ఒక దాని పేరు చెబితే జనం క్యూలో నిలబడుతున్నారు… ఇంకో దాని పేరు చెబితే వద్దంటూ వెనక్కి తిరుగుతున్నారు!
ఈ సంవత్సరం ఆరంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMIL) తన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. వాటిలో QC1, Activa E ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ రెండు మోడళ్లతో హోండా అధికారికంగా దేశీయ ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఆవిష్కరణ తర్వాత QC1కి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. మార్కెట్లోకి వచ్చి కొద్దికాలమే అయినా, వినియోగదారులు దీనిని మెరుగైన సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు, ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన Activa E మాత్రం ఆ స్థాయి ఉత్సాహాన్ని రాబట్టలేకపోతోంది. వినియోగదారులు ఇంకా దీన్ని కొనడంలో కొంత వెనుకంజ వేస్తున్నారు.
హోండా ఎలక్ట్రిక్ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికే ఆరు నెలలు దాటింది. ఈ కాలంలో కంపెనీ QC1, Activa E అనే రెండు మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి ఉత్పత్తి, సేల్స్‌లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి నుండి జూలై వరకు, అంటే ఆరు నెలల వ్యవధిలో మొత్తం 11,168 యూనిట్లు ఈ రెండు మోడళ్లలో తయారయ్యాయి. ఈ సంఖ్య హోండా తమ ఎలక్ట్రిక్ లైన్-అప్‌పై ఎంతటి శ్రద్ధ చూపుతోందో తెలియజేస్తుంది.

అయితే, తయారీ సంఖ్యతో పోల్చితే అమ్మకాల వృద్ధి కొంచెం వెనుకబడినట్లే కనిపిస్తోంది. ఈ కాలంలో మొత్తం 5,173 యూనిట్లను మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేశారు అని ఆటోకార్ ప్రొఫెషనల్ వెల్లడించింది. అంటే సగానికి కూడా తక్కువ స్కూటర్లు వినియోగదారుల చేతికి చేరాయి. ఈ గణాంకం మార్కెట్లో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి ఉన్నా, కొనుగోలు దశలో మాత్రం వినియోగదారులు కొంత ఆలోచనలో పడుతున్నారనే సంకేతాన్ని ఇస్తోంది.
ఇందులో QC1కే మంచి ఆదరణ లభిస్తోంది. ఇది 4,252 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాంపాక్ట్ డిజైన్, ప్రాక్టికల్ ఫీచర్లు, ధరలో లభించే ఎంపికలు దీనికి తోడ్పడుతున్నాయి. మరోవైపు, చాలా మంది ఎదురుచూసిన Activa e మాత్రం అంత స్థాయి స్పందన తెచ్చుకోలేకపోతోంది. Activa బ్రాండ్ పేరుతో వచ్చినప్పటికీ, పెట్రోల్ వెర్షన్‌కి ఉన్న నమ్మకాన్ని ఎలక్ట్రిక్ వెర్షన్ ఇంకా పూర్తిగా రాబట్టలేకపోయింది. ఈ పరిస్థితి హోండా ముందు ఉన్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తోంది.

వినియోగదారుల అంచనాలకు సరిపోయే రేంజ్, ధర, రైడింగ్ అనుభవాన్ని కలిపి అందించడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న సందేహాలను కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించిన పోటీదారులు, Ather, Ola, TVS వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగదారుల దృష్టికి తీసుకువెళ్తున్నాయి. హోండా మాత్రం ఈ మొదటి ఆరు నెలల్లోనే ఒక ముఖ్యమైన మెట్టుపై నిలబడింది.
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ, వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి కొత్త వ్యూహాలు అమలు చేస్తే, రాబోయే నెలల్లో ఈ గణాంకాలు గణనీయంగా మారవచ్చు. ఇప్పటికైతే, హోండా ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన ప్రయాణం ఒక మిశ్రమ ఫలితాన్ని చూపిస్తోంది. అటూ ఐసీఈ వెర్షన్ మాత్రం వినియోగదారులకు బాగా నచ్చుతుంటే, ఎలక్ట్రిక్ మాత్రం ఆ విధంగా ఆశించిన మేరకు సేల్స్‌ను సాధించలేకపోతుంది.

హోండా QC1 ధర రూ. 90,000(ఎక్స్-షోరూమ్). ఇది 1.5 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 80 కి.మీ వరకు రేంజ్ అందించగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కి.మీ. ఇది కేవలం 9.7 సెకన్లలో 0 నుండి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. హోండా యాక్టివా ఇ చూసినట్లయితే, ఇది రూ.1.17 లక్షల నుండి రూ.1.52 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.


Click it and Unblock the Notifications








