బైక్ ఫీలింగ్ అదే.. కానీ పెట్రోల్ అవసరం లేదు! హోండా కొత్త మాస్టర్‌పీస్ అదిరిపోతుంది
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీదారుగా మారడానికి వేగంగా అడుగులు వేస్తుంది. అంతర్జాతీయంగా ఆటోమొబైల్ కంపెనీలన్ని కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అలాగే, ఇక్కడ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి కీలకంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ టూవీలర్ తయారీదారులు ఇతర విదేశీ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ టూవీలర్ కంపెనీ హోండా (Honda) ఈ ఏడాది జనవరిలో QC1, Activa e ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందరు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో విడుదల చేసి, EV రంగంలో తన పట్టును బలోపేతం చేసుకుంది.
ఇప్పుడు, హోండా మరో పెద్ద అడుగు వేస్తోంది. ఒక సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇక్కడే లాంచ్ అవుతుందని ఊహించినప్పటికీ, హోండా దీన్ని మొదట చైనాలో అమ్మకానికి తీసుకురానుంది. హోండా, చైనాలో ఉన్న వుయాంగ్ అనే కంపెనీతో వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు కలిపి 'WH8000D' అనే కోడ్‌నేమ్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ది చేశాయి.

ఇదే త్వరలో E-VO(ఇ-వో) పేరుతో విడుదల కానుంది. హోండా ఇప్పటికే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో E-VOను కూడా తీసుకొస్తుంది. ఇది ఇప్పటికే అవసరమైన అనుమతులను పొందినట్లు సమాచారం. ఈ లెక్కన త్వరలోనే ఇది వివిధ దేశాల్లో విక్రయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హోండా ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో పోటీలో నిలిచేందుకు ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
E-VOకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూసినట్లయితే రెట్రో-శైలి పొందింది. అదనంగా కొత్తగా కొన్ని స్టైలిష్ హంగులు అద్దారు. దీని ముందుభాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్ ఆకర్షణీయంగా మెరుస్తూ, పాత కాలపు టూవీలర్స్‌లో కనిపించే హెడ్‌ల్యాంప్ కౌల్‌తో కలసి స్మూత్ రెట్రో లుక్‌ను అందిస్తుంది. హ్యాండిల్‌బార్ల చివరన ఉన్న గుండ్రటి అద్దాలు, బైక్‌కు ఒక కొత్త స్టైలిష్ రూపాన్ని ఇస్తాయి.
ఇది సింగిల్-పీస్ సీటుతో వస్తుంది. E-Vo ఎలక్ట్రిక్ బైక్, నగర ప్రయాణాల సులభతరం చేయడానికి ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. 150cc పెట్రోల్ బైక్‌కు సమానమైన పనితీరును అందిస్తూ, క్లాసిక్ స్టైల్‌తో పాటు లేటెస్ట్ టెక్నాలజీని సమన్వయం చేస్తుంది. సమాచారం ప్రకారం, ఈ బైక్‌లో 11 hp పవర్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ అమర్చారు. ట్రాఫిక్‌లో ఈజీగా రైడ్ చేయడానికి సరిపడా టార్క్‌ను అందిస్తూ, మెరుపు వేగంతో ముందుకు సాగుతుంది.
e-vo గురించి ఇంకా ఎటువంటి కీలక వివరాలు విడుదల కాలేదు. కేవలం ఇవి నివేదికల అంచనాల మాత్రమే. ఇది రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. బేస్ వేరియంట్ 143 కిలోల తేలికపాటి బరువుతో గంటకు 110 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అదే, టాప్-ఎండ్ వేరియంట్ బరువు కాస్త ఎక్కువగా 157 కిలోల వరకు ఉండి. ఇది గంటకు 120 కి.మీల వేగాన్ని అందుకుంటుంది.
ఈ బైక్‌లో స్వాప్పబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని సమాచారం. దీంతో ఛార్జింగ్ కోసం గంటల తరబడి ఆగాల్సిన అవసరం లేకుండా, బ్యాటరీని మార్చి వెంటనే ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే, ఇది ప్రయాణికులకు మెరుగైన మైలేజ్‌ను అందించగలదని అంచనా. ఇతర దేశాల్లో మొదట విడుదల అవుతుండగా, భారత్‌లో విడుదలపై ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








