67 కి.మీ మైలేజీ బైకును 16 లక్షల మంది కొన్నారు.. అంత స్పెషల్ ఏంటి? మీ దగ్గర కూడా ఉందా?
దేశీయ ద్విచక్రవాహన రంగంలో టీవీఎస్ (TVS) ఎప్పటినుంచో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ. దానికి కారణం నమ్మకమైన ఇంజిన్‌లు, అందుబాటులో ఉండే ధరలు, మైలేజ్ విషయంలో కస్టమర్లను నిరాశపరచని మోడళ్లే. వీటిలో టీవీఎస్ రైడర్ (TVS Raider) అనేది ఒక ప్రత్యేకమైన మోడల్. 2021లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ బైక్, తక్కువ సమయంలోనే బైక్ ప్రియుల మనసు దోచుకుంది. రోజువారీ ఉద్యోగాలు, కాలేజీకి వెళ్లడం, షాపింగ్ లేదా చిన్నపాటి ట్రిప్‌లు వంటి ప్రతీ అవసరానికి ఇది సరైన ఎంపికగా మారింది. పెట్టిన ప్రతి రూపాయికి తగిన మైలేజ్ ఇచ్చే రైడర్, పెర్ఫామెన్స్ విషయంలోనూ వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. యువతరానికి నచ్చే స్పోర్టీ డిజైన్, ఆధునిక ఫీచర్లు దీనిని మరింత డిమాండ్‌లో నిలిపాయి.
తాజాగా రైడర్ ఒక మైలురాయిని దాటింది. ప్రారంభించిన నాలుగేళ్లలోనే 1.6 మిలియన్ యూనిట్లు విక్రయించబడింది. ఈ నెల వరకు 16,04,355 యూనిట్లు అమ్ముడవ్వగా, మొత్తం అమ్మకాలలో 1.35 మిలియన్ యూనిట్లు దేశీయ మార్కెట్లోనే జరిగాయి. అలాగే కంపెనీ దాదాపు 2 లక్షల యూనిట్లను ఎగుమతి చేసి తన గ్లోబల్ ప్రెజెన్స్‌ను కూడా పెంచుకుంది. రైడర్ ఒక్కదాని అమ్మకాలే కంపెనీ మొత్తం మోడల్ సేల్స్‌లో 39 శాతం వాటాను సాధించడం గమనార్హం.

టీవీఎస్ పోర్ట్‌ఫోలియోలో ఇది అత్యంత కీలకమైన మోడల్‌గా నిలిచిందని చెప్పాలి. హీరో Xtreme 125R, బజాజ్ పల్సర్ N125 లాంటి బలమైన పోటీదారులు ఉన్నా కూడా రైడర్ డిమాండ్ తగ్గలేదంటే, దాని ప్రాముఖ్యత, కస్టమర్ల నమ్మకం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ విజయానికి ప్రధాన కారణం ఆకర్షణీయమైన లుక్, ఆధునిక ఫీచర్లు, మైలేజ్-పెర్ఫామెన్స్. వీటన్నింటి కలయికతో రైడర్ 125cc సెగ్మెంట్‌లో ఒక గేమ్‌చేంజర్‌గా నిలిచింది.
124.8 cc ఎయిర్-అండ్-ఆయిల్ కూల్డ్ 3V ఇంజిన్‌తో నడిచే ఈ బైక్, 7,500 rpm వద్ద 11.2 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఐదు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కలిపి ఇది 99 kmph గరిష్ట స్పీడ్‌ను అందించగలదు. రోజువారీ వాడకానికి మాత్రమే కాదు, వేగం, మైలేజ్ రెండింటినీ కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్యాకేజీ. 67 kmpl మైలేజ్ అనే గణాంకమే దీని బలాన్ని చూపిస్తుంది.

అమ్మకాల సందర్భంగా కంపెనీ TVS రైడర్ IGO వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్‌లో తొలిసారి iGO అసిస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. సెగ్మెంట్-ఫస్ట్‌గా వచ్చిన బూస్ట్ మోడ్ దీని హైలైట్. దీని సహాయంతో రైడర్ 0 నుంచి 60 kmph వేగాన్ని కేవలం 5.8 సెకన్లలో అందుకోగలదు. అదే సమయంలో ఇంధన సామర్థ్యంలో కూడా 10% మెరుగుదలను చూపించడం విశేషం. లుక్ పరంగా కూడా రైడర్ IGO కొత్త మేకోవర్‌తో వచ్చింది.
దీని కాంట్రాస్ట్ రెడ్ అల్లాయ్ వీల్స్, కొత్త నార్డో గ్రే కలర్ ఆప్షన్ దీని స్టైలిష్ లుక్‌కి మరింత అందాన్ని తెచ్చాయి. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే, 85కి పైగా కనెక్ట్ ఫీచర్లు కలిగిన రివర్స్ LCD కనెక్టెడ్ క్లస్టర్ ఈ బైక్‌లో అందుబాటులో ఉండటం ఒక పెద్ద అదనపు ఆకర్షణ. టీవీఎస్ రైడర్ 125 ప్రస్తుతం విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది.

వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని డ్రమ్, సింగిల్ సీట్, స్ప్లిట్ సీట్, iGO, SSE, SX మోడల్స్‌ను ఎంచుకోవచ్చు. ఎంట్రీ-లెవల్ డ్రమ్ వేరియంట్ ధర రూ.87,375 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇక టాప్-ఎండ్ SX వేరియంట్ ధర రూ.1,02,665(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, జీఎస్టీ మినహాయింపు ఈ నెల 22నుంచి అమల్లోకి రానుంది. దాని ప్రభావంతో రైడర్ 125 ధరలు మరింత తగ్గుతాయని అంచనా.


Click it and Unblock the Notifications








