ఆటోమొబైల్ కంపెనీలకు ప్రభుత్వం షాక్..అమ్మకాలు పడిపోయి మూతపడే స్థితికి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, కొన్ని కంపెనీలు ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ సబ్సిడీల దుర్వినియోగం కారణంగా కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల చిన్న కంపెనీలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం FAME అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని రెండో దశ, FAME-II, కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనుగోలుదారులకు భారీ సబ్సిడీలు ఇచ్చేవారు. అయితే, ఈ సబ్సిడీలు పొందాలంటే వాహనాలను భారత్‌లోనే తయారు చేయాలనే నిబంధన ఉంది. దీనినే ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు.

కొన్ని కంపెనీలు ఈ నిబంధనలను పాటించకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో వాహనాలను తయారు చేసి, సబ్సిడీలు తీసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఆడిట్ నిర్వహించింది. అందులో ఓకినావా, హీరో ఎలక్ట్రిక్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ (ఆంపియర్), బెన్లింగ్, ఏఎంఓ మొబిలిటీ వంటి కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలింది.
దీంతో ప్రభుత్వం సబ్సిడీలు నిలిపివేయడమే కాకుండా, ఇప్పటికే తీసుకున్న సబ్సిడీలను వెనక్కి ఇవ్వమని ఆదేశించింది. మొత్తం సుమారు రూ.469 కోట్ల సబ్సిడీ తిరిగి చెల్లించాల్సి ఉంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ నిర్ణయం వల్ల ఈ కంపెనీల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. భారీగా అమ్మకాలు పడిపోయాయి. గతంలో మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న హీరో కంపెనీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. 2023లో 29,965 యూనిట్లు అమ్మిన కంపెనీ, 2024లో కేవలం 2,916 యూనిట్లకు పడిపోయింది. ఇప్పుడు ఈ కంపెనీ దివాళా తీసే స్థితికి చేరింది.
ఓకినావా ఆటోటెక్ కంపెనీది కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. 2023లో 31,618 యూనిట్లు అమ్ముడవగా, 2024లో కేవలం 4,855 యూనిట్లకు పడిపోయింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కి చెందిన ఆంపియర్ అమ్మకాలు కూడా దారుణంగా తగ్గాయి. 2023లో 66,958 యూనిట్లు అమ్మిన వీరు, 2024లో 36,148 యూనిట్లకు, 2025లో ఇప్పటివరకు 26,963 యూనిట్లకు పడిపోయారు.

సబ్సిడీలను తిరిగి చెల్లించమని ఆదేశించినప్పుడు కొన్ని కంపెనీలు ప్రభుత్వం మాట విన్నాయి. రివోల్ట్, గ్రీవ్స్, ఏఎంఓ మొబిలిటీ వంటి కంపెనీలు కలిసి సుమారు రూ.170 కోట్లు తిరిగి చెల్లించాయి. అయితే, హీరో ఎలక్ట్రిక్, ఓకినావా, బెన్లింగ్ వంటి కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాయి. ఈ లీగల్ పోరాటం వాటి భవిష్యత్తును మరింత అనిశ్చితిలోకి నెట్టింది.
కొన్ని కంపెనీలు ఈ సమస్యల్లో ఇరుక్కున్నప్పటికీ, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలు మాత్రం మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నాయి. ఇటీవల ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం ఒక సంవత్సరంలోనే లక్ష యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకుని ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. దీనిని బట్టి నిబంధనలు పాటించే కంపెనీలకు భారత మార్కెట్లో మంచి భవిష్యత్తు ఉందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications








