ఇండియా రోడ్లపై దుమ్ములేపుతున్న ఈవీ స్కూటర్లు.. ఈ రెండింటిని కలిపి 10 లక్షల మంది కొన్నారు!
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాలు భారీగా ఉంటున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విభాగంలో తాజాగా TVS iQube, బజాజ్ చేతక్ స్కూటర్లు ఒక గొప్ప మైలురాయిని అధిగమించాయి. అమ్మకాల నివేదిక ప్రకారం, రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కలిపి 1 మిలియన్ యూనిట్ల అమ్మకాలను చేరుకుని ఈ సెగ్మెంట్‌లో పాత చరిత్రను తిరగరాశాయి. ఇవి స్టైలిష్ డిజైన్, అధునాతన టెక్నాలజీ, నమ్మకమైన పనితీరుతో మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఈ అమ్మకాలను చూసినట్లయితే దేశంలో ఈవీలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదని అర్థం అవుతుంది. నగరాల్లో పెరిగిన ట్రాఫిక్, పెరుగుతున్న పర్యావరణ అవగాహన కూడా వినియోగదారులను ఈవీ వాహనాల వైపు ఆకర్షించాయి. ఈ రెండు మోడళ్ల అమ్మకాల గురించి కింది కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.
TVS iQube, బజాజ్ చేతక్ స్కూటర్లు, భారతదేశ ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో ఒక గేమ్‌చేంజర్‌లా మారాయి. మార్కెట్లోకి విడుదలైన కొద్ది కాలంలోనే ఇవి మార్కెట్‌ను ఆక్రమించుకొని, ఈవీ విభాగంలో తమదైన స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. వినియోగదారుల అభిరుచి మారుతున్న నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లు భారీగా ప్రజాదరణ పొందడం గమనార్హం. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన తాజా గణాంకాలను చూద్దాం.

మార్చి 2025 ముగింపు నాటికి ఈ రెండు స్కూటర్లు కలిపి 9.93 లక్షల యూనిట్ల అమ్మకాలు దాటాయి. ఇప్పుడు 10 లక్షల మైలురాయిని చేరుకునేందుకు కేవలం 6,700 యూనిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ విక్రయాల వేగాన్ని గమనించినట్లయితే ఈ మిగిలిన గణంకాలు ఏప్రిల్ 2025 ప్రారంభ రోజుల్లోనే చేరి ఉంటాయని అంచనా. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2025 ఏప్రిల్ మధ్య నాటికి, భారతదేశంలో నమోదైన 3.19 మిలియన్ ఎలక్ట్రిక్ టూవీలర్ అమ్మకాల్లో TVS iQube,బజాజ్ చేతక్ కలిపి 31 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వినియోగదారుల్లో పెరుగుతున్న పర్యావరణ అవగాహన, ప్రభుత్వ సబ్సిడీలు, మెరుగైన ఛార్జింగ్ సదుపాయాలు ఈ ట్రెండ్‌ను మరింత పెంచుతున్నాయి. ఇప్పటివరకు TVS iQube 5.71 లక్షల యూనిట్లను విక్రయాలను నమోదు చేసింది.

మొత్తం అమ్మకాలలో ఇది 57 శాతం వాటా దక్కించుకుంది. మరోవైపు, బజాజ్ చేతక్ కూడా 4.23 లక్షల స్కూటర్లను విక్రయించి 43 శాత వాటాతో తన స్థానాన్ని మరింత బలపరచుకుంది. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో విడా వంటి కొత్త తరం మోడళ్ల నుండి గట్టి పోటీ ఉన్నా, ఈ రెండు కూడా ఎలక్ట్రిక్ విభాగంలో తమ ఉనికిని బలంగా పెంచుకుని మెరుగైన గణంకాలను విజయవంతంగా సాధించడం విశేషం.
ఈ రెండు మోడళ్ల అమ్మకాలను చూసిన మార్కెట్ వర్గాలు సైతం చాలా ఆశ్చర్యపోతున్నాయి. ఇది భారతదేశం తక్కువ కాలుష్యం, తక్కువ నిర్వహణ ఖర్చులతో కూడిన స్థిరమైన రవాణా వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నదానికి స్పష్టమైన సంకేతంగా భావించవచ్చు. పెరుగుతున్న ఇంధన ధరలు, మెరుగైన గ్రీన్ ఎనర్జీ కారణంగా రాబోయే రోజుల్లో వీటి అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

TVS iQube, బజాజ్ చేతక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో గట్టి పునాదిని అందించాయి. వీటి ఆకట్టుకునే అమ్మకాల గణాంకాలు కేవలం వ్యాపార లాభదాయకత కోసం కాకుండా, దేశంలో ఈవీలలో జరిగిన ప్రగతికి కూడా ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ రెండు మోడళ్లలో ప్రసిద్ధ మోడల్ అయినటువంటి TVS iQube ఇప్పటికీ ముందంజలో ఉండడం గమనార్హం. ఇది దాదాపు 1.50 లక్షల యూనిట్ల తేడాతో TVS బజాజ్ కంటే ఆధిక్యంలో ఉంది.
ఈ ఆధిక్యతకు ప్రధానంగా TVS ప్రారంభ దశ నుంచే తన ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల నెట్‌వర్క్‌ను విస్తృతంగా అభివృద్ధి చేయడం. ప్రధానంగా ఇండియాలోనే మెట్రో నగరాలే కాకుండా, పట్టణ ప్రాంతాల్లో కూడా వీటిని అందుబాటులో ఉండటం వినియోగదారులలో మరింత నమ్మకాన్ని కలిగించింది. అయితే, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ ఆధిక్యం క్రమంగా తగ్గుతోంది. 2023-24 (FY24) ఆర్థిక సంవత్సరానికి వస్తే, TVS సుమారు 1.90 లక్షల స్కూటర్లను విక్రయించింది.

అదే సమయంలో బజాజ్ చేతక్ 1.15 లక్షల యూనిట్లను విక్రయించింది. మధ్యలో ఉన్న 74,000 యూనిట్ల తేడా చూస్తే, బజాజ్ తన వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రెండు బ్రాండ్ల మధ్య ఉన్న పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంతవరకూ TVS ఆధిక్యంలో ఉన్నప్పటికీ, బజాజ్ చేపట్టిన ప్రయత్నాలు, విస్తరిస్తున్న డీలర్ నెట్‌వర్క్, కొత్త మోడళ్లతో వచ్చే రోజుల్లో ఈ గ్యాప్ మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తంగా చూసినట్లయితే 2025 ఆర్థిక సంవత్సరం, TVS, బజాజ్ వంటి దిగ్గజ కంపెనీలకు ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ ఏడాది, ఈ రెండు సంస్థలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల్లో అరుదైన ఘనతను సాధించాయి. వార్షికంగా రెండు లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించడం. ఇది కేవలం గణాంకాల ఘనత కాదు, వినియోగదారుల మనస్సులో ఎలక్ట్రిక్ వాహనాలపై మారుతున్న అభిప్రాయానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఒకప్పుడు ఈవీలను కొనుగోలు చేయడానికి భయపడిన జనాలు, ఇప్పుడు మాత్రం ఎంతో ఇష్టంగా కొనడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ సమస్యలు వెలుగులోకి రావడంతో చాలా మందియ గతంలో ఐసీఈ ఇంజిన్ మెడళ్లపై ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇవి వినియోగదారుల ప్రస్తుత అవసరాలను తీర్చే స్థాయికి చేరుకున్నాయి. మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, వేగవంతమైన ఛార్జింగ్, సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు వినియోగదారుల విశ్వాసాన్ని బలపరిచాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








