హోండా కొత్త బైక్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్.. బుకింగ్స్‌కి డేట్ ఫిక్స్.. యువత కోసం స్పెషల్
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్‌లో 25 ఏళ్ల విజయయాత్రను పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని సెలబ్రేట్ చేస్తూ, హోండా దేశీయ విభాగంలో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి Shine 100 DX తో పాటు, మరో మోడల్ కొత్త CB125 హార్నెట్ (CB125 Hornet). ఇది కొత్త తరహా ప్రయత్నంగా చెప్పవచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు Shine & SP125 వంటి మోడళ్లతో హోండా సాధారణ కమ్యూటర్ సెగ్మెంట్‌లో కొనసాగింది. కానీ ఇప్పుడు, స్పోర్టీ స్టైలింగ్, యంగ్ అటిట్యూడ్, ఎగ్జైట్‌మెంట్ కోసం యూత్ వెతుకుతున్న బైక్ ప్రీమియం లుక్‌తో రావాలన్నదే వారి లక్ష్యం. హోండా CB125 హార్నెట్ లాంచ్ ప్రధానంగా రెండు ప్రత్యక్ష పోటీదారులను TVS Raider 125, Hero Xtreme 125R దృష్టిలో పెట్టుకొని జరిగింది.
CB125 హార్నెట్ ద్వారా కంపెనీ తమ బ్రాండ్ ఇమేజ్‌ను కేవలం నమ్మకమైన బైకుగా కాకుండా, యంగ్, డైనమిక్, స్పోర్టీ పర్సనాలిటీకి అనుగుణంగా మార్చే ప్రయత్నంలో ఉంది. హోండా CB125 హార్నెట్ గట్టిగా కనిపించే డిజైన్ మాత్రమే కాకుండా, దాని సామర్థ్యంతో కూడా మార్కెట్‌ను ఆకట్టుకోనుంది. ప్రత్యేకించి నగర ప్రయాణాలు, రోజువారి రైడింగ్ అవసరాలకు ఇది చక్కగా సరిపోతుంది. ఈ బైక్‌లో 123.94cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించబడింది.

ఇది 7500 rpm వద్ద 10.99 bhp పవర్, 6000 rpm వద్ద 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఇది 0-60 కిమీ వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుంది, ఇది దాని సెగ్మెంట్‌లో అత్యుత్తమంగా చెప్పవచ్చు. అంటే, 125cc బైక్ సెగ్మెంట్‌లో వేగవంతమైన రైడింగ్ అనుభూతిని అందించే మోడల్ ఇది. ఈ పనితీరు 5-స్పీడ్ గేర్‌బాక్స్ సహకారంతో మరింత మెరుగ్గా ఉంటుంది.
క్లచ్ యాక్షన్ కూడా స్మూత్‌గా ఉండటంతో, ట్రాఫిక్‌లో ఈజీగా రైడ్ చేయడం సాధ్యమవుతుంది. సిటీ ప్రయాణాల్లో స్పోర్టీ లుక్, స్మార్ట్ ఫీచర్లను కోరుకునే యువత కోసం తయారైన ఈ బైక్‌లో ప్రతి డీటెయిల్ ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది ముందుభాగంలో రెండు ట్విన్-LED హెడ్‌ల్యాంప్స్, డే టైం రన్నింగ్ లైట్స్ (DRLs), అలాగే హై-మౌంటెడ్ LED ఇండికేటర్లు బైక్‌కు మరింత బోల్డ్ అండ్ అట్రాక్టివ్ లుక్‌ను అందిస్తున్నాయి.

బైక్ సైడ్ ప్రొఫైల్‌లో మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ష్రౌడ్స్, స్లీక్ మఫ్లర్ వంటి డిజైన్ హైలైట్స్. సెగ్మెంట్‌లోనే తొలిసారిగా గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్కులు అందించబడటంతో పాటు, 5-స్టెప్ అడ్జస్టబుల్ మోనో-షాక్ వెనుక భాగంలో ఇవ్వడం వల్ల బైక్ హ్యాండ్లింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సిటీలో రద్దీ ట్రాఫిక్‌లోనూ, బంపీ రోడ్లపై కూడా రైడర్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ సస్పెన్షన్ సెటప్ పనిచేస్తుంది.
ఇగ్నిషన్ కీని ఫ్యూయల్ ట్యాంక్ మీద ప్లేస్ చేయడం వల్ల ఇది ఉపయోగించడానికి కూడా సులభంగా ఉంటుంది. ఇది ఓ ప్రత్యేకమైన డిజైన్ హైలైట్ కూడా అవుతుంది. బైక్‌లో స్ప్లిట్ సీటింగ్ సెటప్ ఇవ్వడం వల్ల, రైడర్‌కు, వెనుక కూర్చున్న వారికి ప్రయాణం కంఫర్టబుల్‌గా ఉంటుంది. అల్లాయ్ వీల్స్ మల్టీ-స్పోక్ డిజైన్‌తో ఉండటంతో బైక్ లుక్‌లో స్పోర్టినెస్‌కి తోడు ప్రీమియం టచ్ కూడా కలుగుతుంది.

టెక్నాలజీ పరంగా చూస్తే, ఇది 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు హోండా రోడ్‌సింక్ యాప్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీనివల్ల కాల్ అలర్ట్స్, మెసేజ్ నోటిఫికేషన్స్ వంటి వివరాలు డాష్‌బోర్డ్‌పై రియల్ టైమ్‌లో పొందవచ్చు.మొత్తంగా చెప్పాలంటే, హోండా CB 125 హార్నెట్ యూత్‌ని టార్గెట్ చేస్తూ రూపొందించిన ఫ్యూషన్ బైక్. దీని బుకింగ్‌లు ఆగస్టు 1 నుండి ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications








