ఒక్కో లీటర్‌తో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించాలనుకుంటున్నారా? ఇవి తప్పక చేయండి!
ఇప్పటి పెట్రోల్ ధరల పెరుగుదల పరిస్థితుల్లో ప్రతి బైక్ రైడర్ మనసులో తారసపడే ప్రశ్న ఒక్కటే, నా బైక్ మైలేజ్ ఎలా పెంచుకోవాలి? అనేది. రోజూ ఉద్యోగాలకు వెళ్లేవారు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, లేదా ఇంటి అవసరాల కోసం ప్రయాణించే వారు అందరూ వీలైనంత వరకు ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. బైక్ కొనేటప్పుడు చాలా మంది మొదటగా కిలోమీటర్‌కు ఎంత ఇస్తుంది? అనే ప్రశ్న అడుగుతారు. కానీ ఒకసారి బైక్ కొనుగోలు చేసిన తర్వాత, దానిని సరైన విధంగా సంరక్షించకపోతే లేదా తప్పుగా నడిపితే, ఆ మైలేజ్ క్రమంగా తగ్గిపోతుంది. ఫలితంగా కొత్తగా కొన్న బైక్ కూడా కొన్ని నెలల్లోనే మైలేజ్ డ్రాప్ సమస్యతో బాధిస్తుంటుంది. నిపుణుల ప్రకారం, బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు. అవెంటో ఒకసారి చూద్దాం.
బైక్‌ను హఠాత్తుగా వేగంగా తిప్పడం లేదా ఆకస్మికంగా బ్రేక్ వేయడం ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచుతుంది. మైలేజ్ తగ్గిపోతుంది. ఎప్పుడూ స్మూత్‌గా, స్థిరమైన వేగంతో ప్రయాణించండి. 40-60 kmph వేగం చాలా బైక్‌లకు స్వీట్ స్పాట్‌గా ఉంటుంది. చౌకగా దొరికే తక్కువ నాణ్యత గల పెట్రోల్ వాడితే, ఇంజిన్ పనితీరు తగ్గుతుంది. ఫ్యూయల్ ఇంజెక్టర్ లేదా కార్బ్యూరేటర్ దెబ్బతింటుంది. ఎల్లప్పుడూ నమ్మకమైన పెట్రోల్ బంక్‌లోనే ఇంధనం నింపించండి.

మీ బైక్ మైలేజ్ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఇంజిన్‌లో డస్ట్, కార్బన్ డిపాజిట్స్, లేదా పాత ఆయిల్ కావచ్చు. సమయానికి సర్వీసింగ్ చేయించండి, ఇంజిన్ ఆయిల్ మార్చండి, ఎయిర్ ఫిల్టర్ శుభ్రం చేయించండి. ఇది మైలేజ్‌లో 10-15% వరకు తేడా చూపిస్తుంది. ప్రతి 3000 కి.మీ. లేగా మూడు నెలలకు ఒకసారి ఇంజన్ ఆయిల్‌ను మార్చుకోవాలి. క్లచ్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి. క్లచ్ స్లిప్పింగ్ ఇంధన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
టైర్ ప్రెజర్ తక్కువగా ఉంటే రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దాంతో ఇంధన వినియోగం ఎక్కువ అవుతుంది. కంపెనీ సూచించిన ప్రెజర్‌నే ఎల్లప్పుడూ ఉంచండి. ప్రతీ వారం ఒకసారి చెక్ చేయడం మంచిది. ఎక్కువ సమయం క్లచ్ హాఫ్‌లో ఉంచడం లేదా తప్పు గియర్‌లో రైడ్ చేయడం ఇంధనాన్ని వృథా చేస్తుంది. సరిగ్గా సరిపోయే గియర్‌లో, తక్కువ ఆర్‌పిఎంలో ప్రయాణించండి బైక్ చెయిన్ డ్రైగా ఉంటే, రోలింగ్ స్మూత్‌గా ఉండదు.

ప్రతి 500-700 కి.మీ.కోసారి చెయిన్ లూబ్రికేట్ చేయడం మైలేజ్ పెరగడంలో సహాయపడుతుంది. ప్రత్యేకించి ఉదయం మొదటి రైడ్‌లో, ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే రోడ్‌కి వెళ్లొద్దు. రెండు నిమిషాలు ఇంజిన్ ఐడిల్‌లో నడిపిస్తే, ఫ్యూయల్ కంబషన్ సరిగ్గా జరుగుతుంది, మైలేజ్ మెరుగుపడుతుంది. బైక్ నడుపుతున్నపుడు చాలా మంది బ్రేక్‌పై కాలు ఉంచుతారు. అయితే బ్రేక్‌పై కాలు ఉంచి డ్రైవింగ్ చేయడం చెడ్డ అలవాటేం కాదు.
బ్రేక్‌పై కాలు ఉంచితే బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి బ్రేక్‌లపై ఒత్తిడి ఉంచితే స్వేచ్ఛగా ముందుకు కదలదు. స్పార్క్ ప్లగ్ పాడైపోతే ఇంధనం సరిగా ఇగ్నైట్ అవదు. చిన్న మిస్ ఫైర్లు మైలేజ్ తగ్గిస్తాయి. ప్రతి సర్వీసింగ్‌లో స్పార్క్ ప్లగ్ పరిస్థితి చెక్ చేయించండి. బైక్ ట్యాంక్ ఓవర్‌ఫిల్ చేస్తే, కొంత ఇంధనం గాలి ద్వారా వృథా అవుతుంది. ఎల్లప్పుడూ ట్యాంక్‌లో కొంచెం ఖాళీ స్థలం ఉంచండి.



Click it and Unblock the Notifications








