షోరూమ్ నుండి నేరుగా పర్వతాలకు ట్రిప్ వెళ్ళొచ్చు! హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది
రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూసే వార్షిక వేడుక మోటోవర్స్ ఈసారి గోవా తీరాల్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ ప్రేమికులు, ప్రత్యేకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానం కలిగిన వారు, ప్రతి సంవత్సరం లాంటి ఈ వేడుకలో కొత్త మోడళ్లు, ప్రత్యేక ఎడిషన్‌లు, భవిష్యత్ లాంచ్‌లను చూసే అవకాశం కోసం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈసారి మాత్రం గోవాలో జరిగిన మోటోవర్స్‌కు ప్రత్యేకత మరింత పెరిగింది. ఎందుకంటే కొద్ది వారాల క్రితం ఇటలీలోని మిలన్‌లో నిర్వహించిన 2025 EICMA షోలో ప్రపంచానికి పరిచయం చేసిన అనేక మోడళ్ల ధరలను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇక్కడే ప్రకటిస్తోంది. మొదటి రోజు, అంటే నవంబర్ 21, 2025న, కంపెనీ తన లెజెండరీ హిమాలయన్ శ్రేణిలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది, హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్‌ను అధికారికంగా పరిచయం చేసింది.
ఈ మోడల్ డిజైన్ వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. లడఖ్ ప్రాంతంలో భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న మన పాస్ అనే అత్యంత కఠినమైన, అందమైన, చల్లని ప్రదేశాన్ని ప్రేరణగా తీసుకున్నారు. ఆ పర్వత ప్రాంతపు గాఢమైన నలుపు శిలలు, మబ్బులతో నిండిన పర్వత మార్గాలు, అద్భుతమైన నిశ్శబ్దం.. ఇవే అన్నీ కలిసి ఈ మన బ్లాక్ ఎడిషన్ డిజైన్‌కు గొప్ప ప్రేరణగా నిలిచాయి.

ఈ బైక్ కేవలం ఒక ప్రత్యేక రంగు వేరియంట్ మాత్రమే కాదు. దీనిలో పొందుపరిచిన ఇంజిన్ కూడా దాని శక్తి, సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. 451.65cc లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ బైక్ గుండెలాంటి భాగం. ఇది 39.5 PS పవర్‌ను అందించగా, 40 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ కలిసి, కొండ ప్రాంతాల్లోని రఫ్ రోడ్లలో కూడా ఈ బైక్‌ను అద్భుతంగా స్పందించేలా చేస్తాయి.
ప్రత్యేకంగా మిడ్-రేంజ్ పనితీరు పైనే ఇంజిన్ ట్యూనింగ్‌ను కేంద్రీకరించడం వల్ల, ఇది ఆఫ్-రోడ్ ట్రాక్‌లు, హిమాలయన్ ట్రెయిల్స్ వంటి కఠినమైన మార్గాల్లో అత్యుత్తమ నియంత్రణను అందిస్తుంది. ఈ బైక్ ఫీచర్లలో రైడ్-బై-వైర్ టెక్నాలజీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీని ద్వారా ఇంజిన్‌కు అత్యంత ఖచ్చితమైన థ్రోటిల్ స్పందన లభిస్తుంది. అదేవిధంగా, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంధనాన్ని సమపాళ్లలో అందిస్తూ మెరుగైన మైలేజీని ఇవ్వగలదు.

6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ ఇచ్చినప్పుడు, కఠినమైన పర్వత రహదారులపై గేర్ల మార్పులు చాలా సులభంగా, స్మూత్‌గా ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్ ధరను కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌కు రూ. 3,37,000 (ఎక్స్-షోరూమ్) ధరను నిర్ణయించారు. పోల్చుకుంటే, స్టాండర్డ్ హిమాలయన్ మోడల్ రూ. 3.05 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
అంటే, మన బ్లాక్ ఎడిషన్ ప్రత్యేక డిజైన్, ప్రీమియం ఫినిష్ కారణంగా కొద్ది అదనపు ధరతో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తిగల రైడర్లు ఇప్పుడు ఈ కొత్త మోడల్‌ను బుక్ చేసుకోవడం చాలా సులభం. దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో, అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా బుకింగ్ చేయవచ్చు. అదేకాకుండా, ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టెస్ట్ రైడ్‌లను కూడా ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు.

ఫీచర్స్ పరంగా చూసినట్లయితే ఇది, ఇది నాలుగు అంగుళాల రౌండ్ TFT డిస్‌ప్లేను పొందుతుంది, దీనిలో Google Maps ఉపయోగించి నావిగేషన్, రైడ్ మోడ్‌లు, మీడియా నియంత్రణలు, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. సాధారణ వెర్షన్ లాగానే, ఈ మోడల్ కూడా వృత్తాకార LED హెడ్‌ల్యాంప్, టెయిల్ లాంప్‌లుగా పనిచేసే LED సూచికలను కలిగి ఉన్న పూర్తి-LED లైటింగ్‌ను పొందుతుంది.


Click it and Unblock the Notifications








