విదేశాల్లో ఈ మోడల్‌కు బ్రహ్మరథం.. చిరస్థాయిగా నిలిచే ఘనత సాధించిన టీవీఎస్
భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అందరి చూపు కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. పలు తయారీదారులు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్స్, మంచి బ్యాటరీ పనితీరు కలిగిన వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. లోకల్‌గా విక్రయిస్తూనే ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ పరిశ్రమలో TVS మోటార్ కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘనతను సాధించింది. దేశం నుంచి ఎగుమతైన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏకంగా 86 శాతం వాటాను TVS ఒంటరిగా తన ఖాతాలో వేసుకుంది. ఇది కేవలం ఎగుమతుల గణాంకం మాత్రమే కాక, గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సంస్థగా TVS తన స్థిరమైన ఆధిపత్యాన్ని ప్రతిబింబించే ఉదాహరణగా నిలుస్తోంది.
ఇండియాలో తయారైన వాహనాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని గణంకాలను చూస్తేనే తెలిసిపోతుంది. టీవీఎస్ 5,913 యూనిట్లతో ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులలో అగ్రస్థానంలో ఉంది. ఈ ఎగుమతుల్లో BMW CE 02 అనే మోడల్ కీలక పాత్ర పోషించింది. BMW Motorradతో కలసి TVS చేసిన జాయింట్ వెంచర్, ఒక్కటిగా 75 శాతానికి పైగా ఎగుమతులను సాధించడం విశేషం.

4,400 యూనిట్ల CE 02 మోడల్, ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లకు అంతర్జాతీయంగా ఎంతగా డిమాండ్ ఉందో స్పష్టం చేసింది. iQube మాదిరిగా TVS తయారు చేసే మోడళ్లలోని డిజైన్, పెర్ఫార్మెన్స్ గ్లోబల్ ఆమోదానికి మూల కారణాలు. మొత్తం భారత ఎలక్ట్రిక్ స్కూటర్ ఎగుమతుల మార్కెట్ కూడా కొత్త ఎత్తుకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 325 శాతం వృద్ధితో, 2025లో 7,000 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎగుమతులు జరిగాయి.
భారతదేశం ఇప్పుడు కేవలం ఒక మార్కెట్‌గానే కాకుండా, ప్రపంచ ఎలక్ట్రిక్ మోటార్‌వాహన రంగానికి కీలక ఉత్పత్తి కేంద్రంగా మారుతుండగా, TVS అగ్ర స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం భారతీయ స్కూటర్ పరిశ్రమకు గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. మొత్తం 5.69 లక్షల స్కూటర్లు విదేశాలకు ఎగుమతవడంతో, ఈ రంగం వరుసగా రెండవ సంవత్సరం 5 లక్షల మార్కును దాటి, సరికొత్త మైలురాయిని స్థాపించింది.

ఇందులో ఎలక్ట్రిక్ స్కూటర్ల పాత్రను విస్మరించలేం. ఈ ఏడాది మొత్తం ఎగుమతుల్లో 1 శాతం వాటాను సాధించడం ఒక గణనీయమైన పురోగతిగా పరిగణించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా మారుతున్న మొబిలిటీ ధోరణులను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న స్వీకరణను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. వీటిలో TVS మోటార్ కంపెనీ కీలక పాత్ర పోషించింది. దేశీయంగా TVS తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 18.1 లక్షల స్కూటర్ల అమ్మకాలతో ఆకట్టుకుంది.
ఈ మొత్తం 35.1 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన ఆర్థిక సంవత్సరాన్ని TVS నమోదు చేసింది. BMW CE 02, TVS iQube వంటి మోడళ్లు స్థానికంగా మాత్రమే కాక, అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి స్పందన పొందాయి. BMW Motorradతో కలిసిన భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన CE 02, ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో TVS ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

ఇక iQube, దేశీయంగా గ్రీన్ మొబిలిటీకి మారుతున్న వినియోగదారుల అభిరుచిని సమర్థవంతంగా తీర్చింది. ఎగుమతుల్లో TVS తర్వాత, Ather Energy ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎగుమతి చేసి రెండవ స్థానంలో నిలిచింది. ప్రధానంగా ఏథర్ 450X, 450S 2025 ఆర్థిక సంవత్సరంలో దాని ఎగుమతుల్లో 12 శాతం దోహదపడ్డాయి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను 125 యూనిట్లను ఎగుమతి చేసింది.


Click it and Unblock the Notifications








