ఇది బైకు కాదు ఒక ఎమోషన్.. సౌండ్ విన్నారంటే చాలు.. ఏళ్లు గడిచిన క్రేజ్ తగ్గలేదు
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) ఒకటి. ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ కొత్తది కాదు. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరంగా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. ప్రత్యేకంగా క్లాసిక్ డిజైన్, గంభీరమైన రోడ్ ప్రెజెన్స్, నమ్మకమైన పనితీరు కారణంగా ఈ బైక్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు నవంబర్ 2025 నెలలో కూడా క్లాసిక్ 350 తన సత్తాను మరోసారి చాటుకుంది. ఈ నెలలో మొత్తం 34,793 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. నవంబర్ 2024లో ఈ బైక్ అమ్మకాలు 27,514 యూనిట్లకే పరిమితమయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలోనే 7,279 యూనిట్ల అదనపు అమ్మకాలు నమోదయ్యాయి.
ఈ గణాంకాల ఆధారంగా, ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అమ్మకాలలో 26.46 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ఇది సాధారణ పెరుగుదల కాదు, బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకం ఇంకా బలపడుతోందని చెప్పే స్పష్టమైన సంకేతం. మార్కెట్లో కొత్త మోడళ్లు, ఆధునిక ఫీచర్లతో కూడిన బైక్‌లు వస్తున్నప్పటికీ, క్లాసిక్ 350కు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణాలుగా క్లాసిక్ లుక్, మెరుగైన ఇంజిన్ రిఫైన్‌మెంట్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం.

వార్షిక ప్రాతిపదికన అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ అమ్మకాలు నెలవారీ ప్రాతిపదికన స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే, అక్టోబర్ 2025 నెలలో ఈ బైక్ మొత్తం 46,573 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే, దీనితో పోలిస్తే నవంబర్ 2025 నెలలో అమ్మకాలు తగ్గి 34,793 యూనిట్లకు పరిమితమయ్యాయి.
అంటే ఒక్క నెల వ్యవధిలోనే అమ్మకాల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ, వార్షికంగా మాత్రం క్లాసిక్ 350 తన స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది. ఈ తగ్గుదలకు సీజనల్ డిమాండ్ మార్పులు, పండుగ సీజన్ ముగింపు, మార్కెట్లో ఇతర మోడళ్ల పోటీ వంటి అంశాలు కారణాలుగా ఉండవచ్చని ఆటో నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ, క్లాసిక్ 350కు ఉన్న అభిమాన గణం కారణంగా దీర్ఘకాలికంగా అమ్మకాలపై పెద్దగా ప్రభావం పడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

ధర విషయానికి వస్తే, భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.1,81,118 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ధరకు లభించే క్లాసిక్ లుక్, బలమైన ఇంజిన్ పనితీరు, బ్రాండ్ విలువను దృష్టిలో ఉంచుకుంటే, ఇప్పటికీ ఇది చాలా మంది బైక్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఎంపికగానే కొనసాగుతోంది. అదే సమయంలో, దాని టాప్ వేరియంట్ ధర కూడా కేవలం రూ. 2,15,750(ఎక్స్-షోరూమ్).
పనితీరు విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ తన సెగ్మెంట్‌కు తగిన బలమైన ఇంజిన్ సామర్థ్యంతో ఆకట్టుకుంటుంది. ఇందులో 349 cc సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ మృదువైన పవర్ డెలివరీతో పాటు స్థిరమైన రైడింగ్ అనుభవాన్ని అందించడంలో పేరుగాంచింది. ఇది దూర ప్రయాణాల్లో కూడా బాగా కంఫర్ట్‌గా ఉంటుంది. అలసట లేకుండా సౌకర్యవంతమైన రైడింగ్‌ను అందిస్తుంది.

భద్రత పరంగా, ఈ బైక్‌ను సింగిల్ ఛానల్ ABS, డ్యూయల్ ఛానల్ ABS అనే రెండు వేరియంట్‌లలో అందిస్తున్నారు. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపికలు ఇవ్వడం వల్ల, క్లాసిక్ 350 ఇంకా విస్తృత వర్గాల రైడర్లను ఆకర్షిస్తోంది. మొత్తం మీద, పనితీరు, భద్రత, క్లాసిక్ డిజైన్ అన్నీ కలసి ఈ బైక్‌ను భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా నిలిపాయి.


Click it and Unblock the Notifications








