సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా.. హోండా నుంచి మరో సాలిడ్ బైక్.. స్ప్లెండర్‌కు గట్టి పోటీ?
భారతదేశంలో ఇటీవల బైక్ మార్కెట్ దృష్టి మారుతోంది. పెద్ద ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై జనాలకు ఆసక్తి పెరుగుతుంది. అయితే ఇదే సమయంలో చిన్న ఇంజిన్ బైక్‌లు తమ స్థిరమైన డిమాండ్‌ను మాత్రం కోల్పోలేదు. పేద, మధ్య తరగతి వారు తమ రోజవారి అవసరాల కోసం ఎక్కువ మైలేజ్ అందించే చిన్న ఇంజిన్ విభాగానికి చెందిన టూవీలర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రూఫ్‌గా 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని చూపించొచ్చు. దేశవ్యాప్తంగా అమ్ముడైన బైక్‌లలో సగానికి పైగా, అంటే 46 శాతం వరకు 100cc నుంచి 110cc మధ్యే ఉన్నాయి. ఈ విభాగంలో హీరో మోటోకార్ప్ నిండా వెలిగిపోతోంది. దాదాపు 78 శాతం మార్కెట్ వాటాతో హీరోకి పోటీ లేకుండా పోయింది. అయితే ఇదే సమయంలో, హోండా మాత్రం ఈ సెగ్మెంట్లో వెనుకబడి పోయింది.
125cc బైక్‌లు, స్కూటర్లు వర్గాల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నా, 100-110cc విభాగంలో హోండాకు ఉన్న మార్కెట్ వాటా కేవలం 6 శాతం మాత్రమే. ఇదే ఇప్పుడు హోండాను ఆలోచనలో పడేసింది. ఆటోకార్ ఇండియా వెల్లడించిన సమాచారం ప్రకారం, హోండా ఈ సెగ్మెంట్లోకి తిరిగి ఎంటర్ అవడానికి గట్టి ప్రణాళికలు వేసుకుంటోంది. అందులో భాగంగా, ఒక కొత్త 100cc బైక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ బైక్ హోండా నుండి వచ్చే మరో సాధారణ కమ్యూటర్ కాకుండా, కొత్త తరానికి సరిపోయేలా, ఫీచర్లతో నిండి ఉంటుందని ఊహిస్తున్నారు. ఇప్పటికే హీరో బలంగా ఉనికిని చూపిస్తున్న ఈ సెగ్మెంట్లోకి, హోండా తన కొత్త బైక్‌తో అడుగుపెడుతోంది. ఇది మామూలు నిర్ణయం కాదనిపిస్తోంది... ఎందుకంటే ఈ బైక్ డైరెక్టుగా హీరో ప్యాషన్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100 లను లక్ష్యంగా చేసుకుని వస్తోంది.
హోండా 100cc విభాగంలో మళ్లీ పట్టు సాధించేందుకు ఈ మోడల్ ద్వారా సిద్ధమవుతుందని తెలుస్తుంది. హీరో స్ప్లెండర్ సిరీస్ బైక్‌లు ఇప్పటికీ బైక్ మార్కెట్‌ను ఆధిపత్యంగా నియంత్రిస్తున్నాయి. వాటి నమ్మకమైన మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు వల్ల ప్రజల ఇష్టాన్ని పొందాయి. అయితే హోండా ఇప్పుడు తీసుకురాబోయే కొత్త బైక్, ఈ స్ప్లెండర్ శ్రేణికి తలపడేలా ఉండబోతోందని తెలుస్తోంది. ఇది మామూలు స్థాయి బైక్ మాత్రమే కాదు.

100cc సెగ్మెంటులో బైక్ ధరల విషయంలో కూడా కస్టమర్లు చాలా సున్నితంగా స్పందిస్తారు. హోండా దీన్ని బాగా అర్థం చేసుకుని, తక్కువ ధర టార్గెట్ చేస్తూ, అందరికీ అందుబాటులో ఉండేలా దీన్ని డిజైన్ చేస్తోందని సమాచారం. దీని ధర కూడా సాధారణ 100cc బైక్‌ల ధరకు దగ్గరగా ఉంటుందని భావించవచ్చు. ఈ కొత్త బైక్‌ను 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో విడుదల చేసే అవకాశముంది.
ఇప్పటికే కొత్త 100cc బైక్‌పై పనులు సాగుతున్నాయి అన్న సమాచారం మధ్యలో, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. షైన్ 100కి ఒక కొత్త వేరియంట్‌ను కూడా హోండా విడుదల చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే షైన్ 100 బైక్ హోండా నుండి వచ్చిన ప్రాథమిక స్థాయి మోడల్‌గా మార్కెట్లో నిలిచినప్పటికీ, దానికి మరింత ఆకర్షణీయతను చేకూర్చే లక్ష్యంతో కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను తేనుందని తెలుస్తోంది.
డిజైన్‌లో చిన్న మార్పులు, కొత్త ఫీచర్లు లేదా మెరుగైన ఎఫిషియన్సీ వంటి అంశాలపై ఈ కొత్త వేరియంట్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ రెండు బైక్‌లతో.. అంటే పూర్తిగా కొత్త 100cc మోడల్‌తో పాటు, షైన్ 100కి వచ్చే వేరియంట్‌తో హోండా 100-110cc సెగ్మెంట్‌ను మరలా దక్కించుకోవాలనుకుంటోంది. ఇవి రెండూ సమయానుకూలంగా మార్కెట్లోకి వస్తే, రాబోయే సంవత్సరాల్లో హోండా మార్కెట్ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








