హీరో నుంచి పిల్లల కోసం అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్..వాళ్లు పెరుగుతున్నా కొద్ది హైట్ మార్చుకోవచ్చు
పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ టూవీలర్‌లను తయారు చేయడంలో కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా హీరో మోటోకార్ప్ నిరూపించుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం విడా (Vida) అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ కింద విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్‌లో బాగా విజయవంతమయ్యాయి. తాజాగా హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ విభాగం అయిన విడా, పిల్లల కోసం తొలి ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
విడా డర్ట్.ఇ K3 (Vida Dirt.E K3) అనే ఈ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను కంపెనీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో EICMA మోటోషోలో ప్రదర్శించారు. ఇది డిసెంబర్ 12 నుంచి అధికారికంగా అమ్మకానికి వచ్చింది. మొదటి 300 యూనిట్లకు ఎక్స్‌షోరూమ్ ధర రూ.69,990 గా నిర్ణయించారు. అయితే, ఈ బైక్ పెద్దల కోసం కాదు కేవలం 4 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం మాత్రమే రూపొందించారు.

డర్ట్.ఇ K3 బైక్ విడా కొత్త ఆఫ్-రోడ్ సబ్-బ్రాండ్ అయిన డర్ట్.ఇ (Dirt.E) కింద మొదటి ఉత్పత్తి. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పిల్లల పెరుగుదలకు అనుగుణంగా మార్చడానికి వీలుగా ఉంటుంది. కంపెనీ మూడు స్థాయిలలో (Small, Medium, High) సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సెట్టింగ్‌లను అందించింది.
ఈ ఫీచర్ ద్వారా పిల్లల వయస్సు (4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు) పెరిగే కొద్దీ కొత్త బైక్‌లు కొనాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదని కంపెనీ హామీ ఇస్తోంది. ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుక షాక్‌లు, మధ్య భాగంలో కూడా హైట్ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది.

డర్ట్.ఇ K3 ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌కు 500W ఎలక్ట్రిక్ మోటారుతో జత చేసిన 360 Wh రిమూవబుల్ బ్యాటరీ శక్తిని అందిస్తుంది. ఈ సెటప్‌తో బైక్ గరిష్టంగా 25 కి.మీ/గం వేగంతో ప్రయాణించగలదు. ఛార్జింగ్ కూడా పెద్ద సమస్య కాదు. బ్యాటరీ 20% నుంచి 80% వరకు ఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. సాధారణ రైడింగ్ పరిస్థితుల్లో ఈ బైక్‌ను 2-3 గంటల వరకు ఉపయోగించవచ్చు.
పిల్లల కోసం ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి: బిగినర్ (Beginner), అమేచ్యూర్ (Amateur), ప్రో (Pro). బిగినర్ మోడ్‌లో వేగం 7-8 కి.మీ/గం ఉంటుంది. అమేచ్యూర్ మోడ్‌లో 16-17 కి.మీ/గం ఉంటుంది. ప్రో మోడ్‌లో 23-25 కి.మీ/గం వరకు వేగం ఉంటుంది.

పిల్లల భద్రత కోసం K3 డర్ట్ బైక్‌లో అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మ్యాగ్నెటిక్ కిల్ స్విచ్‌తో కూడిన లానియార్డ్ ఉంటుంది. ఇది లాగితే మోటారు పవర్ వెంటనే నిలిచిపోతుంది. ఇంపాక్ట్ ప్రొటెక్షన్ కోసం చెస్ట్ ప్యాడ్, తొలగించదగిన ఫుట్‌పెగ్‌లు, బ్రేక్ రోటర్ కవర్, వెనుక భాగంలో గ్రాబ్‌రైల్ కూడా ఏర్పాటు చేశారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించడానికి, సేఫ్టీని నిర్ధారించడానికి, ఈ బైక్‌లో యాప్-ఆధారిత కనెక్టెడ్ ఫీచర్‌లను కూడా విడా జోడించింది. మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులు బైక్ వేగాన్ని పరిమితం చేయవచ్చు, రైడింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చు. ఉపయోగించే విధానాలను పర్యవేక్షించవచ్చు. ఇది తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం.


Click it and Unblock the Notifications








