బుక్ చేసుకున్న వాళ్లు ఇంకా వెయిట్ చేయాల్సిందే.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ చేతుల్లోకి రావాలంటే లేట్ అవుతుంది
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఓలా కంపెనీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ఇప్పటికే అనేక రకాల మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసి కస్టమర్లకు బాగా దగ్గరైంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో, ఆకట్టుకునే లుక్‌తో పాటు కస్టమర్లకు అందుబాటు ధరలో వాహనాలను అందించడం ఆ కంపెనీ ప్రత్యేకత. సాధారణంగా ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలోనే అత్యధికంగా స్కూటర్లు విడుదల అవుతున్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో బైక్స్ కావాలనుకునే వారికి తీవ్ర నిరాశే ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే ఓలా కంపెనీ రోడ్ స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది.
ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో గట్టి పట్టు సాధించింది. ఎలక్ట్రిక్ బైక్‌తో మార్కెట్ దున్నేసేందుకు రెడీ అవుతుంది. ఫిబ్రవరిలో రోడ్ స్టర్ ఎక్స్, రోడ్ స్టర్ ఎక్స్ ప్లస్ అనే రెండు బైక్ లను విడుదల చేసింది. వీటితో ఈ విభాగంలో సునామీ సృష్టించే అవకాశం ఉంది. ఓలా నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ మోడల్ ధర ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ బైక్ స్ల్పెండర్ ధరకు సమానంగా ఉంటుంది.

స్ల్పెండర్ బైక్ ధరలోనే ఓలా బైక్ కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీ దేశంలోని 100సీసీ, 150సీసీ బైక్ మార్కెట్లను టార్గెట్ చేసింది. మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ధర కూడా ఎక్కువగా లేకపోవడంతో పెట్రోల్ బైకులను కొనుగోలు చేసే వారు వీటికి ఆకర్షితులు కావచ్చని కంపెనీ భావిస్తోంది. ఈ నెలలోనే ఎంట్రీ లెవల్ మోడల్ రోడ్ స్టర్ ఎక్స్ ఈవీల డెలివరీ ప్రారంభించాలని అనుకుంది.
కానీ, ఈ బైక్ ఇంకా హోమోలోగేట్ కాలేదని తెలుస్తోంది. అందువల్ల ఓలా ఎలక్ట్రిక్ బైక్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్న వారు ఇంకాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది.హోమోలోగేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడానికి గల కారణాన్ని కంపెనీ వివరించలేదు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు హోమోలోగేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది.

హోమోలోగేషన్ పూర్తి కావాలంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రేంజ్ టెస్ట్, టాప్ స్పీడ్ టెస్ట్, గ్రేడబిలిటీ టెస్ట్, యాక్సిలరేషన్ టెస్ట్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ సిస్టమ్ సేఫ్టీ టెస్ట్, స్ట్రక్చరల్ అండ్ డ్యూరబిలిటీ టెస్ట్, బ్రేకింగ్ అండ్ స్టెబిలిటీ టెస్ట్, అలాగే ఫైర్ సేఫ్టీ టెస్ట్, ఛార్జింగ్ అండ్ కనెక్టర్ కంప్లైయన్స్ టెస్ట్ వంటి వాటిలో పాస్ కావాల్సి ఉంటుంది.
హోమోలోగేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు వాహనం రోడ్డు మీదకు వెళ్లడానికి అనుమతి ఉండదు. సదరు వాహనం అన్ని టెస్టుల్లో పాస్ అయితేనే టైప్ అప్రూవల్ సర్టిఫికెట్ పొందుతుంది. సమాచారం ప్రకారం ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ డెలివరీలు ఆలస్యంగా ప్రారంభం అవుతాయి. ఓలా తన మొట్టమొదటి బైక్‌ను స్పోర్టీ స్టైల్‌తో రూపొందించింది.

ఈ రోడ్ స్టర్ బైక్స్ రెగ్యులర్, ఎక్స్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రివోల్ట్, ఒడిస్సీ, అల్ట్రా వయలెట్, ఒబెన్ రోర్ వంటివి మార్కెట్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటి ఆధిపత్యానికి బ్రేక్ పడనుంది. రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ బేస్ వేరియంట్ 2.5kWh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 140 కి.మీ. ప్రయాణించవచ్చు. దీని ఎక్స్ షోరూం ధర రూ.74,999.
అలాగే మిడ్ స్పెక్ మోడల్ ధర రూ. 84,999(ఎక్స్ షోరూం). ఇది 3.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 196 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఓలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 95,999(ఎక్స్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. 4.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జి చేస్తే 252 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

కంపెనీ కొత్త రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్‌ను కూడా ప్రవేశ పెట్టింది. ఇది 4.5kWh బ్యాటరీ , 9.1 kWh బ్యాటరీతో వస్తున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.1.05లక్షలు, రూ.1.55 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ బైక్లను ఒక్కసారి ఛార్జి చేస్తే వరుసగా 252 కి.మీ, 501 కి.మీ మేర ప్రయాణించవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 4.3-అంగుళాల LCD స్క్రీన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, అడ్వాన్స్‌డ్ రీజెన్, క్రూయిజ్ కంట్రోల్, TPMS, OTA అప్‌డేట్స్, స్పోర్ట్స్, నార్మల్, ఎకో అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. డెలివరీ కాస్త లేటయినా చరిత్ర సృష్టించబోయే బైక్ రైడింగ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications








