స్క్రీన్ మీద ఫోన్ కాల్స్.. రోడ్డు మీద రాకెట్ స్పీడ్.. నింజా 650 అప్‌డేట్ తో ప్రత్యర్థులకు పట్టపగలు చుక్కలే
జపనీస్ మోటార్‌సైకిల్ దిగ్గజం కవాసకి (Kawasaki) భారతీయ మార్కెట్లోకి తన ఐకానిక్ మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ 2026 నింజా 650 (Ninja 650)ను అధికారికంగా ప్రవేశపెట్టింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.7.91 లక్షలుగా నిర్ణయించారు. మునుపటి 2025 మోడల్‌తో పోలిస్తే ధర సుమారు రూ.14,000 పెరిగినప్పటికీ, ప్రస్తుత పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా దీనిని E20 ఫ్యూయల్ (20% ఇథనాల్ మిశ్రమం)కు అనుకూలంగా అప్‌డేట్ చేయడం విశేషం.
కేవలం పెట్రోల్‌పైనే కాకుండా ఇథనాల్ మిశ్రమంతో నడిచేలా ఇంజిన్‌ను ట్యూన్ చేయడం వల్ల ఉద్గారాలు తగ్గడమే కాకుండా, భవిష్యత్తు ఇంధన అవసరాలకు ఈ బైక్ సిద్ధంగా ఉంది. డిజైన్ విషయానికి వస్తే.. 2026 నింజా 650 తన పాత క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూనే సరికొత్త గ్రాఫిక్స్‌తో మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో మ్యాట్ గ్రే వంటి రంగులు ఉన్నప్పటికీ, ఇండియాలో మాత్రం కవాసకికి గుర్తింపు తెచ్చిన లైమ్ గ్రీన్ రంగులోనే ఇది లభిస్తుంది.

అయితే ఈసారి వైట్, బ్లూ కాంబినేషన్‌లో వచ్చిన కొత్త గ్రాఫిక్స్ బైక్‌కు ఒక రేసింగ్ లుక్‌ను ఇచ్చాయి. దీని షార్ప్ ఫెయిరింగ్, ట్విన్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ దీనిని చూడగానే కవాసకి ఫ్లాగ్‌షిప్ మోడల్ ZX-10R ను గుర్తుకు తెస్తాయి. ఏరోడైనమిక్ డిజైన్ వల్ల హై-స్పీడ్ వద్ద గాలి ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకుని స్థిరంగా దూసుకెళ్తుంది.
టెక్నాలజీ పరంగా ఈ బైక్ ఒక ఫీచర్ల జాతర అని చెప్పవచ్చు. ఇందులో అమర్చిన 4.3 అంగుళాల ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే రైడర్‌కు ఒక ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఈ డిస్‌ప్లేలో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సదుపాయం ఉంది. కవాసకికి చెందిన Rideology App ద్వారా మీ ఫోన్‌ను బైక్‌కు కనెక్ట్ చేసి కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు మరియు రైడింగ్ లాగ్స్ వంటివి స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు.

సేఫ్టీ కోసం ఇందులో 2-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ (KTRC) సిస్టమ్ ఉంది. వర్షం పడుతున్నప్పుడు లేదా రోడ్డుపై గ్రిప్ తక్కువగా ఉన్నప్పుడు టైర్లు జారిపోకుండా ఈ సిస్టమ్ ఇంజిన్ పవర్‌ను నియంత్రిస్తుంది. దీనికి తోడు డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ వ్యవస్థ ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది.
పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే.. ఇందులో ఉన్న 649cc పారలల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ తన దమ్మును మరోసారి నిరూపించుకుంటోంది. ఇది 8,000 RPM వద్ద 68 PS పవర్, 6,700 RPM వద్ద 62.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల గేర్లు మార్చడం చాలా తేలికగా ఉంటుంది. ఇది ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో రైడర్‌కు శ్రమను తగ్గిస్తుంది.

196 కేజీల బరువు ఉన్న ఈ బైక్, 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సుమారు 790mm సీటు ఎత్తు ఉండటం వల్ల తక్కువ ఎత్తు ఉన్న వారు కూడా దీనిని సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. ప్రస్తుతం కవాసకి ఇండియా ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారుగా ఉన్న హోండా CBR650R ధర సుమారు రూ. 11 లక్షలకు పైగా ఉండటంతో, బడ్జెట్, పర్ఫార్మెన్స్ మధ్య బ్యాలెన్స్ కోరుకునే వారికి నింజా 650 ఒక బెస్ట్ ఆప్షన్. స్పోర్ట్స్ టూరింగ్ ఇష్టపడే వారికి, వీకెండ్ రైడ్స్ ఎంజాయ్ చేసే వారికి ఈ బైక్ ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దీనిలోని హై-టెన్సిల్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, డన్లప్ రోడ్‌స్పోర్ట్-2 టైర్లు మూల మలుపుల్లో బైక్‌ను అత్యంత స్థిరంగా ఉంచుతాయి.


Click it and Unblock the Notifications








