మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ స్కూటర్..90కిమీ మైలేజ్ ఇస్తూ బడ్జెట్ పై భారం తగ్గించే బెస్ట్ ఫ్రెండ్
మైలేజ్ అంటే ప్రాణం పెట్టే భారతీయ స్కూటర్ లవర్స్‌కు సుజుకి ఒక సంచలన శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. దేశంలో బాగా అమ్ముడవుతున్న సుజుకి యాక్సెస్ స్కూటర్ త్వరలో ఒక కేజీ సీఎన్‌జీకి ఏకంగా 90కి.మీ మైలేజ్ ఇచ్చే వెర్షన్‌లో రాబోతోంది. జపాన్ ఇంజనీర్ల ఈ మాస్టర్ ప్లాన్.. మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి ప్రత్యర్థి స్కూటర్లకి చెమటలు పట్టించడం ఖాయం.
భారతీయ స్కూటర్ మార్కెట్‌లో సుజుకి యాక్సెస్ ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. ఇది చాలా కాలంగా అమ్ముడవుతున్న టాప్-10 స్కూటర్లలో ఒకటిగా ఉంది. అయితే, తాజాగా విడుదలైన 2025 అక్టోబర్ అమ్మకాల నివేదిక చూస్తే యాక్సెస్ అమ్మకాలు కొద్దిగా తగ్గాయి. గత ఏడాది అక్టోబర్‌లో 74,813 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అది 70,327 యూనిట్లకి పడిపోయింది.

అంటే, సుమారు 6 శాతం తరుగుదల కనిపించింది. దీనితో టాప్-10లో యాక్సెస్‌కు మూడవ స్థానం మాత్రమే దక్కింది. మొదటి రెండు స్థానాల్లో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ ఉన్నాయి. అయితే సుజుకి ఒక మాస్టర్ స్ట్రోక్‌కి ప్లాన్ చేస్తోంది. అదే సుజుకి యాక్సెస్ సీఎన్‌జీ వెర్షన్. ఈ కొత్త సీఎన్‌జీ స్కూటర్ అమ్మకాల సంఖ్యను అమాంతం పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల జరిగిన జపాన్ మొబిలిటీ షో 2025 లో సుజుకి యాక్సెస్ సీఎన్‌జీ వెర్షన్‌ను ప్రదర్శనకు ఉంచారు. అక్కడే దీని గురించి ముఖ్యమైన సమాచారం బయటకొచ్చింది. ఈ సీఎన్‌జీ స్కూటర్ ఒక కిలో సీఎన్‌జీకి దాదాపు 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ మైలేజ్ నిజమైతే ప్రపంచంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లలో ఇది ఒకటిగా నిలవడం ఖాయం.

పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఇంత మైలేజ్ ఇచ్చే స్కూటర్ వస్తే, వినియోగదారులు కచ్చితంగా యాక్సెస్ వైపు మొగ్గు చూపుతారు. ఇది సుజుకి యాక్సెస్ అమ్మకాలను వేగంగా పెంచేందుకు దోహదపడుతుంది. ఈ స్కూటర్ ఇటు ఫ్యామిలీల పరంగా, అటు యూత్ పరంగా బాగా క్రేజ్ తెచ్చుకుంది. త్వరలోనే సీఎన్జీ వెర్షన్ లో కూడా వస్తే దీనికి తిరుగు లేదనే చెప్పాలి.
ప్రస్తుతానికి సుజుకి యాక్సెస్ సీఎన్‌జీ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇది మార్కెట్‌లోకి వస్తే, టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీకి నేరుగా పోటీ ఇవ్వనుంది. టీవీఎస్ కూడా త్వరలోనే బహుశా 2026 మధ్యలో జూపిటర్ సీఎన్‌జీని విడుదల చేయాలని చూస్తోంది.
సీఎన్‌జీ వెర్షన్ల రాకతో మైలేజ్ విషయంలో కంపెనీల మధ్య పోటాపోటీ మొదలవుతుంది. సుజుకి 90 కి.మీ మైలేజ్‌తో వస్తే, అది కేవలం టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీకి మాత్రమే కాకుండా, పెట్రోల్ స్కూటర్ల మార్కెట్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న హోండా యాక్టివాకి కూడా పెద్ద తలనొప్పిగా మారనుంది. మొత్తం మీద సీఎన్‌జీ స్కూటర్ల యుగం ప్రారంభమైతే వినియోగదారులకు మరింత తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.


Click it and Unblock the Notifications








