మార్కెట్లో వచ్చినంత వేగంగా పడిపోతున్న ఓలా.. బజాజ్, టీవీఎస్ వైపు మొగ్గు చూపుతున్న జనాలు
ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. వాతావరణానికి అనుకూలంగా ఉండడం, పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండడంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఈ వాహనాలు చాలా బెస్ట్. ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీల హవా నడుస్తోంది. దీంతో అన్ని కంపెనీలు ఈ వాహనాల మీద దృష్టి సారించాయి.
కాకపోతే మన దేశంలో ఈవీ వాహానాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చాలా మంది ఇంకా ఎలక్ట్రిక్ కార్లు కొనేందుకు వెనకాడుతున్నారు. కానీ, అదే సమయంలో ఎలక్ట్రిక్ 2-వీలర్ల అమ్మకాలు నెమ్మదిగా.. స్థిరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా పూర్తిగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆధారపడే ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలోని టాప్-10 ద్విచక్ర వాహన కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

ఇటీవల ఎలక్ట్రిక్ బైక్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో కంపెనీలు రోజుకో మోడల్ ను మార్కెట్లోకి తెస్తున్నాయి. అల్ట్రావయోలెట్ ఇటీవల విడుదల చేసిన షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్ రాకతో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి 2025 నెలలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిన కంపెనీల గురించి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రస్తుతం మన దేశంలో 20 కి పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీలు ఉన్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ కంపెనీల ద్వారా ఫిబ్రవరిలో మొత్తం 76,086 ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్ముడయ్యాయి. వామ్మె ఇన్నా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే, ఫిబ్రవరి 2024లో దేశవ్యాప్తంగా 82,745 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడయ్యాయి.

జనవరి 2025లో లక్ష ఎలక్ట్రిక్ టూవీలర్లు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరి నెలలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ టూ-వీలర్లను విక్రయించిన కంపెనీల జాబితాలో బజాజ్ ఆటో ఫస్ట్ ప్లేసులో నిలిచింది. ఇప్పటి వరకు బజాజ్ నుంచి చేతక్ అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్ముడవుతోంది. బజాజ్ 21,389 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి అగ్రస్థానాన్ని నిలుపుకుంది. గత కొన్నేళ్లుగా ఈ అగ్రస్థానాన్ని ఓలా ఎలక్ట్రిక్ కలిగి ఉంది.
ఫిబ్రవరి 2024లో ఓలా ఎలక్ట్రిక్ 34,063 ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నాళ్లుగా ఓలా అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఫిబ్రవరి 2024లో బజాజ్ కేవలం 11,764 చేతక్ స్కూటర్లను మాత్రమే విక్రయించింది. టీవీఎస్ మోటార్ 18,762 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి రెండో స్థానంలో ఉంది. బజాజ్ లాగే టీవీఎస్ మోటార్ కూడా ఒకే ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ iQubeను విక్రయిస్తుంది. ఈథర్ మూడో స్థానంలో ఉంది.

ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయించిన ఈథర్ ఫిబ్రవరిలో 11,807 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. 4వ స్థానానికి దిగజారిన ఓలా ఎలక్ట్రిక్ గత నెలలో కేవలం 8,647 ఎలక్ట్రిక్ టూ-వీలర్లను మాత్రమే విక్రయించింది. ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ను గతేడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది. డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ జాబితాలో 3,700 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడుపోవడంతో ఆంపియర్ 5వ స్థానంలో ఉంది.
2,678 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు అమ్ముడుపోవడంతో హీరో విడా ఆరో స్థానంలో ఉంది. వీటి తర్వాత 7వ, 8వ స్థానాల్లో ప్యూర్ ఈవీ, బికాస్ కంపెనీలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో వాటి అమ్మకాల గణాంకాలు వరుసగా 1,566, 1,218గా నమోదయ్యాయి. ఈ టాప్-10 జాబితాలో చివరి 2 స్థానాల్లో కైనెటిక్ (765), తర్వాత రివోల్ట్ (760) ఉన్నాయి.


Click it and Unblock the Notifications








