టీవీఎస్ ఐక్యూబ్‌లో అదిరిపోయే ఫీచర్.. టీవీఎస్, నాయిస్ కలిసి అద్భుతం.. స్మార్ట్ వాచ్‌తో స్కూటర్ నడపొచ్చు
ప్రస్తుతం భారతదేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో టీవీఎస్ ఐక్యూబ్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ సెగ్మెంట్లో పోటీ రోజురోజుకీ పెరుగుతుండటంతో కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా, ఆకర్షణీయంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఒక వినూత్నమైన అడుగు వేసింది. దేశంలోని ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ అయిన నాయిస్ (Noise)తో చేతులు కలిపి ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ కొత్త పార్టనర్ షిప్ ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నాయిస్ స్మార్ట్‌వాచ్‌తో కనెక్ట్ చేయవచ్చు. దీనితో రైడర్లు తమ స్కూటర్ గురించిన పూర్తి సమాచారాన్ని, సేఫ్టీ హెచ్చరికలను నేరుగా తమ చేతిలో ఉన్న వాచ్‌లోనే చూసుకోవచ్చు.

స్మార్ట్‌వాచ్‌తో స్కూటర్ సమాచారం
ఈ కొత్త టెక్నాలజీ సాయంతో రైడర్లు తమ స్కూటరుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఒకేసారి చూడవచ్చు. ఇందులో ముఖ్యంగా స్కూటర్ బ్యాటరీ ఎంత ఛార్జింగ్ ఉందో శాతంలో చూపిస్తుంది. టైర్లలో గాలి ఒత్తిడి(టైర్ ప్రెజర్) ఎంత ఉందో వాచ్‌లోనే తెలుసుకోవచ్చు.
స్కూటర్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు, అది ఎంత శాతం పూర్తయిందో ఇంకా ఎంత సమయం పడుతుందో వాచ్‌లో అప్‌డేట్స్ వస్తాయి. మిగిలిన బ్యాటరీతో స్కూటర్ ఎంత దూరం ప్రయాణించగలదో కూడా అంచనా వేసి చూపిస్తుంది. అలాగే దొంగతనం, ప్రమాదాలు వంటి వాటి గురించి హెచ్చరికలు వెంటనే వాచ్‌కు వస్తాయి.

ఈ ఫీచర్లు రైడర్లకు ఎంతో సౌలభ్యాన్ని అందిస్తాయి. స్కూటర్ స్టేటస్ తెలుసుకోవడానికి ప్రతిసారి మొబైల్ ఫోన్‌ను బయటికి తీయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, రైడింగ్ సమయంలో దృష్టి మరలకుండా, వాచ్ ద్వారానే సమాచారం పొందవచ్చు. ఈ సిస్టర్ యూజర్ పర్మీషన్, సురక్షితమైన ఏపీఐ (API)లపై ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి, వినియోగదారుల ప్రైవసీకి ఎటువంటి భంగం కలగదని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది.
మార్కెట్‌లో టీవీఎస్ ఆధిపత్యం
టీవీఎస్ ఐక్యూబ్ ఇటీవల భారతదేశంలో 6.5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. ఇది ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో టీవీఎస్ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. కొత్త స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్‌తో, టీవీఎస్ తన కనెక్టెడ్ ఎకోసిస్టమ్‌ను విస్తరించాలని, వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం టూ వీలర్ వెహికల్స్ మీద జీఎస్‌టీ రేట్లను తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా అందించిన మొదటి కంపెనీలలో టీవీఎస్ ఒకటి. టీవీఎస్ రోనిన్ నుండి జెస్ట్ 110 వరకు అనేక మోడళ్ల ధరలను రూ.6,007 నుండి రూ.10,546 వరకు తగ్గించినట్లు ప్రకటించింది. ఈ కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి.
ధర, కొనుగోలు వివరాలు
టీవీఎస్ ఐక్యూబ్ నాయిస్ స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం రూ.2,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ను టీవీఎస్ ఐక్యూబ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం కొనుగోలు చేసే వారికి 12 నెలల నాయిస్ గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.
ఈ వినూత్నమైన అడుగుతో, టీవీఎస్ తమ కస్టమర్లకు కేవలం ఒక వాహనం మాత్రమే కాకుండా, ఒక కంప్లీట్ కనెక్టెడ్, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలని కోరుకుంటుంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో టెక్నాలజీలను ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications








