30 రోజుల్లో 6 లక్షల సేల్స్! హీరో బ్లాక్‌బ్లస్టర్.. గ్రామాల నుంచి నగరాల వరకూ హవా!
భారతదేశ టూవీలర్ మార్కెట్‌కు నవంబర్ 2025 నిజంగా పండుగ నెలగా మారింది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద టూవీలర్ తయారీదారైన హీరో మోటోకార్ప్ (Hero Motocorp) ఈ నెలను అద్భుతమైన పనితీరుతో ముగించింది. తాజాగా విడుదలైన అధికారిక అమ్మకాల గణాంకాలు పరిశ్రమలో తిరిగి విశ్వాసాన్ని నింపాయి. ప్రజలు తిరిగి బైక్‌ల కొనుగోలులో ఆసక్తి చూపుతున్నారని స్పష్టమైంది. నవంబర్ 2025లో హీరో మోటోకార్ప్ మొత్తం 6,04,490 యూనిట్లను మార్కెట్లోకి పంపింది. ఇందులో దేశీయ విక్రయాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎగుమతులు కూడా ఉన్నాయి. ఏకంగా యూనిట్ల సంఖ్యను చూస్తేనే కంపెనీపై తిరిగి ప్రజల నమ్మకం ఎంత బలమైనదో తెలుస్తుంది.
ఈ మొత్తం గత ఏడాది ఇదే నెలలో అంటే, నవంబర్ 2024లో కంపెనీ 4,59,805 యూనిట్లనే అమ్మగలిగింది. ఆ సంఖ్యతో పోలిస్తే ఈసారి హీరో మోటోకార్ప్ 31.47% భారీ వృద్ధి సాధించింది. అత్యంత ముఖ్యంగా, ఈ వృద్ధి కేవలం శాతాల్లోనే కాదు, వాల్యూమ్ పరంగా కూడా భారీదే. గత ఏడాదితో పోలిస్తే హీరో మోటోకార్ప్ ఈసారి 1,44,685 యూనిట్ల అదనపు అమ్మకాలను సాధించింది.

ఈ స్థాయి సంఖ్యలు సాధించడానికి దేశవ్యాప్తంగా పెరిగిన కొనుగోలు శక్తి, కొత్త మోడళ్లపై ఉన్న డిమాండ్, డీలర్ల వద్ద లభ్యం మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మళ్లీ పెరగడం, తక్కువ GST పన్ను నిర్మాణం అందిస్తున్న స్పష్టమైన ప్రయోజనాలు, పైగా పండుగ సీజన్‌లో వచ్చిన భారీ కొనుగోలు వాతావరణం.. ఈ మూడు అంశాలు కలిసి హీరో మోటోకార్ప్ అమ్మకాలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపించాయి.
హీరో మోటోకార్ప్ నవంబర్ 2025లో సాధించిన మొత్తం 6,04,490 యూనిట్ల భారీ అమ్మకాలలో దేశీయ మార్కెట్ కీలక పాత్ర పోషించింది. దేశీయంగా జరిగిన అమ్మకాలను మాత్రమే పరిశీలించినా, కంపెనీ ఎంత బలంగా పుంజుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఈ నెలలో దేశీయ అమ్మకాలు 5,70,520 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 4,39,777 యూనిట్లతో పోలిస్తే 29.73% వృద్ధి.

ఎగుమతుల విషయానికొస్తే హీరో ఈసారి సరికొత్త ఊపును చూపించింది. నవంబర్ 2025లో కంపెనీ మొత్తం 33,970 యూనిట్లను విదేశీ మార్కెట్లకు పంపింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 20,028 యూనిట్లుగా ఉండేది. అంటే ఎగుమతుల పరంగా హీరో 69.61% భారీ వృద్ధిని నమోదు చేసింది. ఈ సంఖ్యలు చూస్తే, హీరో మోటోకార్ప్ కేవలం దేశీయ మార్కెట్లోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా తన పట్టు మళ్లీ బలపరుచుకుంటోంది.
బైక్ విభాగంలో గత నెలలో 5,39,128 యూనిట్లు విక్రయించబడ్డాయి, ఇది గత ఏడాది (2024 నవంబర్) 4,25,856 యూనిట్లతో పోలిస్తే 26.60% వృద్ధి. బైక్‌లలో సాధారణంగా ఎక్కువ డిమాండ్ ఉన్న చిన్న ఇంజిన్ మోడళ్లు, గ్రామీణ మార్కెట్‌లో పెరుగుతున్న కొనుగోలు శక్తి, పండుగ సీజన్ కొనుగోళ్లు..అన్ని కలిసి ఈ స్థిరమైన వృద్ధికి కారణమయ్యాయి. స్కూటర్ విభాగంలో అయితే వాస్తవానికి మరింత వృద్ధి కనిపిస్తుంది.

2025 నవంబర్‌లో 65,362 యూనిట్ల స్కూటర్లు విక్రయించబడ్డాయి, ఇది గత ఏడాది ఇదే నెలలో 31,413 యూనిట్లతో పోలిస్తే ఏకంగా 92.53% భారీ వృద్ధి. స్కూటర్‌లలో పెరుగుతున్న డిమాండ్, సిటీ-కమ్యూటింగ్ కోసం ఎక్కువ మంది యువకులు, తక్కువ ధర, మైలేజ్, సౌకర్యం అన్నీ కలిసి ఈ విభాగానికి ఊపును ఇచ్చాయి.
అదే నెలవారీగా చూసినట్లయితే అక్టోబర్ 2025తో పోలిస్తే హీరో మొత్తం అమ్మకాలు 4.93 శాతం తగ్గాయి. ఈ నెలలో అమ్మకాలు 6,35,808 యూనిట్లు కాగా, నవంబర్‌లో 6,04,490 యూనిట్లు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే నవంబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








