కొండల్లో సైతం దూసుకుపోయే శక్తివంతమైన యెజ్డీ అడ్వెంచర్.. ఈ సారి దుమ్ములేచిపోద్ది.. లాంచ్ ఎప్పుడంటే?
భారతదేశం ఇప్పుడు అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లకు కేంద్రబిందువుగా మారుతోంది. ఒకప్పుడు సాధారణ బైకులను కొనుగోలు చేయడానికి ఇష్టపడేవారు కూడా క్రమంగా తమ ధోరణిని మార్చుకుని మారుతున్న కాలానికి అనుగుణంగా అడ్వెంచర్ తరహా వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ లాంటి బైక్‌ల్లొచ్చిన ప్రభావంతో ఈ విభాగం గత పది సంవత్సరాల్లో విస్తృతంగా పెరిగింది. ఇదే తరుణంలో, ఇప్పుడు ఈ పోటీ రంగంలో అడుగుపెడుతోన్న యెజ్డి అడ్వెంచర్ (Yezdi Adventure) మోడల్ అనేకమంది మోటార్‌సైకిల్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు రెట్రో బైక్‌లకు ప్రసిద్ధిగాంచిన ఈ బ్రాండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగిన బైక్‌లను విడుదల చేస్తుంది. యెజ్డి అడ్వెంచర్ మోడల్ కూడా బైకు లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది.
ఈ బైక్‌ను మరింత ఆధునికీకరించి మళ్లీ మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. కొత్తగా అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను ముందుగా మే 15, 2025న విడుదల చేయాలని షెడ్యూల్ చేసినా, అనూహ్యంగా వాయిదా పడింది. దీనికి కారణం, మే మొదటివారంలో భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ విడుదల తేదీని జూన్ 4కి మార్చింది. కొత్త యెజ్డి అడ్వెంచర్ బైక్ వేరే లెవెల్‌లో ఉన్నట్టే అనిపిస్తోంది.

ఫీచర్ల పరంగా కొత్త మార్పులు, ఇంకా శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన సస్పెన్షన్, టెక్-అప్‌గ్రేడ్‌లతో ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని LED హెడ్‌లైట్ డిజైన్ కొత్తగా అనిపిస్తుంది. గతంలో కంటే ఇది మరింత ధైర్యంగా ప్రయోగాలు చేస్తూ అసాధారణ పనితీరును చూపించే లుక్‌ను చూపిస్తుంది. ఎంట్రీ-లెవల్ అడ్వెంచలర్ విభాగంలో పోటీదారులన్నింటికన్నా భిన్నంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ మార్పులు చోటు చేసుకున్నట్టు కనిపిస్తోంది.
రాబోయే మోడల్‌లో కొత్త ఫీచర్లు, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ ఉండే అవకాశం ఉంది. ఇది టూర్, ట్రైల్ రైడర్లకు మరింత సౌకర్యంగా అనిపిస్తుంది. గత ఏడాది యెజ్డి అడ్వెంచర్ ఇప్పటికే కొన్ని గణనీయమైన మార్పులతో తిరిగి మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో, ఈసారి మాత్రం మెకానికల్ అంశాల్లో పెద్దగా మార్పులు కనిపించే అవకాశాలు తక్కువ. బైక్‌కి శక్తిని అందించే 334cc సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఈ వెర్షన్‌లో కూడా కొనసాగనుంది.

ఈసారి రోడ్డెక్కబోతున్న యెజ్డి అడ్వెంచర్ వెర్షన్‌లో అత్యంత గమనించదగిన అంశం ఆల్ఫా 2గా పిలవబడుతున్నఇంజిన్ గత వర్షన్‌తో పోలిస్తే మెరుగైన పనితీరును ఇస్తోంది. ఈ 334సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడింది, అదనంగా స్లిప్పర్-అసిస్ట్ క్లచ్ తో రైడింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చుతోంది. ఇది 29.68 Bhp పవర్, 29.84 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజిన్‌లో మరో ముఖ్యమైన అంశం, ఇది OBD2B ప్రమాణానికి అనుగుణంగా తయారైంది. ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వచ్చిన E20 ఫ్యూయల్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. అంటే ఈ బైక్ ఇకపై 20 శాతం ఎథనాల్ కలిసిన పెట్రోల్‌పై నడిచేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇది పర్యావరణానికి మేలు చేసే అంశం. బైకు నుంచి తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలు విడుదల అవుతాయి.

యెజ్డి అడ్వెంచర్ టూరింగ్‌కి సెట్ అయ్యే బైక్. ప్రధానంగా ఆకర్షణగా సస్పెన్షన్ ఒకటి. బైక్ ముందు భాగంలో 41 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో 7-స్టెప్ ప్రీలోడ్ సర్దుబాటు సస్పెన్షన్ ఉంటుంది. దీంతో భిన్నమైన రోడ్డు పరిస్థితుల్లోనూ, పర్వత ప్రాంతాల్లోనూ సజావుగా ప్రయాణించగల సామర్థ్యం ఈ బైక్‌కి లభిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు 320 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్, వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఉంది.


Click it and Unblock the Notifications








