హోండా, హీరోలను వెనక్కి నెట్టి టీవీఎస్ జోరు.. ఏప్రిల్‌లో రికార్డ్ బ్రేకింగ్ సేల్స్.. వీటికి ఎందుకంత డిమాండ్ ?
దేశీయంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అద్బుతమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. హోండా, హీరో, బజాజ్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ, టీవీఎస్ ఏకంగా 16 శాతం వృద్ధిని సాధించడం విశేషం.
గత ఏడాది ఏప్రిల్‌లో (2024) 3,83,615 యూనిట్ల వాహనాలను విక్రయించిన టీవీఎస్, ఈ ఏడాది ఏప్రిల్‌లో (2025) 4,43,896 యూనిట్లకు అమ్మకాలు పెంచుకుంది. అంటే దాదాపు 60 వేల యూనిట్లకు పైగా అదనంగా వాహనాలను విక్రయించింది. టీవీఎస్ మోటార్స్ ఈ ఘన విజయంలో అన్ని విభాగాల వాహనాలు తమ వంతు పాత్ర పోషించాయి.

ద్విచక్ర వాహన విభాగం 15 శాతం వృద్ధితో ఏప్రిల్ 2024లో 3,74,592 యూనిట్ల నుంచి ఏప్రిల్ 2025లో 4,30,330 యూనిట్లకు చేరుకుంది. ఇక దేశీయంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం పెరిగి 3,01,449 యూనిట్ల నుంచి 3,23,647 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్ విభాగంలో టీవీఎస్ ఏకంగా 17 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఏప్రిల్ 2024లో 1,88,110 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే నెలలో 2,20,527 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్కూటర్ల విభాగం కూడా ఏమాత్రం తగ్గలేదు. 18 శాతం వృద్ధితో అమ్మకాలు 1,44,126 యూనిట్ల నుంచి 1,69,741 యూనిట్లకు పెరిగాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన టీవీఎస్‌కు ఈ విభాగం కూడా కలిసి వచ్చింది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో ఏకంగా 59 శాతం వృద్ధి నమోదైంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏప్రిల్ 2024లో 17,403 యూనిట్లు ఉండగా, ఈ ఏడాది అదే నెలలో 27,684 యూనిట్లకు పెరిగాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా టీవీఎస్ తన సత్తా చాటుతోంది.
కంపెనీ మొత్తం ఎగుమతులు 45 శాతం పెరిగి ఏప్రిల్ 2024లో 80,508 యూనిట్ల నుంచి ఏప్రిల్ 2025లో 1,16,880 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏకంగా 46 శాతం పెరగడం విశేషం. వీటి అమ్మకాలు 73,143 యూనిట్ల నుంచి 1,06,683 యూనిట్లకు పెరిగాయి. ఇక త్రిచక్ర వాహన విభాగంలో కూడా టీవీఎస్ మంచి వృద్ధిని కనబరిచింది.

ఈ విభాగంలో 50 శాతం వృద్ధితో అమ్మకాలు ఏప్రిల్ 2024లో 9,023 యూనిట్ల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో 13,566 యూనిట్లకు పెరిగాయి. మొత్తంగా చూస్తే, టీవీఎస్ మోటార్ కంపెనీ అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది.
భారతీయ మార్కెట్‌లో ఈ వాహనాలకు ఉన్న డిమాండ్‌ను ఈ అమ్మకాల గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో తమ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి, మరిన్ని కొత్త వాహనాలను పరిచయం చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








