధరల సవరణలు జరిగాయి. ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ ధర రూ.8,010, ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి ధర రూ.10,985, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ ధర రూ.14,055 తగ్గాయి.

స్కూటర్లపై కూడా ప్రయోజనాలు
జీఎస్టీ 2.0 ప్రయోజనాలు స్కూటర్లకు కూడా వర్తిస్తాయి. డెస్టిని 125 ధర రూ.7,197 వరకు, ప్లెజర్+ ధర రూ.6,417 వరకు తగ్గింది. జూమ్ లైనప్ - 110, 125, 160 - లో కూడా రూ.6,597 నుంచి రూ.11,602 వరకు తగ్గింపులు లభిస్తాయి.
హీరో మోటోకార్ప్ జీఎస్టీ ధరల తగ్గింపులు
| మోడల్ | తగ్గింపు ధర(రూ.లలో) |
| కరిజ్మా 210 | 15,743 |
| ఎక్స్‌పల్స్ 210 | 14,516 |
| ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ | 14,055 |
| ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి | 10,985 |
| ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ | 8,010 |
| గ్లామర్ ఎక్స్ | 7,813 |
| సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ | 7,254 |
| డెస్టిని 125 | 7,197 |
| జూమ్ 160 | 11,602 |
| జూమ్ 125 | 7,291 |
| జూమ్ 110 | 6,597 |
| స్ప్లెండర్+ | 6,820 |
| ప్యాషన్+ | 6,500 |
| ప్లెజర్+ | 6,417 |
| హెచ్‌ఎఫ్ డీలక్స్ | 5,805 |
హీరో మోటోకార్ప్ సీఈఓ విక్రమ్ కస్బేకర్ మాట్లాడుతూ.. "ప్రభుత్వ జీఎస్టీ 2.0 సంస్కరణలను మేము స్వాగతిస్తున్నాము. ఇవి వినియోగాన్ని పెంచి, జీడీపీ వృద్ధిని ప్రోత్సహిస్తాయి. భారతదేశంలోని సగం కంటే ఎక్కువ కుటుంబాలు తమ రోజువారీ అవసరాల కోసం టూ వీలర్లను వినియోగిస్తాయి. పండుగ సీజన్ ముందు ఈ ధరల తగ్గింపు వల్ల టూ-వీలర్లు మరింత అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించడం ద్వారా, మేము మేక్ ఇన్ ఇండియా విజన్‌కు మద్దతు ఇస్తున్నాం" అని చెప్పారు.

భవిష్యత్తుపై హీరో వ్యూహం
ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా జీఎస్టీ రేట్ల మార్పుల తర్వాత ఇలాంటి నిర్ణయాలు ప్రకటించాయి. ఈ ధరల తగ్గింపులు పండుగ సీజన్‌తో కలిసి రావడంతో, హీరో మోటోకార్ప్ వ్యూహం స్పష్టంగా తెలుస్తోంది. తమ మార్కెట్ లీడర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకోవడానికి, ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో టూ-వీలర్లను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








