దేశంలో బుల్లెట్ బైకులకు విపరీతమైన డిమాండ్.. జూన్‌లో రోడ్లపై బుల్లెట్ గర్జన.. రికార్డు సేల్స్
యూత్‌తో పాటు పెద్ద వయస్సుల వారని అట్రాక్ట్ చేసే బైకులను విడుదల చేయడంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (royal enfield) దశాబ్ద కాలంగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. దీని నుంచి మార్కెట్లోకి ఒక మోడల్ వచ్చిందంటే చాలు, దాని గురించి జనాలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. డుగ్గు డుగ్గు అంటూ సౌండ్ చేసుకుంటూ రోడ్లపై దూసుకుపోవడంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు పెట్టింది పేరు. తాజాగా కంపెనీ జూన్ 2025కు సంబంధించిన సేల్స్ నివేదికను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 76,957 బైక్‌లను విక్రయించడం ద్వారా మళ్లీ తన సత్తా చాటింది. ఇది గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే సగటున 16 శాతం వృద్ధిని సూచిస్తోంది. వినియోగదారుల నుంచి పొందుతున్న నమ్మకం, ప్రీమియం మోటర్‌సైకిల్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పెరుగుతున్న ప్రాధాన్యత అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఇదే సమయంలో దేశీయంగా అమ్మకాలతో పాటే ఎగుమతుల పరంగా కూడా కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. జూన్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 12,583 యూనిట్లను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసింది. ఇది కంపెనీ గ్లోబల్ మార్కెట్లో మరింత విస్తరిస్తుందనడానికి నిదర్శనగా నిలుస్తోంది. స్థిరమైన దేశీయ డిమాండ్‌తో పాటు, విదేశీ మార్కెట్లలోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు దక్కుతున్న ఆదరణను స్పష్టంగా ఈ గణంకాలు చూపిస్తున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ జూన్ 2025లో ఎగుమతులు, దిగుమతులు కలిపి మొత్తంగా 89,540 యూనిట్లను విక్రయించడం ద్వారా 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూన్ నెలతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు క్రమంగా పెరుగుతూ, ఈ మూడు నెలల్లో మొత్తం 2,65,528 బైక్‌లను (దేశీయ అమ్మకాలు + ఎగుమతులు) విక్రయించింది.
ఇది గత ఆర్థిక సంవత్సరం 2024-25 అదే కాలంలో చేసిన అమ్మకాలతో పోలిస్తే 17 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ మొత్తం 2,65,528 యూనిట్ల అమ్మకాల్లో 2,28,779 యూనిట్లు భారతదేశంలోనే అమ్ముడవ్వగా, 36,749 యూనిట్లను కంపెనీ విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. ఈ గణాంకాలు, రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం దేశీయంగా మాత్రమే కాకుండా, గ్లోబల్ మార్కెట్లోనూ తన ప్రాబల్యాన్ని వేగంగా పెంచుకుంటోందని స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఒక్క జూన్ నెలలోనే కాకుండా, త్రైమాసికంగా కూడా ఇలా స్థిరమైన వృద్ధి కొనసాగించడమే కంపెనీకి భవిష్యత్తులో మరింత విస్తరించడానికి బలమైన పునాదిగా మారుతోంది. వినియోగదారుల నమ్మకం, ప్రతిష్టాత్మక బ్రాండ్ ఇమేజ్, ఆకట్టుకునే డిజైన్ల కారణంగా ఇది ఏళ్లుగా ప్రజల అభిమానాన్ని పొందుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. దీంతో బైక్‌ల అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
ముఖ్యంగా, 750 సీసీ, 650 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో కొత్త మోడళ్లను అందుబాటులోకి తేవాలని కంపెనీ భావిస్తోంది. ఈ బైక్‌లు సాధారణ రైడింగ్‌కి మాత్రమే కాకుండా, లాంగ్ రైడ్, టూరింగ్‌కి మరింత అనువుగా ఉండేలా రూపొందించబడతాయి. అదేవిధంగా, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సత్తా చాటేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఫ్లయింగ్ ఫ్లీ C6 అనే ఎలక్ట్రిక్ బైక్ భారత రోడ్లపై పరీక్షల దశలో ఉంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే 2026లో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ బైక్ ఆధునిక డిజైన్, శక్తివంతమైన మోటార్, ఆకర్షణీయమైన రేంజ్ వంటి లక్షణాలతో వస్తుందని ఊహిస్తున్నారు. ఇంకా, కంపెనీ మరింత అందుబాటు ధరలో కొత్త బైక్‌ను పరిచయం చేయాలని కూడా యోచిస్తోంది. ఇది 250 సీసీ ఇంజిన్ సామర్థ్యం గల హైబ్రిడ్ బైక్‌గా ఉంటుందని సమాచారం.
దీనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇది లీటరుకు 50 కిలోమీటర్లకు మించిన మైలేజ్ ఇవ్వగలిగేలా రాబోతుందని, దూర ప్రయాణాలకు తగిన విధంగా రూపొందించబడి, ఖర్చు పరంగా కూడా సమన్యాయం చేసేలా ఉంటుందని చెబుతున్నారు. దీనికి ప్రారంభ ధర సుమారు రూ.1.20 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇవన్నీ మార్కెట్లోకి వస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు ఉన్నదాని కంటే మరింత పెరుగుతుంది.


Click it and Unblock the Notifications








