స్మార్ట్‌ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్..ఫుల్ ఛార్జ్ తో 89కిమీ రేంజ్‌తో రోడ్డు మీద పోతుంటే అందరి చూపు మీమీదే
భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్ వంటి పెద్ద కంపెనీలు భారీగా అమ్ముడవుతుంటే, చిన్న స్టార్టప్ బ్రాండ్‌లు కూడా సరికొత్త ఐడియాలతో మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ ధరలు మండిపోతున్న నేపథ్యంలో రోజువారీ ప్రయాణాలు జేబుకు చిల్లు పెట్టకుండా ఉండాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి అయ్యాయి.
అయితే చాలామంది కొత్త ఈవీ కొనాలంటే లక్ష రూపాయలైనా ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుక్కోగలిగే రోజులు వచ్చేశాయ్. మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్ కంటే తక్కువ ధరకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చింది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ 'హైఫై' అనే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.42,000మాత్రమే.

సాధారణ పెట్రోల్ స్కూటర్లకు బదులుగా తక్కువ ఖర్చుతో కూడుకున్న, పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయం కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించారు. అంటే ఇందులో పెద్దగా ఫ్యాన్సీ ఫీచర్లు ఉండకపోవచ్చు. ఇది గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 89 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.
దీన్ని బట్టి చూస్తే దగ్గర్లోని ప్రయాణాలకు, అవసరాలకు ఇది ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. 2025 మే 10 నుంచి ఒడిస్సీ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారతదేశం అంతటా ఒడిస్సీ హైఫై ఈ-స్కూటర్ అందుబాటులో ఉంటుంది. ముందుగా కొనుగోలు చేసే వారికి ప్రత్యేక డిస్కౌంట్లు, వారంటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయని తయారీదారులు ప్రకటించారు.

ఒడిస్సీ హైఫై ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 250W మోటార్ అమర్చబడి ఉంది. దీనికి 48V లేదా 60V బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లను జతచేయవచ్చు. ఈ సెటప్‌తో ఈ స్కూటర్ ఒక్క ఛార్జ్‌పై 70 కిలోమీటర్ల నుండి 89 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఛార్జింగ్ గురించి కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం 4 నుండి 8 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
ముంబైకి చెందిన ఒడిస్సీ కంపెనీ ఈ కొత్త మోడల్‌లో కీ స్టార్ట్, స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందించింది. అంతేకాకుండా సిటీ డ్రైవింగ్, రివర్స్, పార్కింగ్ కోసం ప్రత్యేక రైడ్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. మంచి అండర్సీట్ స్టోరేజ్ స్పేస్, క్రూయిజ్ కంట్రోల్, అవసరమైన మొత్తం సమాచారాన్ని చూపించే LED డిజిటల్ మీటర్ కూడా ఇందులో ఉన్నాయి.
ఒడిస్సీ హైఫై ఎలక్ట్రిక్ స్కూటర్ రాయల్ మ్యాట్ బ్లూ, సెరామిక్ సిల్వర్, అరోరా మ్యాట్ బ్లాక్, ఫ్లేర్ రెడ్, జేడ్ గ్రీన్ వంటి 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. తమ కొత్త లో-స్పీడ్ స్కూటర్ ఆవిష్కరణ, స్థిరత్వానికి ఒడిస్సీ నిబద్ధతకు నిదర్శనమని కంపెనీ వ్యవస్థాపకుడు నెమిన్ వోరా అన్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








