బజాజ్, ఓలా, టీవీఎస్, ఏథర్.. వీటిల్లో ఎవరి స్కూటర్‌లను జనం ఎక్కువగా కొన్నారో తెలుసా?
భారతదేశ ఆటోమొబైల్ రంగం క్రమంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా టూవీలర్ విభాగం గతంలో కంటే వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఏప్రిల్ 2025లో నెలమొదటి సారి 90 వేలకు పైగా ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్ముడవ్వడం ఒక మైలురాయిగా మారగా, మే నెలలో ఈ రంగం మరింత స్థిరంగా అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. ఏప్రిల్‌లో నమోదైన 92,345 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, మే నెలలో విక్రయాలు 1,00,266 యూనిట్లకు చేరాయి. ఇది కేవలం నెలవారీ వృద్ధే కాదు, గత ఏడాది మే నెలలో నమోదు చేసిన 77,330 యూనిట్లతో పోలిస్తే సుమారు 30 శాతం పెరుగుదల.
ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, లేటెస్ట్ ఫీచర్స్‌తో వస్తున్న మోడళ్ల వల్ల వినియోగదారుల నమ్మకం బలపడుతోంది. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటుకుంది. మే 2025లో 26,144 యూనిట్లను విక్రయించి, టీవీఎస్ రెండు నెలలుగా భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుగా నిలిచింది. గత సంవత్సరం అదే నెలలో టీవీఎస్ విక్రయించిన 11,866 యూనిట్లతో పోలిస్తే ఇది 107% వృద్ధి.

ఈ వృద్ధికి ప్రధాన కారణం TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌కు వినియోగదారుల నుంచి లభించిన అద్భుత స్పందన. శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన బ్యాటరీ బ్యాక్‌అప్ వంటి అంశాలు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఈ కారణంగా టీవీఎస్ మోటార్ మే నెలలో 25 శాతం మార్కెట్ వాటాను సాధించగలిగింది. జనవరి నుంచి మే 2025 మధ్య కాలంలో టీవీఎస్ మొత్తం 1,18,225 ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను విక్రయించింది.
మే 2025 ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో అమ్మకాల పరంగా బజాజ్ ఆటో రెండవ స్థానంలో నిలిచి ఆశ్చర్యం కలిగించింది. గత సంవత్సరం మే 2024లో కేవలం 9,249 యూనిట్లను మాత్రమే విక్రయించిన బజాజ్, ఈసారి గణనీయమైన వృద్ధిని సాధించి 21,770 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇది ఏకంగా 135 శాతం వార్షిక వృద్ధి, అంటే బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ విభాగంలో తన స్థానం మళ్లీ నిలబెట్టుకుంటోంది.

ఈ విక్రయాల వల్ల బజాజ్ మార్కెట్‌లో 22 శాతం వాటాను సంపాదించగలిగింది. ఇది టీవీఎస్ తర్వాత అత్యధికంగా ఉన్న మార్కెట్ వాటా. జనవరి నుండి మే 2025 మధ్య కాలంలో బజాజ్ మొత్తం 1,19,153 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇకపోతే, ఒకప్పుడు ఈవీ టూవీలర్ మార్కెట్‌పై దాదాపు ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్ మాత్రం ఇప్పుడు వెనుకబడుతోంది. మే 2025లో 18,499 యూనిట్లను మాత్రమే విక్రయించి మూడవ స్థానానికి పరిమితమైంది.
ఈ స్థాయి అమ్మకాలతో ఓలా మార్కెట్ వాటా 18 శాతానికి తగ్గిపోయింది, ఇది గతంలో ఉన్న దాదాపు 50 శాతం మార్కెట్ వాటాతో పోలిస్తే భారీగా తగ్గుదల. 2025 క్యాలెండర్ సంవత్సరంలో ఓలా మొత్తం 94,925 యూనిట్లను విక్రయించింది. ఓలా తర్వాత నాలుగవ స్థానంలో ఏథర్ ఎనర్జీ, మార్కెట్‌లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. మే నెలలో ఏథర్ 12,840 యూనిట్లను విక్రయించి, 13 శాతం మార్కెట్ వాటాని కైవసం చేసుకుంది.

గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 6,155 యూనిట్లతో పోలిస్తే ఇది 109% వార్షిక వృద్ధి, ఇది కంపెనీ అభివృద్ధిని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు ఏథర్ మొత్తం 66,864 యూనిట్లను విక్రయించింది. ఈ వృద్ధికి ముఖ్య కారణం రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ లాంచ్ కావడమే. కుటుంబ వినియోగదారులకు అనుకూలంగా రూపొందించిన ఈ మోడల్‌కు మార్కెట్లో మంచి స్పందన లభించింది.
భారతదేశంలో 7,164 యూనిట్ల అమ్మకాలతో హీరో మోటోకార్ప్ ఐదవ అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ విక్రయదారుగా ఉంది. మే 2024లో కేవలం 2,460 యూనిట్లను మాత్రమే విక్రయించిన విడా స్కూటర్లు, గత సంవత్సరంతో పోలిస్తే 191% వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం హీరో మార్కెట్ వాటా 7%. జనవరి నుండి మే 2025 వరకు మొత్తం 25,673 విడా స్కూటర్లు అమ్ముడయ్యాయి.


Click it and Unblock the Notifications








