యాక్సిడెంట్ అయినా చెక్కు చెదరవు.. ఇండియాలో రూ.2లక్షల్లోపు మోస్ట్ మొండి బైక్స్..లిస్ట్ చూస్తే షాక్ అవుతారు
సాధారణంగా మనం కారు కొనాలంటే సేఫ్టీ రేటింగ్స్, బిల్డ్ క్వాలిటీ గురించి ఆరా తీస్తాం. కానీ బైక్ లేదా స్కూటర్ విషయానికి వచ్చేసరికి కేవలం మైలేజీ ఎంత ఇస్తుంది? ధర ఎంత? అనే విషయాలకే ప్రాధాన్యత ఇస్తాం. కానీ టూ వీలర్ పై ప్రయాణించేటప్పుడు మన ప్రాణాలకు రక్షణ ఉండాలన్నా, బైక్ ఎక్కువ కాలం మన్నిక రావాలన్నా దాని బిల్డ్ క్వాలిటీ చాలా ముఖ్యం. ప్యానెల్ ఫిట్టింగ్, క్వాలిటీ బాడీ పార్ట్స్, పెయింట్ ఫినిషింగ్ వంటివి బైక్ లైఫ్‌ను నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ఇండియాలో రూ.2లక్షల లోపు లభిస్తున్న అత్యుత్తమ బిల్డ్ క్వాలిటీ గల టాప్ బైక్స్ వివరాలు మీకోసం..
1. టీవీఎస్ అపాచీ RTR 160 4V (TVS Apache RTR 160 4V)
టీవీఎస్ సంస్థ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో అపాచీ RTR 160 4V ఒకటి. ఇది కేవలం పెర్ఫార్మెన్స్‌లో మాత్రమే కాదు, నాణ్యతలో కూడా నంబర్ వన్ అనిపించుకుంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.16 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని ఛాసిస్ చాలా గట్టిగా ఉంటుంది, దీనివల్ల హై స్పీడ్‌లో వెళ్తున్నా బైక్ అదుపు తప్పదు. బాడీ ప్యానెల్స్ చాలా పటిష్టంగా అమర్చబడి ఉంటాయి. అందుకే దీనికి త్వరగా తుప్పు పట్టడం లేదా ప్యానెల్స్ వూడిపోవడం వంటి సమస్యలు ఉండవు. పెయింట్ ఫినిషింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.

2. బజాజ్ పల్సర్ NS160 (Bajaj Pulsar NS160)
బడ్జెట్ ధరలో గట్టి బైక్ కావాలనుకునే వారికి పల్సర్ NS160 ఒక గొప్ప ఎంపిక. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.20 లక్షలు. ఈ బైక్‌ను పెరిమీటర్ ఫ్రేమ్ పై నిర్మించారు. దీనివల్ల బైక్‌కు అదనపు బలం చేకూరుతుంది. ఇందులో వాడిన ప్లాస్టిక్ పార్ట్స్ చాలా గట్టిగా ఉంటాయి. మెకానికల్ విడిభాగాలు కూడా భారతీయ రోడ్లకు తట్టుకునేలా మొండిగా ఉంటాయి. ఏళ్ల తరబడి వాడినా ఈ బైక్ లుక్ మారదు.

3. సుజుకి జిక్సర్ SF 150 (Suzuki Gixxer SF 150)
జపనీస్ ఇంజనీరింగ్ అంటేనే నాణ్యతకు మారుపేరు. సుజుకి జిక్సర్ SF 150 బిల్డ్ క్వాలిటీ విషయంలో రాజీ పడదు. దీని ధర సుమారు రూ. 1.26 లక్షలు. ఈ ఫుల్లీ ఫెయిర్డ్ బైక్ ప్యానెల్స్ ఒకదానికొకటి చాలా ఖచ్చితంగా అమర్చబడి ఉంటాయి. దీనివల్ల బైక్ నడుపుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు రావు. చాలా కాలం పాటు ఎటువంటి రిపేర్లు లేకుండా ఈ బైక్ నడుస్తుందని యజమానులు గర్వంగా చెబుతుంటారు. రిఫైన్‌మెంట్ మరియు ఫిట్ అండ్ ఫినిష్‌లో దీనికి సాటి లేదు.

4. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)
రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటేనే ఇనుప బాడీకి పెట్టింది పేరు. హంటర్ 350 ఆ బ్రాండ్‌లో చౌకైన బైక్ అయినప్పటికీ, బిల్డ్ క్వాలిటీలో ఎక్కడా తగ్గలేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.38 లక్షలు. హంటర్‌లో మెటల్ పార్ట్స్ వాడకం ఎక్కువ. జె-సిరీస్ ప్లాట్‌ఫారమ్ మీద తయారైన ఈ బైక్ చాలా బలంగా ఉంటుంది. తక్కువ ధరలోనే అత్యుత్తమ పెయింట్ క్వాలిటీ, గట్టి స్విచ్ గేర్లు, దృఢమైన ఫ్రేమ్ ఇందులో లభిస్తాయి. రోజువారీ ప్రయాణాలకు, లాంగ్ జర్నీలకు ఇది పక్కాగా సరిపోతుంది.

5. హోండా హైనెస్ CB350 (Honda H'ness CB350)
హోండా నుండి వచ్చిన ఈ రెట్రో క్లాసిక్ బైక్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీకి నిదర్శనం. దీని ధర రూ. 1.92 లక్షల నుండి మొదలవుతుంది. ఇందులో వాడిన మెటల్ పానెల్స్, ఎగ్జాస్ట్ ఫినిషింగ్ చూస్తేనే ఇది ఎంత ఖరీదైనదో అర్థమవుతుంది. ప్రతి చిన్న పార్ట్‌ను చాలా జాగ్రత్తగా, గ్యాప్స్ లేకుండా ఫిట్ చేశారు. స్విచ్ గేర్ క్వాలిటీ నుండి ఇంజిన్ రిఫైన్‌మెంట్ వరకు హోండా తనదైన ముద్ర వేసింది. రూ. 2 లక్షల బడ్జెట్‌లో లగ్జరీ మరియు నాణ్యత కావాలనుకునే వారికి ఇదే సరైన ఛాయిస్.


Click it and Unblock the Notifications








