యమ స్పీడు.. డబుల్ సేఫ్టీ.. ఓలా కొత్త స్కూటర్ కొంటే హెలికాప్టర్ ఫీలింగ్ ఖాయం
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన అమ్ములపొదిలోని సరికొత్త ఆయుధాన్ని రోడ్లపైకి తీసుకొచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 4680 భారత్ సెల్ (Bharat Cell) బ్యాటరీ ప్యాక్ కలిగిన S1 Pro+ (5.2 kWh) స్కూటర్ల డెలివరీలను కంపెనీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో వేగవంతం చేసింది.
తమిళనాడులోని ఓసూరులో ఉన్న గిగా ఫ్యాక్టరీలో ఈ బ్యాటరీలను సొంతంగా తయారు చేయడం ద్వారా, బ్యాటరీ సెల్స్, వాహనాలను పూర్తిస్థాయిలో ఇండియాలోనే ఉత్పత్తి చేస్తున్న తొలి కంపెనీగా ఓలా చరిత్ర సృష్టించింది.

ఓలా ఎలక్ట్రిక్ తన S1 Pro+ (5.2 kWh) మోడల్‌లో విప్లవాత్మకమైన 4680 భారత్ సెల్ టెక్నాలజీని వాడింది. ఈ సెల్స్ 46 మిమీ వెడల్పు, 80 మిమీ ఎత్తు కలిగి ఉండి, గతంలో వాడిన 2170 సెల్స్ కంటే 10% ఎక్కువ శక్తిని ఇస్తాయి. దీనివల్ల తక్కువ బరువుతో ఎక్కువ మైలేజీని పొందే వీలుంటుంది. ఓసూర్ గిగా ఫ్యాక్టరీలో వీటిని తయారు చేయడం వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గి, ధరలను నియంత్రించే అవకాశం ఓలాకు దక్కింది.
ఈ స్కూటర్ కేవలం చూడటానికే కాదు, పెర్ఫార్మెన్స్ లోనూ అదరగొడుతోంది. ఇందులో పవర్‌ఫుల్ 13 kW మోటార్‌ను అమర్చారు. ఇది కేవలం 2.1 సెకన్లలోనే 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 130 కి.మీ కు పైగా ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే IDC (Indian Driving Cycle) ప్రకారం ఏకంగా 320 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం మొత్తం తిరిగేయొచ్చన్నమాట!

సేఫ్టీ విషయంలో ఓలా విప్లవాత్మక మార్పులు చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తొలిసారిగా డ్యూయల్ ఛానల్ ABS (Anti-lock Braking System) ను ప్రవేశపెట్టింది. దీనివల్ల తడి రోడ్లపై లేదా సడన్ బ్రేక్ వేసినప్పుడు స్కూటర్ స్కిడ్ అవ్వకుండా సురక్షితంగా ఆగుతుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు హైపర్, స్పోర్ట్, నార్మల్, ఈకో అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను ఇచ్చారు.
ఓలా తన Gen-3 పోర్ట్‌ఫోలియోలో రకరకాల ధరల్లో స్కూటర్లను అందిస్తోంది. S1 Pro+ (5.2 kWh) ధర సుమారు రూ. 1,90,338 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. S1 Pro+ (4 kWh) ధర రూ. 1,70,338 నుంచి ప్రారంభమవుతుంది. మాస్ మార్కెట్ కోసం తీసుకొచ్చిన S1 X శ్రేణి స్కూటర్లు రూ. 84,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఓలా ఇటీవల విడుదల చేసిన రోడ్స్టర్ (Roadster X) ఎలక్ట్రిక్ బైకులు కూడా రూ.99,999 నుంచి రూ.1,89,999 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఓలా ఇప్పుడు కేవలం వెహికల్ కంపెనీ మాత్రమే కాదు, ఒక టెక్నాలజీ దిగ్గజంగా మారుతోంది. భారత్ సెల్ పంపిణీ పెరగడం వల్ల త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్, కొచ్చి, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల్లో డెలివరీలు మొదలవ్వడం చూస్తుంటే, దేశవ్యాప్తంగా 'ఓలా హవా' మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








