జెలియో నుంచి రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్లు, విశేషాలు వింటే షాక్ అవ్వాల్సిందే
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ జెలియో ఇ మొబిలిటీ, త్వరలో భారత మార్కెట్‌లోకి రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. 2026 రెండో త్రైమాసికం నాటికి ఈ స్కూటర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణించే వారు, విద్యార్థులు, ఉద్యోగులు, పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వారి అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త మోడళ్లను తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లు అడ్వాన్సుడ్ టెక్నాలజీ, నాణ్యమైన నిర్మాణం, మెరుగైన పనితీరును కలిగి ఉంటాయని జెలియో చెబుతోంది.
ఈ కొత్త స్కూటర్ల విడుదల ద్వారా జెలియో తన హై-స్పీడ్ ఈవీల పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే బాగా ప్రజాదరణ పొందిన మిస్టరీ హై-స్పీడ్ స్కూటర్ విజయంతో ఈ అడుగు వేస్తోంది. ఈ స్కూటర్ విడుదలైనప్పటి నుంచి భారతదేశంలో 2,000 కంటే ఎక్కువ యూనిట్లను జెలియో విక్రయించింది.

మిస్టరీ స్కూటర్ పనితీరు, నమ్మకమైన ప్రయాణం కోరుకునే వారికి ఒక మంచి ఎంపికగా నిలిచింది. ఇది 72V/29AH లిథియం-అయాన్ బ్యాటరీ, 72V మోటార్‌తో పనిచేస్తుంది. ఈ స్కూటర్ గంటకు 70 కి.మీ.ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ.ల వరకు ప్రయాణించగలదు. దీని బ్యాటరీని కేవలం 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ బరువు 120 కిలోలు, 180 కిలోల బరువును మోయగలదు.
ఈ కొత్త మోడళ్ల గురించి జెలియో ఇ మొబిలిటీ సహ-వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ.. భారతీయ రైడర్లకు తక్కువ ధరలో, నమ్మకమైన, అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించాలనేది మా లక్ష్యం. మా మిస్టరీ స్కూటర్ విజయం, రోజువారీ జీవితానికి సరిపోయే ఫీచర్లు, మంచి పనితీరు ఉన్న స్కూటర్లను అందించడంపై మా నమ్మకాన్ని పెంచిందని అన్నారు.
"రాబోయే ఈ హై-స్పీడ్ మోడళ్లతో, మేము హై-స్పీడ్ విభాగంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు, వేగంగా పెరుగుతున్న ఈవీ వినియోగదారుల ఆకాంక్షలను కూడా తీర్చగలుగుతాము. ఈ కొత్త స్కూటర్లు అధునాతన డిజైన్‌లు, మెరుగైన పనితీరుతో పాటు, స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, భారతీయ రోడ్లకు తగిన మన్నికైన ఛాసిస్‌ను కలిగి ఉంటాయి.
అలాగే, జెలియో తన కస్టమర్లకు మెరుగైన అమ్మకాల తర్వాత సేవలను కూడా అందిస్తుంది. వాహనాలు, బ్యాటరీలపై పూర్తి వారెంటీని కూడా కవర్ చేస్తుంది. ఇది కస్టమర్ల నమ్మకాన్ని మరింత పెంచుతుంది." అని కునాల్ ఆర్య తెలిపారు.
కొత్త స్కూటర్ల ప్రత్యేకతలు, ధర, లభ్యత గురించి మరిన్ని వివరాలు వాటి విడుదల సమయం దగ్గరగా వచ్చినప్పుడు కంపెనీ వెల్లడించనుంది. 2021లో ప్రారంభమైన జెలియో ఇ మొబిలిటీ, ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఒక కీలక సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
దేశవ్యాప్తంగా 400కి పైగా డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్‌తో పనిచేస్తున్న జెలియో, 2025 చివరి నాటికి ఈ డీలర్‌షిప్‌ల సంఖ్యను 1,000కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications








