షోరూమ్‌కి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ బైక్ కోసమే అడిగారు! గత నెలలో టాప్ సెల్లింగ్ బైక్స్ ఏవో చూసేయండి
భారతదేశంలో ప్రస్తుతం బైకుల వినియోగం భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో బైక్‌లు అమ్ముడవుతున్న దేశాలలో మన దేశం ఒకటిగా నిలవడం అందరికీ తెలుసు. ట్రాఫిక్ పరిస్థితులు, కుటుంబ స్థితిగతులు, ఇంటి అవసరాలకు అనుగుణంగా టూవీలర్స్ ఇప్పుడు మనలో ఒక భాగం అయిపోయాయి. ఉద్యోగాలకు వెళ్లడానికి, లేదా ఇతర పనులకు వెళ్లడానికి బస్సుల్లో, ఆటోల్లో కష్టపడుతూ వెళ్లు కంటే బైకులపై ప్రయాణించడం సులభంగా ఉండటం కారణంగా అవసరాలకు అనుగుణంగా ప్రజలు తమకు నచ్చిన బైకులను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో నిత్యం కొత్త కొత్త స్కూటర్లు రానున్నా, ఇంకా చాలా మంది వినియోగదారులు గేర్ల బైక్‌లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం, ఏప్రిల్ 2025లో ఇండియాలో మెరుగైన సంఖ్యలో బైకులు అమ్ముడుపోయాయి.
గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2025 ఒక్క నెలలోనే టాప్ 10 బైక్‌లు కలిపి మొత్తం 7,21,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది మంచి సంఖ్యే. కానీ ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే కొంత తగ్గింది. ఏప్రిల్ 2024లో, అదే టాప్ 10 మోడళ్లకు చెందిన 9,17,790 బైక్‌లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడైన బైకుగా హీరో స్ప్లెండర్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

మంచి మైలేజ్, పేద, మధ్యతరగతి వారు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో లభించడం వలన ఏప్రిల్ నెలలో హీరో స్ప్లెండర్ మొత్తం ,97,893 యూనిట్లు అమ్ముడుపోయింది. అయితే గత ఏడాది అదే నెలలో 3,20,959 స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. అంటే ఈ ఏడాది విక్రయాలు 38.34 శాతం తక్కువయ్యాయి. మార్కెట్ డైనమిక్స్, పోటీ, వినియోగదారుల ప్రాధాన్యతల మార్పు వంటి కారణాల వల్ల అమ్మకాలు తగ్గిపోయాయి.
వివరంగా చెప్పాలంటే, గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది 1,23,066 యూనిట్లు తక్కువగా స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. హీరో స్ప్లెండర్ తర్వాతి స్థానాన్ని హోండా షైన్ సొంతం చేసుకుంది. 2025 ఏప్రిల్‌లో ఈ మోడల్ 1,68,908 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది గత సంవత్సరం అదే నెలలో (ఏప్రిల్ 2024) నమోదైన 1,42,751 యూనిట్లతో పోలిస్తే 26,157 యూనిట్లు ఎక్కువ. ఇది కంపెనీకి ఒక పెద్ద విజయం.

మూడో స్థానంలో బజాజ్ పల్సర్ ఉంది. 2025 ఏప్రిల్‌లో ఈ మోడల్ 1,24,012 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది, ఇది 2024 ఏప్రిల్‌లో విక్రయించిన 1,44,809 యూనిట్లతో పోలిస్తే సుమారు 14.36 శాతం తగ్గుదల. వినియోగదారుల ఇష్టాలు మారుతుండటం, అలాగే, ధరల ప్రభావం, ఇదే ధరలో మార్కెట్లోకి ఇతర కంపెనీల నుంచి మోడళ్లు విడుదల కావడం వలన బజాజ్ పల్సర్ అమ్మకాలపై కొంత ప్రభావం పడింది.
పల్సర్ తరువాత ప్రముఖ స్పోర్ట్స్ బైక్‌లలో ఒకటైన TVS అపాచీ 2025 ఏప్రిల్ అమ్మకాల ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈసారి అపాచీ 45,633 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానంలో నిలిచింది. అపాచీ తర్వాతి స్థానాల్లో టీవీఎస్ కంపెనీ నుంచే మరో మోడల్ టీవీఎస్ రైడర్ నిలిచింది. ఇది యువతను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన డిజైన్, ఫీచర్లు, మైలేజ్ వంటి అంశాల వల్ల వినియోగదారుల్లో మంచి స్పందన పొందుతోంది.

ఏప్రిల్ 2025లో రైడర్ 43,028 యూనిట్ల అమ్మకాలు సాధించింది. తరువాత హీరో HF డీలక్స్ స్థిరమైన అమ్మకాలను సాధించింది. 41,645 యూనిట్ల అమ్మకాలతో ఇది ఆరో స్థానంలో నిలిచింది. సాధారణంగా HF డీలక్స్‌ను అనేక మంది రోజువారీ ప్రయాణాల కోసం ఎంచుకుంటారు, ఎందుకంటే ఇది మైలేజ్‌లో గణనీయంగా మెరుగ్గా ఉంటుంది. తరువాత 29,689 యూనిట్లతో ఏడవ స్థానంలో బజాజ్ ప్లాటినా ఉంది.
గణంకాల ప్రకారం, ఏప్రిల్ 2025లో ఎనిమిదవ స్థానంలో బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన క్లాసిక్ 350 మోడల్ 26,801 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. తొమ్మిదవ స్థానం విషయానికి వస్తే, హోండా కంపెనీకి ప్రసిద్ధ మోడల్ యునికార్న్ 26,017 యూనిట్ల అమ్మకాలతో జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇక చివరగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోడల్ 18,109 యూనిట్ల అమ్మకాలతో పదవ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications








