బైక్ లాంటి లుక్..సైకిల్ లాంటి బరువు..పెట్రోల్ తాగేది తక్కువ..మైలేజ్ ఇచ్చేది ఎక్కువ..పేదల స్కూటర్ అంటే ఇదే
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) ఇప్పుడు భారత మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒకప్పుడు కేవలం స్పోర్ట్స్ బైక్‌లకు మాత్రమే పెట్టింది పేరైన యమహా, ఇప్పుడు స్కూటర్ల విభాగంలోనూ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha RayZR 125) హైబ్రిడ్ స్కూటర్ అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
2025 నవంబర్ నెలలో యమహా కంపెనీ మొత్తం అమ్మకాల్లో సగానికి పైగా వాటాను ఈ ఒక్క స్కూటరే సొంతం చేసుకోవడం విశేషం. అదిరిపోయే మైలేజీ, మోడ్రన్ ఫీచర్లతో వస్తున్న ఈ స్కూటర్ వివరాలు తెలుసుకుందాం. తాజాగా విడుదలైన 2025 నవంబర్ అమ్మకాల గణాంకాల ప్రకారం.. యమహా రే జెడ్ఆర్ 125 హవా స్పష్టంగా కనిపిస్తోంది. గత నెలలో కంపెనీ విక్రయించిన మొత్తం వాహనాల్లో 50.09 శాతం వాటాను ఈ స్కూటర్ దక్కించుకుంది.

అంటే షోరూమ్‌కి వెళ్తున్న ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ స్కూటర్‌నే కొంటున్నారన్నమాట. యమహాకు పేరు తెచ్చిపెట్టిన FZ సిరీస్, R15, MT-15 వంటి పాపులర్ బైక్‌లను వెనక్కి నెట్టి మరీ ఈ స్కూటర్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. నవంబర్ నెలలో ఏకంగా 21,049 యూనిట్ల రే జెడ్ఆర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే అమ్మకాల్లో సుమారు 46 శాతం వృద్ధి కనిపించడం గమనార్హం.
ఈ స్కూటర్ ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దీనిలోని బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్. ఇందులో ఉండే స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) ట్రాఫిక్‌లో ఆగి స్టార్ట్ చేసేటప్పుడు ఇంజిన్‌కు అదనపు శక్తిని ఇస్తుంది. దీనివల్ల పెట్రోల్ వినియోగం తగ్గి, మైలేజీ పెరుగుతుంది. ఈ స్కూటర్ లీటరుకు 71 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

పెట్రోల్ ధరలు మండుతున్న ఈ సమయంలో మధ్యతరగతి ప్రజలకు, యువతకు ఇది ఒక వరంగా మారింది. కేవలం 99 కిలోల బరువు ఉండటం వల్ల రద్దీగా ఉండే నగరాల్లో దీనిని నడపడం చాలా సులభం. రే జెడ్ఆర్ 125 కేవలం మైలేజీకే పరిమితం కాలేదు. ఇందులో అదిరిపోయే మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు యువతను ఆకర్షిస్తున్నాయి.
యమహా వారి Y-కనెక్ట్ యాప్ ద్వారా మీ ఫోన్ కాల్స్, మెసేజ్ అలర్ట్స్, పార్కింగ్ లొకేషన్ వంటి వివరాలను స్కూటర్ స్క్రీన్‌పైనే చూడవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ స్కూటర్‌పై కంపెనీ 10 ఏళ్ల వరకు వారంటీ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇది కస్టమర్లలో నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం మార్కెట్లో యమహా రే జెడ్ఆర్ 125 ప్రారంభ ధర సుమారు రూ.73,430 (ఎక్స్-షోరూమ్) నుండి అందుబాటులో ఉంది.

భారత మార్కెట్లో హోండా యాక్టివా 125, టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకి యాక్సెస్ 125 వంటి దిగ్గజ స్కూటర్లకు ఇది గట్టి పోటీనిస్తోంది. కేవలం స్టైల్ కోసమే కాకుండా, తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజీ కావాలనుకునే వారు ఇప్పుడు యమహా రే జెడ్ఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి భయపడే వారికి ఈ హైబ్రిడ్ స్కూటర్ ఒక పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయంగా మారింది.


Click it and Unblock the Notifications








