ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ గేర్ బైక్.. ఒక్కసారి కొన్నారంటే లైఫ్ టైం కంపెనీనే చూసుకుంటుంది
దేశంలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది. ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో స్కూటర్ల మాదిరిగానే బైక్‌లు కూడా ట్రెండింగ్‌గా మారుతున్నాయి. ప్రజలు ఎక్కువగా మాట్లాడుకునే మోడల్ మ్యాటర్ ఏరా(Matter Aera). ప్రపంచంలోనే గేర్‌బాక్స్ ఉన్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూవీలర్ కావడంతో ఏరా చాలా ట్రెండింగ్‌లో ఉంది.
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ బ్రాండ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించడానికి ఇంతకంటే గొప్ప కారణం ఇంకేం కావాలి? మార్కెట్‌లోకి వచ్చి కొంత కాలమే అయినప్పటికీ ఇప్పటి వరకు హైదరాబాద్ రోడ్లపై మ్యాటర్ ఏరా EV కనిపించలేదు.

దానికి కారణం ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఇది తెలుగు రాష్ట్రాల్లోకి కూడా వస్తుంది కాబట్టి, ఇకపై మీరు కళ్లు మూసుకుని ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే, ఏరా ఎలక్ట్రిక్ బైక్‌కు లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీని ఈ స్టార్టప్ కంపెనీ ప్రకటించింది.
తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మ్యాటర్ ఏరాకు (Matter Aera) లైఫ్ టైం బ్యాటరీ వారంటీ లభించడం.. ఎలాంటి ఆందోళనలు లేకుండా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఇలాంటి వారంటీని అందించడం ఇదే మొదటిసారి అని కంపెనీ చెబుతోంది. ఎలక్ట్రిక్ వాహన యజమానుల రెండవ అతిపెద్ద ఆందోళన అయిన బ్యాటరీ లైఫ్, బ్యాటరీ ఎక్స్చేంజ్ ఖర్చును తగ్గించడానికి ఈ చర్య సాయపడుతుంది.

ఒక ఎలక్ట్రిక్ వాహనంలో అత్యంత ఖరీదైన భాగం అయిన బ్యాటరీకి ఇలాంటి ప్రయోజనాన్ని అందించడం చాలా ధైర్యంతో కూడుకున్న నిర్ణయం. సాధారణంగా EVలలో బ్యాటరీలకు మూడు నుండి ఎనిమిది సంవత్సరాల వరకు వారంటీని ఆయా వాహన తయారీదారులు అందిస్తుంటారు. లైఫ్‌టైమ్ వారంటీ ప్రకటన ఇతర బ్రాండ్‌లకు కచ్చితంగా నిద్ర పట్టకుండా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బ్యాటరీ ప్యాక్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) వంటి ముఖ్యమైన భాగాలను సొంతంగా రూపొందించి, ఉత్పత్తి చేయాలనే నిర్ణయం నుంచే బ్యాటరీ ప్యాక్‌కు లైఫ్‌టైమ్ వారంటీ ఇవ్వడానికి ధైర్యం వచ్చిందని కంపెనీ చెబుతోంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో, వాతావరణ పరిస్థితులలో ఈ సిస్టమ్స్‌ను విస్తృతంగా పరీక్షించినట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ ఇన్-హౌస్ కంట్రోల్ హై క్వాలిటీ, పర్ఫామెన్స్ స్టెబిలిటీను అందిస్తుందని భారతీయ స్టార్టప్ బ్రాండ్ పేర్కొంది. భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్లో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఉపయోగించే లిక్విడ్-కూల్డ్ బ్యాటరీని ఏరా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో ఉపయోగించారు. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసేందుకు సహాయపడతాయి.
ఇది బ్యాటరీ లైఫ్ పెంచడానికి సహాయపడే పరిస్థితులను సృష్టిస్తుంది. ముఖ్యంగా అధిక వాతావరణ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వినియోగంలో కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పర్ఫామెన్స్ మెయింటైన్ చేసేందుకు, బ్యాటరీ టెంపరేచర్ ఒత్తిడిని తగ్గించడానికి ఈ సిస్టమ్‌ను రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఏరా EV లో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

5000, 5000 ప్లస్ అనే రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వస్తున్న మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 1.74 లక్షలు, రూ. 1.84 లక్షలు. 10 kW (13.4 bhp) పవర్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ రెండు మోడళ్లకు శక్తినిస్తుంది. పర్ఫామెన్స్ విషయానికి వస్తే, 6 సెకన్లలోపు 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
లిక్విడ్-కూల్డ్ సిస్టమ్‌తో కూడిన 5 kWh IP67-రేటెడ్ బ్యాటరీ ప్యాక్ మాటర్ ఎలక్ట్రిక్ బైక్‌కు గుండెకాయ. 113.4 bhp పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో మ్యాటర్ ఏరా రెండు వేరియంట్లు వస్తాయి. ఒకే ఛార్జ్‌తో ఎలక్ట్రిక్ బైక్ 172 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే 1 కిలోమీటర్ ప్రయాణించడానికి ఈ EV కి కేవలం 25 పైసలు మాత్రమే ఖర్చవుతుందని అర్థం.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీతో మార్కెట్‌లోకి రావడం నిజంగా సంచలనం. బ్యాటరీ లైఫ్ గురించి ఆందోళన చెందుతున్న EV కొనుగోలుదారులకు ఇది గొప్ప భరోసాను ఇస్తుంది. గేర్ ఉన్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ కావడం, మంచి రేంజ్, లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ వంటి ఫీచర్లు దీనికి అదనపు బలాలు. ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు ఇది గట్టి పోటీనిస్తుందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








