పల్సర్ లుక్.. హోండా మైలేజ్.. టూ వీలర్ మార్కెట్లో సంచలనాలు సృష్టించేందుకు రాబోతున్న ఎలక్ట్రిక్ బైక్
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరవాసులకు మరింత ఆకర్షణీయమైన బైక్ అందుబాటులోకి రానుంది. త్వరలోనే అత్యాధునిక ఫీచర్లు, ఎక్కువ మైలేజీతో కూడిన 'మేటర్ ఏరా' ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్‌లో విడుదల కానుంది. పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని కోరుకునే వారికి, అలాగే అత్యాధునిక టెక్నాలజీని ఆస్వాదించాలనుకునే వారికి ఈ బైక్ ఒక గొప్ప అవకాశం కానుంది.
నిజంగా నగరవాసులకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న ఆసక్తిని మరింత పెంచే వార్తని చెప్పొచ్చు. ప్రముఖ భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ తన సరికొత్త ఇ-బైక్‌ను మరికొన్ని వారాల్లోనే హైదరాబాద్‌లో విడుదల చేయొచ్చని భావించవచ్చు. ఇప్పటికే దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో మంచి ఆదరణ పొందిన 'మేటర్ ఏరా' (Matter Aera Electric Bike) ఇప్పుడు హైదరాబాద్ వీధుల్లోనూ సందడి చేయవచ్చు.

బెంగళూరులో విజయవంతంగా విడుదలైన ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో చెన్నైతో పాటు దేశంలోని మరో ఏడు నగరాల్లోనూ విడుదల చేయడానికి కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. మేటర్ ఏరా తన ప్రత్యేకమైన హైపర్ షిఫ్ట్ గేర్‌బాక్స్ టెక్నాలజీతో (HyperShift Geared Technology) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ICE) వాహనాల్లో ఉండే గేర్‌బాక్స్ లాగే, ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో కూడా 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను అందించడం విశేషం. అంతేకాకుండా, ఈ గేర్‌బాక్స్ మూడు వేర్వేరు రైడింగ్ మోడ్‌లతో అనుసంధానించబడి ఉండడం డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఇలాంటి ఫీచర్ ప్రస్తుతం మరే ఇతర ఎలక్ట్రిక్ బైక్‌లోనూ అందుబాటులో లేదు.

అధునాతన ఫీచర్ల విషయానికొస్తే, మేటర్ ఏరాలో 7-అంగుళాల స్మార్ట్ టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్, నావిగేషన్ సిస్టమ్, మ్యూజిక్ కంట్రోల్, రైడ్ గురించిన సమాచారం, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌ల వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇది 5000,5000+అనే రెండు వేరియంట్లలో విడుదల కాబోతుంది.
ఇక బ్యాటరీ కెపాసిటీ గురించి చెప్పుకుంటే.. ఈ బైక్‌లో పవర్ ఫుల్ 5kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 172 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంతేకాకుండా, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ కేవలం 2.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు.

హైదరాబాద్‌లో ఈ బైక్ ఇంకా విడుదల కాలేదు కాబట్టి, ఇక్కడి ఎక్స్-షోరూమ్ ధరను ఖచ్చితంగా చెప్పలేము. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఇతర నగరాల ధరలను పరిశీలిస్తే, ఈ బైక్ ప్రారంభ ధర దాదాపు రూ. 1.83 లక్షల నుంచి ఉంది. హైదరాబాద్‌లో కూడా ఇదే ధర లేదా దీనికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, మేటర్ ఏరా మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అయితే, మార్కెట్‌లో దీనికి నిజమైన డిమాండ్ ఎలా ఉంటుందో చూడటానికి మరికొంత సమయం వేచి చూడాలి. ప్రస్తుత సమాచారం ప్రకారం, రాబోయే రెండు మూడు నెలల్లో ఈ ఇ-బైక్ హైదరాబాద్‌లో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








