ఇండియాలో ఇదే బెస్ట్ బైక్.. మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్ట్ సొంతం
టీవీఎస్ మోటార్ కంపెనీకి (Tvs Motor Company) మరో ప్రతిష్ఠాత్మక ఘనత దక్కింది. కంపెనీ నుంచి తాజాగా వచ్చిన అడ్వెంచర్ ర్యాలీ టూరర్ మోటార్‌సైకిల్ టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ (Apachi RTX), జెకె టైర్ అందించే 2026 ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ (IMOTY) అవార్డును గెలుచుకుని దేశవ్యాప్తంగా ఆటో ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ఇది టీవీఎస్‌కు మాత్రమే కాదు, భారత మోటార్‌సైకిల్ పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును పొందడం అంత ఈజీ కాదు. భారతదేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన 27 మంది సభ్యుల ప్రత్యేక జ్యూరీ టీవీఎస్ అపాచీ RTXను సవివరంగా పరీక్షించి, అన్ని కోణాల్లో మూల్యాంకనం చేసింది.
డిజైన్, ఇంజినీరింగ్, పనితీరు, టెక్నాలజీ, రైడింగ్ అనుభూతి వంటి అనేక అంశాలపై లోతైన పరిశీలన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఈ అవార్డు పోటీలో వివిధ సెగ్మెంట్లకు చెందిన ఏడు అత్యంత పోటీతత్వ మోటార్‌సైకిళ్లతో కూడిన షార్ట్‌లిస్ట్ నుంచి టీవీఎస్ అపాచీ RTX అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంటే కేవలం అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్‌లోనే కాదు, మొత్తం మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే ఇది తన ప్రత్యేకతను చాటుకున్నట్టు స్పష్టమవుతోంది.

అడ్వెంచర్ రైడింగ్, లాంగ్ టూరింగ్, ఆఫ్-రోడ్ సామర్థ్యం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అపాచీ RTX, టీవీఎస్ రేసింగ్ డీఎన్‌ఏను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవార్డు ద్వారా టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని, ఇన్నోవేషన్‌పై ఉన్న నిబద్ధతను మరోసారి నిరూపించినట్టయింది. మొత్తంగా 2026 IMOTY అవార్డు గెలుచుకోవడం టీవీఎస్ అపాచీ RTXకు మాత్రమే కాకుండా, టీవీఎస్ బ్రాండ్‌కు ఒక మైలురాయిగా నిలిచింది.
ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ విమల్ సాంబ్లి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, జేకే టైర్ ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2026(IMOTY)లో ఈ గుర్తింపు లభించడం పట్ల మేము ఎంతో గర్విస్తున్నాము. ఈ గౌరవం కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు, టీవీఎస్ మోటార్ కంపెనీగా మేము సంవత్సరాలుగా నిర్మించుకున్న బలమైన పనితీరు వారసత్వానికి ఇది సాక్ష్యం అని అన్నారు.

అలాగే , ఈ విజయం వెనుక 40 సంవత్సరాలకు పైగా ఉన్న మా రేసింగ్ నైపుణ్యం, 35 సంవత్సరాల ర్యాలీ అనుభవం ఉంది. అనుభవాన్ని మేము ప్రతి కొత్త ఉత్పత్తిలో ప్రతిబింబించేందుకు ప్రయత్నిస్తున్నాము. అపాచీ RTX రూపంలో అదే ఆత్మను, అదే పనితీరును రోడ్లపైకి తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఈ అవార్డు, కంపెనీ రేసింగ్ ట్రాక్ నుంచి రియల్ వరల్డ్ రైడింగ్ వరకు సంపాదించిన అనుభవానికి గుర్తింపుగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
టీవీఎస్ అపాచీ RTX ధర, పనితీరు, ఫీచర్ల పరంగా అడ్వెంచర్-ర్యాలీ టూరర్ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా రూపొందించబడింది. ధర రూ. 1.99 లక్షల నుంచి రూ. 2.29 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). టీవీఎస్ దీనిని బేస్, టాప్, BTO (Built To Order) అనే మూడు వేరియంట్లలో అందించనుంది. ముఖ్యంగా BTO వేరియంట్ ద్వారా కస్టమర్ తన అవసరాలకు అనుగుణంగా బైక్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కొత్తగా అభివృద్ధి చేసిన RT-X D4 299.1 cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ బైక్‌కు హార్ట్‌గా పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 36 PS పవర్, 28.5 Nm టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ఇది సాధారణ రైడింగ్ పరిస్థితుల్లో లీటర్‌కు 30 నుంచి 35 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలదని అంచనా. ఇందులో 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్ అందించడం వల్ల దూర ప్రయాణాలకు ఇది మరింత అనుకూలం.


Click it and Unblock the Notifications








