53 కి.మీ మైలేజ్.. ఆఫీసుకి, షాపింగ్‌కి వెళ్ళడానికి బెస్ట్ స్కూటర్.. వేరియంట్ల వారీగా జూపిటర్ కొత్త ధరలు
సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా సవరించిన వస్తువులు, సేవల పన్ను (GST) రేట్లు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మార్పులు ముఖ్యంగా టూవీలర్ వాహనాల మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటి వరకు 350 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైకులు, స్కూటర్లపై 28 శాతం GST విధించబడుతుండగా, ఇప్పుడు దానిని 18 శాతానికి తగ్గించారు. అంటే, కస్టమర్ కొనుగోలు చేసే వాహనంపై ప్రత్యక్షంగా ధరలో తగ్గింపు లభించేలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ తగ్గింపు వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందుతున్న స్కూటర్లలో TVS జూపిటర్ ఒకటి. పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ పొందిన ఈ స్కూటర్, ఇంధన సామర్థ్యం, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి లక్షణాలతో ఇప్పటికే కుటుంబాల ఫేవరెట్‌గా నిలిచింది.
ఇప్పుడు GST రేటు తగ్గింపుతో ఈ స్కూటర్ ధర మరింత అందుబాటులోకి వచ్చింది. ఎక్స్-షోరూమ్ ధరలో ప్రత్యక్షంగా తగ్గుదల చోటుచేసుకోవడం వల్ల కొనుగోలు దారులు ఆర్థికంగా కొంత భారం తగ్గించుకోగలిగే అవకాశం పొందుతున్నారు. దీంతో, జూపిటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పవచ్చు. మునుపటి కంటే తక్కువ ధరకు దీనిని కొనచ్చు. ఇప్పుడు ఈ కథణంలో జూపిటర్ వేరియంట్ల వారీగా ధరల గురించి చూద్దాం.

TVS Jupiter 110: టీవీఎస్ జూపిటర్ 110 భారతీయ మార్కెట్లో అత్యంత నమ్మకమైన స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. ఇది ఎప్పటినుంచో మైలేజ్, సౌకర్యం, సింపుల్ హ్యాండ్లింగ్ లక్షణాలతో కుటుంబ వాహనంగా పేరుపొందింది. ఇప్పుడు GST సవరణల కారణంగా ఈ స్కూటర్ మరింత చౌకగా లభిస్తోంది. దీని డ్రమ్ వేరియంట్ రూ. 75,900, డ్రమ్-అల్లాయ్ రూ. 79,900, డ్రమ్ SXC రూ. 83,700 గా ఉంది.
అలాగే డిస్క్ SXC రూ. 87,200, స్పెషల్ ఎడిషన్ రూ. 88,100 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. అంటే, విభిన్న బడ్జెట్‌లకు సరిపోయేలా పలు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది లీటరు పెట్రోల్‌కు దాదాపు 53 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. కొత్త జూపిటర్ 110 స్కూటర్ 113.3 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. దీనిలో యుఎస్‌బి ఛార్జర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ వంటివి ఉన్నాయి.

TVS Jupiter 125: టీవీఎస్ జూపిటర్ 125, శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ కలయికగా మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని డ్రమ్-అల్లాయ్ వేరియంట్ రూ. 82,900, డిస్క్ వేరియంట్ రూ. 87,400, DT SXC వేరియంట్ రూ. 89,600, అలాగే స్మార్ట్‌కనెక్ట్ వేరియంట్ రూ. 92,300 (ఎక్స్-షోరూమ్). విభిన్న బడ్జెట్‌లకు సరిపోయేలా, ప్రతి వేరియంట్ ప్రత్యేక ఫీచర్లతో అందుబాటులో ఉంది.
జూపిటర్ 125లో 124.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. ఇది సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేల మీదనూ మంచి ప్రదర్శన ఇస్తూ సుమారు 50 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు తక్కువ ఇంధన వినియోగం దీన్ని ఒక ఆర్థికమైన స్కూటర్‌గా నిలబెడుతోంది. ఇది పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ సాకెట్ వంటి ఆధునిక సౌకర్యాలతో వస్తుంది.

TVS Jupiter CNG: CNG ఆధారిత స్కూటర్ అతి త్వరలో విడుదల కానుంది. ధర పరంగా రూ. 90,000 నుండి రూ. 1 లక్ష(ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్‌గా నిలుస్తుంది.ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చబడింది. ఇది ఒక ఫుల్ ట్యాంక్ CNGతో 226 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.


Click it and Unblock the Notifications








