కేవలం 22 నెలల్లోనే 10,000 స్కూటర్లు.. సింగిల్ ఛార్జ్‌తో 161 కి.మీల రివర్ ఇండీ స్కూటర్‌కు భారీ డిమాండ్
భారతదేశంలోని వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంపెనీల్లో బెంగళూరుకు చెందిన రివర్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. ఇది బెంగళూరు సమీపంలోని హోస్కోట్ ప్రాంతంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని సంవత్సరానికి లక్ష స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నెలకొల్పింది. ఈ యూనిట్ నుంచి 2023 ఆగస్టు 25న తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రోడ్డెక్కించింది. ఇండి పేరుతో పరిచయం చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభం నుంచే వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. మొదటి స్కూటర్ నుండి ఈ రోజు వరకు, కేవలం 22 నెలల్లోనే రివర్ ఒక ప్రత్యేకమైన ఘనతను సాధించింది. తాజాగా, 10,000వ స్కూటర్ తయారీ కేంద్రం నుంచి పూర్తిగా రూపొందింపబడి, దేశంలోని వినియోగదారుల కోసం షోరూమ్‌కి బయలుదేరింది.
ఇది కంపెనీకి ఒక గొప్ప మైలురాయి. ఇది మాత్రమే కాకుండా, రాబోయే కాలంలో మరింత విస్తరించడానికి, కొత్త వేరియంట్లు పరిచయం చేయడానికి కంపెనీ దిశగా అడుగులు వేస్తోంది. రివర్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తన లక్ష్యాలతో దూసుకెళ్తూ, భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మంచి సక్సెస్ అందుకుంటోంది. ప్రస్తుతం కంపెనీకి బెంగళూరు, మైసూర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, విశాఖపట్నం వంటి 15 ప్రధాన నగరాల్లో విస్తరించిన 27 షోరూమ్‌లు ఉన్నాయి.

ఈ వృద్ధిలో భాగంగా రివర్ తన నెట్‌వర్క్‌ను మరింత బలపరిచేందుకు కృషి చేస్తోంది. తాజాగా పూణే, విజయవాడ, తిరువనంతపురం నగరాల్లో కొత్త షోరూమ్‌లను ప్రారంభించడం ద్వారా మరింత విస్తరణ చేయనుంది. ఈ సందర్భంగా రివర్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ మణి తన సంతోషాన్ని వెల్లడించారు. ఈ రోజు ఫ్యాక్టరీ నుండి 10,000వ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడం మాకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
ఇది కంపెనీ సిబ్బందికి మాత్రమే కాకుండా, దీన్ని నమ్మి కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి కూడా ఓ గొప్ప క్షణం. ఈ సక్సెస్ ఇండి ఇ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. మార్చి 2026 చివరి నాటికి భారత్‌లో 100 కి పైగా షోరూమ్‌లు ప్రారంభించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ సంకల్పం, స్పష్టమైన దిశతో రివర్ మొబిలిటీ కొత్త వాణిజ్య విస్తరణను సృష్టించడానికి సిద్ధమవుతోందని ఆయన అన్నారు.

రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఉన్న ప్రత్యేకత వల్లే దీనిని ఎలక్ట్రిక్ స్కూటర్లలో SUVగా పిలుస్తుంటారు. ఈ స్కూటర్‌లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 4 కిలోవాట్(kWh) కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేసిన తరువాత 161 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్ అందిస్తుంది, ఇది దాని విభాగంలోనే అత్యుత్తమ రేంజ్‌లలో ఒకటి. అందువల్ల, దీన్ని రోజువారీ అవసరాలకు, ఆఫీస్ రైడింగ్‌కి, సరుకుల రవాణాకు వినియోగించవచ్చు.
రివర్ ఇండి స్కూటర్‌లో 6.7 kW పవర్ (9 హెచ్‌పీ) ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది 26 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి వల్ల చిటికెలో వేగం అందించగల సామర్థ్యం ఉండటంతో, ట్రాఫిక్‌లో తక్కువ ఒత్తిడితో, ఈజీ ప్రయాణాన్ని ఇస్తుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఇది స్టార్మ్ గ్రే, వింటర్ వైట్, మాన్సూన్ బ్లూ, స్ప్రింగ్ ఎల్లో వంటి ప్రత్యేకమైన కలర్స్‌లల ఈ మోడల్ లభిస్తుంది.

ఈ స్కూటర్‌కి నిర్ణయించిన ధర కూడా అందుబాటులోనే ఉంది. ఇది రూ.1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లభిస్తుంది. ఇది ఎకో, రైడ్, రష్ అనే డ్రైవింగ్ మోడ్స్‌లో కలిగి ఉంటుంది. దీనిలోని బ్యాటరీ ప్యాక్‌ను 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. ఇది రైడింగ్ మెరుగైన కంట్రోలింగ్ కోసం డిస్క్ బ్రేక్‌లు, BS (కంబైన్డ్-బ్రేకింగ్ సిస్టమ్) ఆప్షన్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








