రోడ్లపై రాజసం.. ఒక్కసారి చూడగానే అట్రాక్ట్ చేసే డిజైన్.. కొత్త రెబెల్ 500 అన్ని వివరాలు ఇవే!
దేశీయ ప్రముఖ టూవీలర్ వాహన తయారీదారు హోండా స్కూటర్ & మోటార్‌సైకిల్ ఇండియా (HMSI), దేశంలోని ప్రతి మూలకూ చేరింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల దాకా, ఈ సంస్థ నంచి వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది. నమ్మకమైన పనితీరు కారణంగా వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హోండా కంపెనీ రూపొందించే బైక్‌లు, స్కూటర్లు నిత్యజీవిత అవసరాలకు సరిపోయేలా ఉండటంతో, ప్రజలు వాటిని నమ్మకంతో కొనుగోలు చేస్తున్నారు. దాని విజయపరంపరను కొనసాగించడానికి హోండా ఇటీవల అదిరిపోయే బైకును విడుదల చేసింది. దాని పేరే "రెబెల్ 500 (Rebel 500)". బైక్ రూపకల్పన నుండీ పనితీరు వరకు ప్రతీ విషయంలోనూ ఒక ప్రత్యేకతను చూపిస్తోంది.
దాని విభిన్నమైన క్లాసిక్ క్రూయిజర్ డిజైన్, ట్రెండీ యువతను మాత్రమే కాదు, ప్రయాణాల్లో విశ్రాంతిని కోరే బైక్ ప్రియులను కూడా ఆకర్షిస్తోంది. హోండా రెబెల్ 500 భారతీయ మార్కెట్లో క్రూయిజర్ బైక్స్‌కి గల అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా చెప్పవచ్చు. చూపరులను ఆకట్టుకునే శక్తివంతమైన పనితీరును అందించే బైకులలో ఇది ఉంటుంది. రెబెల్ 500 కు సంబంధించిన ఫీచర్స్, ఇంజిన్ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

హోండా రెబెల్ 500 ధర: దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ.5.50 లక్షలుగా నిర్ణయించారు. ఇది ప్రీమియం సెగ్మెంట్‌కి చెందిన మోడల్ అయినప్పటికీ, అందులోని ఫీచర్లు, బ్రాండ్ విలువను దృష్టిలో ఉంచుకుంటే ఈ ధరలో లభించడం సమంజసమే అనిపిస్తుంది. ఇది హోండా ప్రీమియం డీలర్ నెట్‌వర్క్ అయిన బిగ్ వింగ్ టాప్‌లైన్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ బైక్‌ను గురుగ్రామ్, ముంబై, బెంగళూరులో కొనుగోలు చేయొచ్చు
ఇంజిన్: కొత్త హోండా రెబెల్ 500 బైక్ తన శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌తో స్పష్టమైన మెరుగుదల చూపిస్తోంది. ఇందులో ఉన్న 471 సీసీ కెపాసిటీ గల సమాంతర జంట (parallel-twin) పెట్రోల్ ఇంజిన్, అధిక సామర్థ్యాన్ని అందిస్తూ, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది. ఈ ఇంజిన్ 46 బీహెచ్‌పీ హార్స్‌పవర్‌ను, 43.3 న్యూటన్ మీటర్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది నగర రోడ్ల, ఓపెన్ హైవేల్లో గానీ అనుకూలంగా ఉంటుంది.

దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడింది, ఇది గేర్ మార్పుల్లో సౌలభ్యాన్ని కలిగిస్తూ, వాహనాన్ని మరింత సాఫీగా నడిపేలా చేస్తుంది. అంతేకాదు, ఈ బైక్ సుమారు 26 కిలోమీటర్ల మైలేజీని లీటరుకి అందించగలదని అంచనా, ఇది క్రూయిజర్ సెగ్మెంట్‌లో మెరుగైన మైలేజ్ అని చెప్పవచ్చు. ఈ శక్తి, మైలేజీ, పనితీరు పరంగా రెబెల్ 500 బైక్ దూర ప్రయాణాలు చేయాలనుకునే రైడర్లకు మంచి ఎంపికగా నిలవగలదని అనిపిస్తోంది.
డిజైన్ అండ్ కలర్: ఇది సిగ్నేచర్ రౌండ్ హెడ్‌లైట్‌తో 70ల స్టైల్‌ను తలపించడమే కాదు, నేడు ట్రెండింగ్ అయిన మినిమలిస్టిక్ ఫీలును కూడా కలిగిస్తుంది. హై-మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ రైడింగ్ పోజిషన్‌ను మరింత స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చుతుంది. ముందు నుండి వెనుకదాకా ఆల్-LED లైటింగ్ సిస్టమ్ ఉంది. ఇది మాట్టే గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ కలర్‌లో లభిస్తుంది. బైక్‌కి మరింత మాస్, మిస్టీరియస్ లుక్‌ను ఇస్తుంది.
సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్, ఇతర అంశాలు: దీనిలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక షోవా ట్విన్ షాక్ అబ్జార్బర్‌ల సస్పెన్షన్ సెటప్ లభిస్తుంది. దీనికి డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని బరువు 191 కిలోలు, 11.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ముందు భాగంలో 130/90-16, వెనుక భాగంలో 150/80-16 కొలతలు కలిగిన టైర్లతో అమర్చబడి ఉంది.


Click it and Unblock the Notifications








