10 ఏళ్ల వారంటీ, 71.33 కి.మీ మైలేజ్.. అద్భుతమైన ఫీచర్లతో యమహా కొత్త స్కూటర్
భారతదేశంలో స్కూటర్ మార్కెట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ యమహా కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఫాసినో, రే ZR, ఏరోక్స్ అనే మూడు మోడళ్లతోనే మంచి అమ్మకాలను సాధిస్తున్న ఈ కంపెనీ ఇప్పుడు తమ మోడళ్లను అప్‌డేట్ చేస్తూ మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా ఫ్యామిలీ, మహిళా కస్టమర్లకు ఇష్టమైన ఫాసినో హైబ్రిడ్‌కు కొత్త అప్‌డేట్‌లను ఇచ్చిన యమహా, ఇప్పుడు యువతకు బాగా నచ్చే రే ZR స్కూటర్ కొత్త వెర్షన్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసింది.
యమహా మోటార్ ఇండియా తమ స్కూటర్ శ్రేణిని 2025 మోడల్ సంవత్సరానికి అప్‌డేట్ చేసే క్రమంలో రే ZR 125 హైబ్రిడ్ స్కూటర్‌లో అనేక మార్పులను తీసుకొచ్చింది. స్కూటర్ స్పోర్టీ లుక్‌ను మరింత మెరుగుపరుస్తూనే ఇందులో కొత్త ఫీచర్లను చేర్చారు. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,340 నుండి మొదలవుతుంది. దీని టాప్ మోడల్ ధర రూ. 92,970 వరకు ఉంటుంది. ఈ ధరతో ఇది దేశంలో లభించే అత్యంత తక్కువ ధర కలిగిన 125 సీసీ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది.

కొత్త 2025 యమహా రే ZR 125 అతిపెద్ద హైలైట్ ఇందులో చేర్చిన ఎన్‌హాన్స్‌డ్ పవర్ అసిస్ట్ ఫంక్షన్. ఈ ఫీచర్ అధిక కెపాసిటీ గల బ్యాటరీని ఉపయోగించి, స్కూటర్ స్టార్ట్ అయినప్పుడు లేదా తక్కువ వేగంలో ఉన్నప్పుడు అదనపు టార్క్ అందిస్తుంది. ముఖ్యంగా, బరువు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎత్తుపైకి వెళ్ళేటప్పుడు ఈ ఫీచర్ ఆక్సిలరేషన్‌ను మెరుగుపరచి, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది.
మైలేజీని పెంచడానికి, కొత్త రే ZR 125లో యమహా స్టార్టర్ మోటార్ జనరేటర్, స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌ను కొనసాగించింది. అంతేకాకుండా, ఈ హైబ్రిడ్ స్కూటర్ కొత్త మోడల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త టీఎఫ్‌టీ డిజిటల్ కన్సోల్‌ను చేర్చారు. ఈ కన్సోల్ గూగుల్ మ్యాప్స్‌తో ఇంటిగ్రేట్ అయి టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందిస్తుంది.

యమహా Y-కనెక్ట్ మొబైల్ యాప్ ద్వారా ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. లైవ్ డైరెక్షన్, ఇంటర్‌సెక్షన్ హెచ్చరికలు, రోడ్ల పేర్లను కూడా ఈ డిజిటల్ కన్సోల్‌లో చూడవచ్చు. కొత్త యమహా రే ZR 125 హైబ్రిడ్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్, సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఫంక్షన్, ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్, 21 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌లో కొన్ని కొత్త రంగుల ఆప్షన్లను కూడా చేర్చారు.
స్కూటర్‌లో ఉన్న 125 సీసీ ఫ్యూయల్-ఇంజెక్షెడ్ ఇంజిన్ ఈ20 ఫ్యూయల్‌తో పని చేస్తుంది. ఇది 8 బిహెచ్‌పి పవర్, 10.3 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ ఇంజిన్, స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సహాయంతో సైలెంట్ స్టార్టప్, మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఏఆర్ఏఐ సంస్థ ప్రకారం, ఈ హైబ్రిడ్ స్కూటర్ లీటర్‌కు 71.33 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది, ఇది ఈ సెగ్మెంట్‌లో ఒక అద్భుతమైన ఫీచర్.

సస్పెన్షన్ కోసం ఈ స్కూటర్‌లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అమర్చారు. 2025 రే ZR స్కూటర్ బుకింగ్‌లు ఇప్పటికే యమహా డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా, యమహా ఈ స్కూటర్‌పై ఏకంగా పదేళ్ల వారంటీని అందిస్తోంది. ఇందులో రెండేళ్ల స్టాండర్డ్ వారంటీ, ఎనిమిదేళ్ల ఎక్సటెండెడ్ వారంటీ ఉంటుంది. ఇది కస్టమర్లకు మంచి సేఫ్టీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








