165 కి.మీల రేంజ్ బైక్.. వచ్చిన 24 గంటల్లోనే వెయ్యి బుకింగ్స్.. ఇప్పుడు మొత్తం 7,000 దాటిన షాక్‌వేవ్!
భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ స్టార్టప్ అల్ట్రావయోలెట్ (Ultraviolett) పేరు ఇటీవల మారుమోగుతుంది. దిగ్గజ కంపెనీలకు పోటీగా మెరుగైన బ్యాటరీ, అద్బుతమైన పనితీరుతో కూడిన వాహనాలను విడుదల చేస్తూ మార్కెట్లో తన ఉనికిని బలంగా చాటుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటి వరకు ఈవీ స్కూటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. సిటీ రైడింగ్‌కు అనుకూలంగా ఉండే వీటి సౌలభ్యం, అందుబాటు ధర వలన వినియోగదారులు ఎక్కువగా స్కూటర్లవైపే మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ, ఇప్పుడు వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. స్టైల్, పనితీరు కోరే వారు ఎలక్ట్రిక్ బైక్‌లవైపు ఆసక్తిని చూపుతున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన కొన్ని కంపెనీలు తమ సొంత మార్క్ వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో అల్ట్రావయోలెట్ ఒక విప్లవాత్మక బైకును తీసుకువచ్చింది. దాని పేరే షాక్‌వేవ్ (Shockwave). సాధారణంగా మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌లు ఎక్కువగా సాంప్రదాయ డిజైన్, సిటీ రైడింగ్‌కు సరిపోయే ఫీచర్లతో వస్తున్నాయి. అయితే షాక్‌వేవ్ బైక్ రోజూ రైడ్‌కే కాదు, వారం చివరలో అడ్వెంచర్ కోసం కూడా సిద్ధంగా ఉంటుంది. దీన్ని డ్యూయల్-పర్పస్ ఎలక్ట్రిక్ బైక్‌గా రూపొందించడమే ఈవీ సెగ్మెంట్‌లో ఒక కొత్త ఒరవడి.

ఒకే వాహనంతో రోజువారీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి, అలాగే వీక్ ఎండ్ ట్రిప్స్‌కి కూడా సిద్ధంగా ఉండాలనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది. తాజాగా కంపెనీ నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం, అల్ట్రావయోలెట్ Shockwave బైక్‌కి మార్కెట్‌లోనే మంచి స్పందన వస్తోంది.ఇది ఇప్పటికే 7,000 పైగా బుకింగ్‌లు సాధించిందని ప్రకటించింది. డిజైన్ పరంగా ఫ్యూచరిస్టిక్ స్టైల్‌తో ఆకట్టుకునే ఈ బైక్, టెక్నాలజీ పరంగా కూడా కొత్త ఒరవడిని ప్రదర్శిస్తోంది.
ఈ సంవత్సరం మార్చిలో అధికారికంగా పరిచయం చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రీ-బుకింగ్ విండో తెరిచిన మొదటి 24 గంటలలోనే 1,000 కి పైగా బుకింగ్‌లు వచ్చాయి. ఇదే ఆధారంగా చూస్తే, ఈ బైక్‌పై ఉన్న క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతుంది. డెలివరీలు వచ్చే ఏడాది నుంచే ప్రారంభం కానున్నా, ఇప్పటి నుంచే బుకింగ్‌లను చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైకు ప్రత్యేకతలు చూస్తే వినియోగదారులను ఆకర్షించేలా ఉంది.

భారతదేశంలో షాక్‌వేవ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.75 లక్షలుగా నిర్ణయించారు. అయితే కంపెనీ ప్రారంభ ఆఫర్‌గా, మొదటి 2,000 మందికి ప్రత్యేకంగా రూ. 1.50 లక్షల పరిచయ ధరను మాత్రమే వసూలు చేసింది. ఆఫర్ ముగిసిన తరువాత, మోడల్ ధరను సుమారుగా రూ.25,000 పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ బైక్ కేవలం డిజైన్ పరంగానే కాకుండా, ఫంక్షనాలిటీ పరంగానూ, సిటీ రైడ్, ఆఫ్-రోడ్ అడ్వెంచర్.. రెండింటికీ సరిపోయేలా డ్యూయల్ పర్పస్‌గా వస్తోంది.
బ్యాటరీ విషయానికి వస్తే, కంపెనీ ఇంకా అధికారికంగా బ్యాటరీ వివరాలను ప్రకటించలేదు. అయితే దీనిలో 4 kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 120 కి.మీలుగా ఉంటుంది. కంపెనీ ఈ స్పీడ్‌ను రైడర్ల భద్రత కోసం పరిమితం చేసింది. పనితీరు పరంగా షాక్‌వేవ్ కేవలం 2.9 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు. ఛార్జింగ్ పరంగా చూస్తే, Ultraviolette Supernova ఫాస్ట్ ఛార్జర్ సాయంతో 30 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే మినిమల్ టైమ్‌లో మ్యాక్సిమమ్ ఛార్జ్ పొందేలా దీనిని డిజైన్ చేశారు. ప్రయాణాల్లో వేగంగా ముందుకు సాగాలనుకునే వారికి ఇది బెస్ట్.


Click it and Unblock the Notifications








