పొద్దున్న బండి ఇస్తే సాయంత్రానికి రెడీ..బుద్ది తెచ్చుకుని సర్వీస్‌లో భారీ మార్పులు చేసిన ఓలా
ఒకప్పుడు ఇండియా ఈవీ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) అంటే ఒక తిరుగులేని శక్తి. 2024లో ఏకంగా 4 లక్షల స్కూటర్లను అమ్మి, మార్కెట్లో దాదాపు 40 శాతం వాటాను కైవసం చేసుకుంది. కానీ, సేల్స్ పెరిగినంత వేగంగా సర్వీస్ క్వాలిటీ పెరగలేదు. వేల సంఖ్యలో ఫిర్యాదులు, సర్వీస్ సెంటర్ల ముందు కస్టమర్ల నిరసనలతో ఓలా బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ అయ్యింది.
నవంబర్ 2024 నాటికి ఓలా మార్కెట్ వాటా పడిపోవడమే కాకుండా, టీవీఎస్, బజాజ్, ఏథర్ వంటి దిగ్గజాలు ఓలాను ఐదో స్థానానికి నెట్టేశాయి. ఈ క్లిష్ట సమయంలో కస్టమర్ల నమ్మకాన్ని మళ్ళీ సంపాదించేందుకు ఓలా సీఈఓ భావిష్ అగర్వాల్ హైపర్ సర్వీస్(HyperService) అనే వినూత్న వ్యూహానికి తెరలేపారు.

హైపర్ సర్వీస్ అంటే ఏమిటి? కస్టమర్లకు కలిగే లాభాలేంటి?
కస్టమర్లు సర్వీస్ సెంటర్ కి వెళ్తే రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా, అదే రోజు సర్వీస్ - అదే రోజు డెలివరీ అనే కాన్సెప్ట్‌తో ఓలా ముందుకొచ్చింది. దీని ప్రత్యేకతలు ఇవే: స్కూటర్ ఇచ్చిన రోజే రిపేర్ పూర్తి చేసి కస్టమర్‌కు అప్పగిస్తారు. సాధారణ సర్వీస్ సెంటర్లను హైపర్ సెంటర్లుగా మారుస్తున్నారు. ఇక్కడ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏసీ లాంజ్‌లు, ఉచిత వైఫై సౌకర్యం ఉంటుంది.
మీ స్కూటర్ లోపల మెకానిక్ ఏం చేస్తున్నాడు? ఏ పార్ట్ మారుస్తున్నారు? అనే విషయాలను మీరు అక్కడ కూర్చుని లైవ్‌గా డిజిటల్ స్క్రీన్లపై చూడవచ్చు. ఇది కస్టమర్లలో పారదర్శకతను పెంచుతుంది. బెంగళూరులోని ఇందిరానగర్‌లో తొలి హైపర్ సెంటర్ ఇప్పటికే షురూ అయ్యింది. త్వరలోనే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోనూ ఇవి రాబోతున్నాయి.

యాప్‌లోనే అపాయింట్‌మెంట్.. ఇక క్యూలో నిలబడక్కర్లేదు!
ఓలా తన మొబైల్ యాప్‌లో సరికొత్త ఫీచర్లను జోడించింది. కస్టమర్లు ఇకపై నేరుగా సర్వీస్ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. యాప్ ద్వారా తమకు నచ్చిన టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న సమయానికి వెళ్తే వెంటనే టెక్నీషియన్ మీ స్కూటర్ తీసుకుంటారు.
అంతేకాకుండా, సర్వీస్ స్టేటస్‌ను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసే సదుపాయం కూడా కల్పించారు. దీనివల్ల ఫోన్ కాల్స్ చేసే అవసరం లేకుండా, అంతా మీ వేలిముద్రలతోనే పూర్తవుతుంది.

భారీ రిపేర్లు ఉంటే పరిస్థితి ఏంటి?
ఓలా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. సాధారణ సర్వీస్, చిన్న చిన్న రిపేర్లకు మాత్రమే అదే రోజు డెలివరీ వర్తిస్తుంది. ఒకవేళ స్కూటర్ కండిషన్ చాలా అధ్వాన్నంగా ఉన్నా లేదా స్పెషల్ స్పేర్ పార్ట్స్ కావాల్సి వచ్చినా కొంచెం సమయం పట్టవచ్చు.
అయితే, గతంలోలాగా నెలల తరబడి వేచి చూసే పరిస్థితి ఉండదని కంపెనీ హామీ ఇస్తోంది. బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడల్స్ నుంచి వస్తున్న గట్టి పోటీని తట్టుకోవడానికి ఓలా వేసిన ఈ పదహారు అడుగుల వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ఇన్నాళ్ల పాటు ఇబ్బంది పడిన కస్టమర్ల కష్టాలు పోతాయేమో చూడాలి.


Click it and Unblock the Notifications








